ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సంకల్పంతో “పీ4” అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీ4 అంటే పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్. అంటే ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన దిశగా పనిచేయడం. రాష్ట్రంలోని అత్యంత నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మలచడం ద్వారా వారి జీవితాల్లో నూతన ఆశలు నింపేందుకు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు.
పీ4 కార్యక్రమం కింద అత్యంత సంపన్నులు (టాప్ 10%) నేరుగా అట్టడుగున ఉన్న పేద కుటుంబాల (బాటమ్ 20%)కి ఆర్థిక సహాయం చేయడం, మార్గనిర్దేశం చేయడం కీలక లక్ష్యం. ఈ ప్రోగ్రామ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పీ4ని “గేమ్ చేంజర్”గా పేర్కొంటూ.. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ఇది ఓ కీలకమైన చోదకశక్తిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా పీ4 అమలులో ముందంజలో ఉంది.
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
అత్యధికంగా 15 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు, లక్షమంది మార్గదర్శుల ఎంపికకు ఆగస్టు 15 చివరి గడువుగా నిర్ణయించారు. ఈ మార్గదర్శులు నిరుపేదల కుటుంబాలకు గైడెన్స్ ఇవ్వడం, అవసరమైన వనరులు చేకూర్చడం, వారికి ఆశాభరోసా కలిగించడం వంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. పీ4 పథకం సంక్షేమ పథకాలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, అవి కొనసాగుతూనే అదనపు బలంగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల్లో ఈ పథకం గురించి అపోహలు లేకుండా చూడాలని అధికారులను కోరారు.
చివరిగా పీ4 తనకు అత్యంత ప్రియమైన పథకమని పేర్కొన్న చంద్రబాబు “ఈ రాష్ట్రంలో పేదలే లేని రోజు రావాలి” అన్నదే తన కల అని అన్నారు. పీ4 పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బంగారు కుటుంబాలుగా పేదల జీవితాలను మార్చడమే తన పాలనకు సార్థకత అని, ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని ప్రజలకు పిలుపునిచ్చారు.