AP Congres: విజయవాడలో ఉద్రిక్తత..వైఎస్ షర్మిల నిర్బంధం

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 01:52 PM IST

 

Chalo-Secreteriat : మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్(chalo-secreteriat) విజయవాడ(vijayawada)లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల.. పార్టీ ఆఫీసు ముందే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం 7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ గతంలో చంద్రబాబు(chandrababu)ను జగన్ ప్రశ్నించారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని అన్నారు. అధికారంలోకి రాగానే 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్(jagan)హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. నాడు చంద్రబాబును అడిగిన ప్రశ్న నేడు మీకు వర్తించదా? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడి చేస్తున్నారనీ.. రాష్ట్రంలో జర్నలిస్టులపై అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని వైఎస్ షర్మిల నిలదీశారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులను అధికార పార్టీ బంటులలా వాడుకుంటూ నిరసనలను అడ్డుకోవడంపై మండిపడ్డారు.

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆందోళనలకు భయపడాల్సిన అవసరం ఏముంది? జాబ్ నోటిఫికేషన్లు(Job Notifications) లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడంలేదా? రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ పాపం వైసీపీ ప్రభుత్వానిదే’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

read also : Trisha : పెద్ద మనసు చేసుకొని నన్ను క్షేమించు – అన్నాడీఎంకే నేత