Site icon HashtagU Telugu

Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

Montha Cyclone

Montha Cyclone

Montha Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను (Montha Cyclone) కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

శనివారం ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. కాకినాడ జిల్లాలోని సముద్ర తీరం వెంబడి ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా చర్చించారు.

ప‌వ‌న్ కీల‌క‌ ఆదేశాలు

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తుపానుపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటి నిత్యావసరాలను సమకూర్చి ఉంచాలి అని సూచించారు.

Also Read: Rohit Sharma: అజిత్ అగార్కర్‌కు సెంచ‌రీతో స‌మాధానం ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌!

వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

ఏలేరు రిజర్వాయర్ రైతులకి ముందస్తు సమాచారం

ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీయగా రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి తలెత్తితే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు, ప్రజలకి ముందస్తు సమాచారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

జిల్లా పర్యటన వాయిదా

మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో ఉప ముఖ్యమంత్రి కాకినాడ వెళ్ళేందుకు సిద్ధంకాగా.. ప్రస్తుతం యంత్రాంగం సహాయక చర్యల సన్నద్ధతలో నిమగ్నమై ఉంటుందని, ఈ పరిస్థితుల్లో జిల్లా పర్యటన వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు. ఈ సూచనను ఉప ముఖ్యమంత్రి మన్నించారు.

Exit mobile version