Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం ఎదురైంది. కోడి గుడ్లతో జనసైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడివాడలోని వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లగా జనసైనికులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాక్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య వాగ్వాదం జరిగింది. రాళ్ల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు పగిలిపోయాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఫోటోలు మార్ఫింగ్ చేసి.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌పై అనుచిత పోస్టులు చేస్తున్నారని.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌ను గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇంటూరి రవి కిరణ్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు అయ్యింది. ఆయన్ను బయటకు తీసుకురావడానికి పేర్ని నాని, ఇతర వైసీపీ నేతలు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఇంటూరి రవి కిరణ్‌పై దాడికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న పేర్ని నానిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దాడి చేశారు.
అంతేకాక..దాడి చేసిన జనసేన కార్యకర్తలు.. పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పేర్ని నాని, ఇంటూరి రవి కిరణ్, ఇతర నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిపై వైసీపీ స్పందించింది. ఇలాంటి దాడులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించింది.