టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు ఐటీ ఉద్యోగులు కదంతొక్కుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో బాబుకు మద్దతుగా ఆందోళనలు చేసిన ఐటీ ఉద్యోగులు మరో అడుగుముందుకు వేశారు. ఛలో రాజమండ్రి అంటూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు భారీ కార్ల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున మూడు గంటలకు కార్ల ర్యాలీ ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి దివంగత నటుడు నందమూరి తారకరత్న సతీమణి నందమూరి అలేఖ్యరెడ్డి, పిల్లలు సంఘీభావం తెలిపారు.
ఇటు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ నేపథ్యంలో విజయవాడ కమిషరేట్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు బోర్డర్ లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చే ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్న తరువాతే వారిని అనుమతిస్తున్నారు. 500 మందిపైగా పోలీసులతో సరిహద్దు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కార్ల ర్యాలీని అడ్డుకోవాలని పోలీసులు చూస్తున్నారు. ఇటు ఐటీ ఉద్యోగలు మాత్రం రాజమండ్రికి చేరుకుని తీరుతామని తేల్చి చెప్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రా సరిహద్దు వరకు తెలంగాణ పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. కేవలం ఏపీలోనే ఎందుకు ఆంక్షలని ఉద్యోగులు మండిపడుతున్నారు.