Caste Politics :`కులాల‌` కుంప‌ట్లో ఏపీ రాజకీయం! `కాపు` కాచిన‌`గంటా`!

కులం(Caste) కుర్చీని ఇస్తుంద‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ పోక‌డ న‌మ్మిస్తోంది.

  • Written By:
  • Updated On - December 15, 2022 / 02:07 PM IST

`కులం కూడు పెట్ట‌దంటారు పెద్ద‌లు. కానీ, కులం(Caste) కుర్చీని ఇస్తుంద‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ పోక‌డ న‌మ్మిస్తోంది.` ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల‌ను చూస్తుంటే కులమే(Caste) అన్నింటికీ మూలం అన్న‌ట్టు ఉంది. వాస్త‌వంగా కుల ప్రాతిప‌దిక‌న ఓటింగ్(Vote) జ‌రిగితే ఏ పార్టీ అధికారంలోకి కాదు. ఏ కులం వాళ్లు ఆ కులం నాయ‌కునికి ఓట్లు వేసుకునే ప‌ద్ధ‌తి ఎప్పుడూ ఉండ‌దు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని మాత్ర‌మే ఎక్కువ‌గా ఓటింగ్(Vote) జ‌రుగుతుంది. ఆ దిశ‌గా ఓట‌ర్ల‌ను ఆలోచింప చేయ‌డం లీడ‌ర్ల బాధ్య‌త‌. కానీ, ఏపీ రాజ‌కీయాల్లో మునుపెన్న‌డూ లేనివిధంగా ఈసారి కులం(Caste) ప్రాతిప‌దిక‌న ఓట్ల‌ను, సీట్ల‌ను స‌మీక‌రించుకునే ప‌నిలో కొంద‌రు ఉన్నారు.

వాస్త‌వంగా స‌మాజంలో రెండు కులాలు(Caste) మాత్ర‌మే ఉన్నాయ‌ని మేధావులు చెప్పే మాట‌. అవి పేద, ధ‌నిక వ‌ర్గాలు మాత్ర‌మేనంటూ `కార్ల్ మాక్స్` కూడా చెప్పిన సూక్తి. స‌మాజంలో ఆర్థిక సంబంధాలు మిన‌హా కుల‌, మ‌త‌, మాన‌వ సంబంధాల‌న్నీ ట్రాష్ అంటారాయ‌న‌. కొంద‌రు స్వార్థం కోసం మాత్ర‌మే లేని సంబంధాల‌ను రేకెత్తిస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటార‌ని పూర్వం నుంచి పెద్ద‌లు చెప్పే మాట‌. ఇప్పుడు ఏపీలోనూ అదే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు ఏపీలోని కాపు నేత‌ల‌ను ఏకం చేసే ప‌నిలో ఉన్నారు. ఆయ‌న రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీల జెండాల‌ను క‌ప్పుకున్నారు. ఇటీవ‌ల టీడీపీకి రాజీనామా చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ఉద్య‌మాన్ని చేయాల‌ని భావించారు. కానీ, అటు రాజీనామా ఇటు ఉద్య‌మం వైపు ఆయ‌న లేరని స‌ర్వ‌త్రా తెలిసిన విష‌య‌మే. మెగాస్టార్ చిరంజీవికి స‌న్నిహితునిగా కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌ను ఏకం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. రాష్ట్రంలో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

కాపు నేతలు భేటీ

ప్ర‌స్తుతం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీలో ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటే ఆయ‌న‌కు ప‌డ‌దు. దీంతో రాజ‌కీయ ప్రాధాన్యం లేకుండా బీజేపీలో ఉండిపోయారు. హ‌ఠాత్తుగా ఆయ‌న‌తో గంటా శ్రీనివాస‌రావు భేటీ కావ‌డంతో జ‌న‌సేన‌లోకి వెళుతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైయింది. కార‌ణం వాళ్లిద్ద‌రూ కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌లు కావ‌డమే. అంతేకాదు, విజయవాడలోని నివాసంలో `గంటా` కొంద‌రు కాపు సామాజికవర్గ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బొండా ఉమ తదితరులు హాజరయ్యారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ప్రాధాన్యతను సంతరించుకుంది. వెల్లంపల్లి కుమార్తె పెళ్లి సందర్భంగా అంద‌రం క‌లుసుకోవ‌డం మిన‌హా ఎలాంటి ప్రాధాన్యం ఈ భేటీకి లేద‌ని గంటా చెబుతున్నారు. వంగవీటి రంగా వర్ధంతి అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని వివ‌ర‌ణ ఇస్తున్నారు.

