Site icon HashtagU Telugu

AP Fishing: విశాఖలో ఉద్రిక్తత :జాలరి ఎండాడలో ఫిషింగ్ బోట్లకు నిప్పు, మత్య్సకారుల మధ్య ఘర్షణ

Boats On Fire

Boats On Fire

చేపల వేటకు రింగ్ వలలు వినియోగించే, సాధారణ వలలు వినియోగించే మత్స్యకారుల మధ్య విశాఖపట్నంలో మళ్ళీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నగరంలోని వసవని పాలెం, జాలరిపేట మరోసారి అట్టుడికాయి. జాలరిపేటకు చెందిన వారిగా భావిస్తున్న కొందరు వ్యక్తులు.. జాలరి ఎండాడ గ్రామ సమీపంలో ఆరు ఫిషింగ్ బోట్లు, కొన్ని రింగ్ వలలకు నిప్పు పెట్టారు. శుక్రవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు.

ఈ ఘటనతో వసవని పాలెం, జాలరిపేట మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇరుగ్రామాల మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లలో సముద్రంలోనే గొడవకు దిగారు. ఒకరి బోట్లను ఇంకొకరు వెంటాడి కొట్టుకున్నారు. ఈక్రమంలో పలువురు మత్య్సకారులు సముద్రంలో పడిపోయారు. కొందరి బోట్లను సముద్రంలోనే నిప్పటించారు. ఈనేపథ్యంలో అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులను తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.విశాఖ నగరంలోని వసవని పాలెం, జాలరిపేటలలో 144 సెక్షన్ విధించారు. మంగమారిపేట, ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.ఈవివరాలను విశాఖ సిటీ పోలీస్ చీఫ్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.సంఘటన స్థలాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు.

మరోవైపు మత్స్యకార పల్లెకు చెందిన కొందరు జాలర్లు రింగ్ వలలతో చేపల వేటకు వెళ్లగా.. జాలరిపేటకు చెందిన కొందరు గ్రామస్తులు వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల లోపల రింగ్ వలలతో చేపల వేట చేయడంపై నిషేధం ఉంది. ఈ నిబంధనను అతిక్రమించే వారినే అడ్డుకుంటున్నామని సంప్రదాయకంగా చేపల వేట చేసే జాలర్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలోనూ రింగ్ వలల వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణాత్మక స్థాయికి చేరడంతో విశాఖపట్నంలోని మత్స్యకార గ్రామాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.