Andhra Pradesh: ఏపీలో టెన్షన్.. టెన్షన్.. పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల శ్రీరామ్, సునీత నిరసన

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 12:53 PM IST

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులపై పరిటాల శ్రీరామ్, సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పరిటాల కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం వెనుక కారణం లేకపోలేదు. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు పరిటాల చంద్రశేఖర్‌రెడ్డి సునీత కుటుంబంపైనా, తెలుగుదేశం పార్టీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ (తెలుగుదేశం పార్టీ) అధినేత చంద్రబాబు, లోకేష్‌లను చంపేస్తారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బత్తలపల్లికి చెందిన టీడీపీ (తెలుగుదేశం పార్టీ) నేత జగ్గు స్పందించి కౌంటర్ ఇచ్చారు. దీంతో శనివారం రాత్రి జగ్గును పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ (తెలుగుదేశం పార్టీ) నేతలు ఆరోపించారు. జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తమ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.

టీడీపీ నేత జగ్గును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ నేతలకు సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ (తెలుగుదేశం) అధినేత చంద్రబాబు, లోకేష్‌లను చంపేస్తామని చెప్పిన చంద్రశేఖర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. బత్తలపల్లి మండల టీడీపీ నాయకుడు జగ్గును వీడేంత వరకు ఆందోళన ఆగదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అలాగే టీడీపీ నేతలపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.