విశాఖ కేంద్రంగా ఈ నెల 26న కాపు నాడు సభను నిర్వ‌హించ‌బోతున్నారు. వంగవీటి రంగా వర్దంతి రోజు ఈ సభకు ముహూర్తంగా నిర్ణ‌యించారు.అందుకు సంబంధించిన‌ పోస్టర్ ను గంటా విడుదల చేసారు. పోస్టర్ పైన రంగాతో పాటుగా చిరంజీవి, పవన్ ఫోటోల‌ను ముద్రించారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ తో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా విజయవాడలో గంటా నివాసంలో జరిగిన సమావేశంలో కన్నాతో పాటుగా టీడీపీ నేత బోండా ఉమ, చీరాల నేత ఎడం బాలాజీ పాల్గొన్నారు. ఇది కాపు నేతల సమావేశంగా భావించాల్సిన అసవరం లేదని చెబుతూనే రాజ‌కీయ పావులు క‌దిపార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

విశాఖ కాపునాడు స‌భ‌కు వైసీపీ కాపు లీడ‌ర్లు దూరంగా ఉంటార‌ని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు హాజ‌రు కావ‌డానికి అవకాశం ఉంది. ఆనాడు ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌కంగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు ప్ర‌స్తుతం రాజ‌కీయ చౌర‌స్తాలో ఉన్నారు. ఆయ‌న బ్యాంకు డిఫాల్డ‌ర్ గా మార‌డంతో పాటు ఆస్తుల‌ను జ‌ప్తు చేయ‌డం వ‌ర‌కు వివాదాన్ని తీసుకెళ్లారు. ఆ క్ర‌మంలో వైసీపీలోకి మార‌డానికి ఇటీవ‌ల ప్ర‌యత్నం చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయ‌న ప్రజారాజ్యం, కాంగ్రెస్ మీదుగా మ‌ళ్లీ టీడీపీ గూటికి 2014 ఎన్నిక‌ల ముందు చేరారు. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోవు రోజుల్లో రాజ్యాధికారం దిశ‌గా కాపులు అడుగు వేయాల‌ని చ‌క్రం తిప్ప‌డానికి గంటా సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

జ‌న‌సేన‌కు ఓట్లు

వాస్త‌వంగా జ‌న‌సేన‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ గుర్తింపు లేదు. ఆ పార్టీకి అత్య‌ధికంగా 5శాతం ఓటు(Vote) బ్యాంకు ఉన్న‌ట్టు 2019 ఎన్నిక‌ల్లో తేలింది. రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ ఓడిపోయారు. ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఆ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేసిన తిరుప‌తి లోక్ స‌భ‌, బ‌ద్వేల్, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రాలేదు. అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కింగ్ లేదా కింగ్ మేక‌ర్ కావాల‌ని జ‌న‌సేన ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశ‌గా కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన వివిధ పార్టీలోని లీడ‌ర్లు స‌మావేశమ‌వుతున్నారు. ఫ‌లితంగా అధికారంలోకి వైసీపీ, ప్ర‌తిప‌క్షంలోని టీడీపీకి కాపు లీడ‌ర్ల‌ వాల‌కం అంతుబ‌ట్ట‌డంలేదు.

కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల ఓట్లు(Votes) 18శాతం ఉన్నాయ‌ని అంచ‌నా. ఆ ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా జ‌న‌సేన‌కు ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నారు. సినిమాల్లోని ప‌వ‌న్ గ్లామ‌ర్ చూసి యువ‌త కులాల‌కు అతీతంగా ఓట్లు(Votes) వేస్తార‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి ఈక్వేష‌న్ వేసుకుని జ‌న‌సేన మ‌రికొన్ని పార్టీల‌ను క‌లుపుకుని బ‌రిలోకి దిగింది. అప్పుడు వ‌చ్చిన ఓట్ల కంటే ఈసారి ఎక్కువ ఎలా వ‌స్తాయో శాస్త్రీయంగా చెప్ప‌డానికి ఆధారాలు లేవు. కేవలం కులం(Caste) ఓట్ల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటే రాజ్యాధికారం రావ‌డం అసాధ్యం. పైగా కాపు, బ‌లిజ మ‌ధ్య వ్యత్యాసం ఉంది. బ‌లిజ‌, శెట్టి బ‌లిజ మ‌ధ్య గ్యాప్ ఉంది. తెల‌గ, ఒంట‌రి కులాలు ఇప్పుడు రిజ‌ర్వేష‌న్ ను అనుభ‌విస్తున్నాయి. ఒక వేళ కాపుల‌కు మ‌ద్ధ‌తు ఇస్తే రిజ‌ర్వేష‌న్లో కాపులు కూడా భాగ‌స్వాములు అవుతార‌ని సందేహం వాళ్ల‌లో ఉంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య కులం ఓట్ల‌ను(Votes) న‌మ్ముకుని రాజ్యాధికారం దిశ‌గా జ‌న‌సేన‌ చూడ‌డం ఎండ‌మావే! ఆ దిశ‌గా గంటా పావులు క‌ద‌ప‌డం ఆయ‌న వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ఉనికి కోసం మాత్ర‌మేనంటూ విమ‌ర్శించే వాళ్లు లేక‌పోలేదు.

Ganta Meets GodFather: గాడ్ ఫాదర్ తో గంటా.. ఆసక్తి రేపుతున్న భేటీ!