Exam Paper Leak: ఏపీలో పదో తరగతి పరీక్షా పేపర్ల లీకులు.. ఆ పేపర్లు సోషల్ మీడియాలో ఎలా వస్తున్నాయి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఏమాత్రమైనా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రేమ ఉందా? లేకపోతే పదో తరగతి ప్రశ్నాపత్రాలు ప్రతీరోజూ లీకు అవుతుంటే ఏం చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 09:37 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఏమాత్రమైనా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రేమ ఉందా? లేకపోతే పదో తరగతి ప్రశ్నాపత్రాలు ప్రతీరోజూ లీకు అవుతుంటే ఏం చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఆ పేపర్లు దర్శనమిస్తు్న్నాయి. పోనీ ఆ విషయం అయినా ఒప్పుకుంటుందా అంటే అదీ లేదు. పైగా.. ప్రశ్నా పత్రాలు లీక్ కాలేదు. మాల్ ప్రాక్టీస్ లేదని తమను తాము
సమర్థించుకుంటున్నారు. మరి క్వశ్చన్ పేపర్స్ లీక్ కాకపోతే.. బయటికొస్తున్న పేపర్ల సంగతేంటి? అవి ఎలా వస్తున్నాయి? ఇలా పేపర్ల లీక్ వల్ల ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

విద్యార్థులు తమ పరీక్షల కోసం ఏడాదంతా కష్టపడి చదువుతారు. ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని పైతరగతులకు వెళ్లాలనుకుంటారు. కానీ ఇలాంటి పేపర్ల లీకేజీ వల్ల వారి ఆశలు గల్లంతవుతున్నాయి. బుధవారం, గురువారం.. ఈ రెండురోజుల్లోనూ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు.. ఎగ్జామ్ ప్రారంభమైన గంటన్నర తరువాతే వచ్చాయని.. వాటిని లీక్ గా భావించలేమంటున్నారు అధికారులు.
అలాంటప్పుడు శ్రీసత్యసాయి జిల్లాలో ఇంగ్లిష్ పరీక్ష అలా ప్రారంభమైందో లేదో.. జస్ట్ ఎనిమిది నిమిషాల్లోనే ఆ క్వశ్చన్ పేపర్ కొందరు రాజకీయ నాయకుల వాట్సప్ గ్రూప్ లో దర్శనమిచ్చింది. మరి దీనిని లీక్ కాక ఇంకేమంటారో అధికారులు చెప్పాలి.

ఈమధ్య కడప జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు. తొమ్మిదో తరగతి విద్యార్థి ఒకరు ఎగ్జామ్ హాల్ కు స్లిప్ లు తీసుకెళ్లారు. అవన్నీ కూడా క్వశ్చన్ పేపర్ లో ఉన్న ప్రశ్నలకు సంబంధించినవే. అంత కరెక్ట్ గా ఆ ప్రశ్నలకే స్లిప్పులు ఎలా తెచ్చావని ఇన్విజిలేటర్ ప్రశ్నిస్తే.. యూట్యూబ్ లో క్వశ్చన్ పేపర్స్ ముందు రోజే వచ్చేస్తున్నాయిగా అని ఆ విద్యార్థి జవాబు చెప్పడంతో ఆ ఇన్విజిలేటర్ షాకయ్యారు. ఇది
ఏపీలో పరీక్షలు నిర్వహిస్తున్న తీరు అంటూ తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

ఏపీలో దాదాపు 30 వేల మంది సీబీఎస్ఈ పదోతరగతి విద్యార్థులు సెమిస్టర్-2 పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లు.. ఇన్విజిలేటర్లు.. అంతా ప్రైవేటు వర్గాలవే. అయినా ఎక్కడా లీకేజీ సమస్య రాలేదు కదా! పరీక్ష సిబ్బంది ఫోన్లను ముందే తీసుకోవడం, పిల్లలతో హాల్ టిక్కెట్ నెంబర్లను ప్రశ్నాపత్రాలపై రాయించడం వంటి చర్యల వల్ల కొంత ఫలితం ఉంటుందంటున్నారు విద్యావేత్తలు.

Cover Pic Is Representation Only