సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరిగింది. నాల్కో సంస్థ సీఎస్ఆర్ కింద్ ఇచ్చిన రూ. 1.58 కోట్ల నిధులతో చేపట్టిన షెడ్లకు శంఖుస్థాపన చేశారు. ఇక కోల్‌కతాకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన రూ. 45 లక్షల విరాళంతో తొలిపావంచా వద్ద నిర్మించనున్న షెడ్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 3 కోట్లతో నిర్మించిన టీఎంఎస్ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సింహాచల ఆలయ ప్రక్షాళన చేసి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం వెలుగొందుతోంది. విశాఖపట్నం జిల్లాలో కొలువై ఉన్న సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆయితే ప్రస్తుతం ఈ ప్రసిద్ధ ఆలయం రూపురేఖలు మారుతున్నాయి. భక్తులు ఇచ్చిన విరాళాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి.. రూ.3 కోట్లు వెచ్చించి సింహగిరిపై టీఎంఎస్ (టెన్సిల్ మెంబ్రేన్ షెల్టర్) షెడ్డు నిర్మించారు.
కాగా, ఈ టీఎంఎస్ షెడ్డు ప్రారంభోత్సవం బుధవారం (నవంబర్ 26న) సింహగిరిపై జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి గణబాబు పాల్గొన్నారు. టీఎంఎస్ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. కేవలం వంద రోజుల వ్యవధిలో.. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్పారు. దాతలకు, గుత్తేదారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
ఈ షెడ్డు ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సింహాచలం దేవస్థానంలో వైసీపీ పాలనలోని అవశేషాలను తొలగిస్తామన్నారు. గత ప్రభుత్వంలోని కొందరు సింహాచల క్షేత్రాన్ని వివాదాలకు చిరునామాగా మార్చారని.. తాము ఈ దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు. అంతేకాకుండా గత కొన్నాళ్లుగా స్వామివారి ఆభరణాల లెక్కల్లో తేడాలు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగుల వ్యవహారాలు, తదితర ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రసాద్ పథకం పనులు త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
సింహాచల కొండపై విరాళాలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. అందులో లోవతోటలో రూ. 98 లక్షలతో, ఆలయ ప్రాకారం చుట్టూ రూ. 60 లక్షలతో.. నాల్కో సంస్థ కార్పొరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన షెడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. దాంతో పాటు కోల్‌కతాకు చెందిన దాత ఇచ్చిన విరాళంతో కొండ దిగువన తొలిపావంచా దగ్గర రూ. 45 లక్షలతో నిర్మించతలపెట్టిన షెడ్లకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు శంకుస్థాపన చేశారు.
