AP Politics: ఆ నలుగురు అందుకే క్రాస్.!

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటారని నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - March 25, 2023 / 10:49 AM IST

ఏపీలో (AP) జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటారని నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి రెబల్స్‌గా మారారు. ఆనం నియోజకవర్గమైన వెంకటగిరి, కోటం నియోజకవర్గమైన నెల్లూరు రూరల్‌కు ఇంచార్జ్‌లను నియమించడంతో వారిపై ఏ క్షణమైనా వేటుపడుతుందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని కూడా అధిష్ఠానానికి తెలుసు. అయితే.. తాడిపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపైన వేటు ఎందుకు వేయాల్సి వచ్చింది..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద చర్చ. వేటు వేయడానికి దారితీసిన పరిస్థితులేంటి..? అంత పెద్ద తప్ప వాళ్లు ఏం చేశారు..? అసలు ఓటింగ్‌కు ముందు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విడివిడిగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారు..? ఈ ఇద్దరి భేటీలో అరగంటపాటు అసలేం చర్చించారు..? ఈ ఇద్దరు జగన్‌ను ఏం అడిగారు..? జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది..? అనే విషయాలను స్టీడీ చేస్తే ఆ ఇద్దరు రివర్స్ ఎందుకు అయ్యారు అనేది స్పష్టత వస్తుంది.

శ్రీదేవి విషయంలో ఏం జరిగింది..?

తాడికొండ వేదికగా గత కొన్ని రోజులుగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్‌గా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను సీఎం జగన్ నియమించారు. ఇక్కడే అధిష్ఠానానికి శ్రీదేవికి మధ్య గ్యాప్ వచ్చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఆయన్ను ఎందుకు నియమించారని జిల్లా మంత్రి, ఇంఛార్జ్ మంత్రిని ఆమె నిలదీశారు. ఆఖరికి ఈ వ్యవహారం జగన్‌ దగ్గరికి కూడా తీసుకెళ్లారామె. అప్పటికే శ్రీదేవి గురించి అధిష్ఠానంకు ఏం నివేదికలు అందాయో తెలియట్లేదు కానీ.. జగన్ మాత్రం ఆమెపై అసంతృప్తిగానే ఉన్నారట. దీంతో ఆమె ఏం చేయాలో తెలియక తన అనుచరులు, కార్యకర్తలు, ద్వితియశ్రేణి నేతలతో ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే డొక్కాకు అధిష్ఠానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందట. దీంతో శ్రీదేవి ముఖ్య అనుచరుల్లో అసంతృప్తులను ఆయన తనవైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారట. కార్యకర్తలు సైతం ఏమైనా పనులు జరగాలంటే డొక్కానే సంప్రదించే పరిస్థితి వచ్చిందట. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవిని డమ్మీ చేశారని ఆమెఅత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. అంటే పరోక్షంగా రానున్న ఎన్నికల్లో శ్రీదేవిని కాదని.. డొక్కాకే టికెట్ ఇస్తామని చెప్పేసినట్లేనని శ్రీదేవి వర్గం భావించిందట. ఈ వరుస పరిణామాలతో అధిష్ఠానానికి శ్రీదేవికి మధ్య మరింత గ్యాప్ పెరిగిపోయిందట.

సరిగ్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు టైమ్ కావడం.. అది కూడా ఎమ్మెల్యే కోటా కావడంతో శ్రీదేవికి అలా కలిసొచ్చిందట. ఓటింగ్‌కు ముందు తన కుమార్తెతో కలిసి శ్రీదేవి.. సీఎంను కలిశారు. అరగంటపాటు పలు విషయాలపై నిశితంగా చర్చించారు కూడా. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని.. అది కూడా ఇప్పుడే తనకు హామీ ఇవ్వాలని జగన్‌ను ఆమె గట్టి పట్టు పట్టారట. అయితే.. జగన్ మాత్రం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను సీరియస్‌గా తీసుకోవడం.. ముందుగానే ఇంఛార్జ్‌ను కూడా నియమించడంతో టికెట్ హామీపై ససేమిరా అనేశారట. టికెట్ ఇచ్చేదే లేదన్నట్లుగా జగన్ చెప్పడంతో శ్రీదేవి మరింత అసంతృప్తికి లోనయ్యారట. సిట్టింగ్ అయిన తనను నియోజకవర్గంలో డమ్మీ చేయడం, సచివాలయంలో కూడా తన మాట చెల్లకపోవడంతో అసలు ఇక వైసీపీలో ఉండటం.. పైగా ఇప్పుడు వైసీపీకి ఓటేయడం అవసరమా అని భావించి.. టీడీపీ అభ్యర్థికి ఓటేశారట. తాడికొండలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించిన టీడీపీ పెద్దలు శ్రీదేవితో టచ్‌లోకి వెళ్లారట. ఫైనల్‌గా ఒక్కసారి జగన్‌ దగ్గరే టికెట్ పంచాయితీ తేల్చుకోవాలని ఓటింగ్‌కు ఒక్క మాట అడిగారట. జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇక శ్రీదేవి పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీ వైపు అడుగులేయాలని భావించి.. టీడీపీ అభ్యర్థికే ఓటేశారని సమాచారం.

మేకపాటి ఎపిసోడ్ ఇలా..!

నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో (AP Politics) ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత సోదరులు, కుమారులను కూడా ఇప్పుడు జిల్లాలో ఓ స్థాయిలో నిలబెట్టారు. అలా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని రాజకీయాల్లోకి (AP Politics) తెచ్చి ఉదయగిరి నియోజకవర్గానికి అధిపతిని చేశారు. నియోజకవర్గంలో అంతా సాఫీగా ఉందనుకున్న టైమ్‌లో సడన్‌గా ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని జగన్ నియమించారు. ప్రభుత్వానికి.. శాసనసభ్యుడికి మధ్య వారధిగా ఉండాల్సిన ధనుంజయ్‌ లేని పోని విషయాల్లో తలదూర్చారట. ఒక్క మాటలో చెప్పాలంటే.. తానే ఎమ్మెల్యేగా ఆయన ఫీలయ్యేవారని మేకపాటి వర్గీయులు చెబుతున్న మాట. రానున్న ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అన్నట్లుగా సీన్ క్రియేట్ చేసేశారట. దీంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ ధనుంజయ్ రెడ్డి వర్సెస్ మేకపాటిగా మారిపోయాయి. ఇక్కడ్నుంచే అసలు సీన్ మొదలైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండగా ధనుంజయ్ రెడ్డిని ఎందుకు.. అసలు ఆయన్ను నియోజకవర్గానికి తీసుకురావాల్సిన అవసరమేంటి..? అని నేరుగా అధిష్ఠానాన్నే మేకపాటి ప్రశ్నించారు. అసలు తన గురించి అధిష్ఠానానికి ధనుంజయ్ లేనిపోనివి చెప్పడంతో అధిష్ఠానంతో మేకపాటికి మరింత గ్యాప్ పెరిగిపోయిందట. పోలింగ్ ముందు జరిగిన భేటీ!

ఇక ఇవన్నీ కాదు ధనుంజయ్ రెడ్డిని నియోజకవర్గం నుంచి తీసేస్తారా లేకుంటే తనకు రానున్న ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తారా అని జగన్ దగ్గరే తేల్చుకోవాలని చాలా రోజులుగా మేకపాటి వేచి చూస్తున్నారట. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అదును చూసి తనకు టికెట్ ఇస్తారా ఒకవేళ తనపై నెగిటివ్‌గా నివేదికలు వచ్చి వుంటే తన రెండో భార్యకు టికెట్ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయాలని అనుకున్నారట. పోలింగ్‌కు ముందు జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన మేకపాటి.. తనకు టికెట్ హామీ ఇస్తారా లేకుంటే తన భార్యకు టికెట్ ఇవ్వాలని అడిగేశారట. ఇదే జగన్‌కు నచ్చలేదట. అందుకే ఇచ్చే ప్రసక్తే లేదని.. పార్టీలో ఉంటే ఉండొచ్చు.. వెళ్లిపోయినా అభ్యంతరమే లేదని ఒకే ఒక్క మాటతోనే జగన్ తేల్చేశారట. దీంతో మారుమాట మాట్లాడకుండా భేటీ మధ్యలోనే మేకపాటి బయటికి వచ్చేశారట. అప్పటికే నెల్లూరు జిల్లా ముఖ్యనేతలు, టీడీపీ పెద్దలు కొందరు ఆయనకు టచ్‌లోనే ఉన్నారట. టికెట్ హామీ రాలేదని తెలియడంతో ఇక ఇటు వచ్చేయండన్నట్లుగా సంకేతాలు పంపారట. దీంతో ఇక తనకు కేటాయించిన అభ్యర్థికి కాకుండా టీడీపీ అభ్యర్థికే ఓటేశారని బయటికి టాక్ వచ్చేసింది. కోడ్ చెప్పి మరీ ఓటు వేయమంటే వేయలేదని.. ఇదీ పార్టీ లైన్ దాటినట్లేనని వైసీపీ ఆరోపిస్తోంది. తాను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. జయమంగళ వెంకటరమణకే ఓటేశానని మేకపాటి చెబుతున్నారు. అధిష్ఠానం అభ్యర్థికి ఓటేయలేదని నిరూపించగలరా అని కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఛాలెంజ్ కూడా చేశారు. పక్కాగా ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత తాము నలుగురిపై వేటు వేశామని సజ్జల చెబుతున్నారు. సస్పెన్షన్‌కు ముందే ఆయన తన టికెట్ వ్యవహారాన్ని తేల్చాలని కూడా మాట్లాడారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే టికెట్ గురించే రచ్చ జరిగిందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి విషయంలో ఒక్కటే సీన్ జరిగిందన్న మాట. ఓటింగ్‌కు ముందు జగన్‌ను కలవడం.. అరగంట పాటు భేటీ కావడం.. ఆయనేమో ఇద్దరి టికెట్ విషయంలోనూ ఒక్క మాటతోనే తేల్చేయడంతో అనూహ్యంగా ఇలా టీడీపీ వైపు మొగ్గు చూపారన్నది ఇన్‌సైడ్ టాక్. మరి ఇందులో నిజానిజాలెంతో జగన్, మేకపాటి, ఉండవల్లికే తెలియాలి.

Also Read:  Jagan Dictatorship: డిక్టేటర్ షిప్ లో డొల్లతనం