Site icon HashtagU Telugu

Telugu States : కీలకం కానున్న తెలుగు రాష్ట్రాలు

Telugu States To Be Crucial

Telugu States To Be Crucial

By: డా. ప్రసాదమూర్తి

కేంద్రంలో బిజెపికి చేతిలో ఉన్న అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి. రెండు పార్టీలకీ రానున్న సార్వత్రిక ఎన్నికలే అతి కీలకం. ఎవరికి వారే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఇరు వర్గాలకీ దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం అత్యంత కీలకమే. ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకున్నా అది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీయవచ్చు అన్నది అటు బిజెపికి ఇటు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తెలుసు.

అందుకే ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఏయే రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంత, ఎవరి బలహీనత ఎంత, ఎక్కడ ఎవరితో జతకట్టాలి, ఎవరితో యుద్ధం చేయాలి.. ఇట్లాంటి విషయాల మీద ఒక సంపూర్ణ అవగాహనతో ఇరు పార్టీల వారూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States)పైనా రెండు పార్టీలూ కన్ను వేశాయి.

ఒకవైపు అధికార బిజెపికి వ్యతిరేకంగా గట్టి పోటీ ఇవ్వడానికి, కేంద్రంలో పాలకపగ్గాలను హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, తోటి ప్రతిపక్షాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి అటు పార్టీ ఇమేజ్ ని, తన ఇమేజ్ ని అనూహ్యంగా పెంచి, ప్రతిపక్షాల దృష్టిలో తనకొక సానుకూల స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మతతత్వ ఎజెండాను, ప్రజా ప్రణాళికల ఎజెండాతో ఓడించిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉంది. ఇదే వరుసలో తెలంగాణలో తిరిగి పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని గట్టి ప్రయత్నాలనే సాగిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లతోపాటు తెలంగాణను కూడా కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పటిష్టంగా పావులు కదుపుతోంది.

అందుకే సిడబ్ల్యూసి పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సెప్టెంబర్ 16 ,17 తేదీలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని సిడబ్ల్యూసి సమావేశాలు సాగించనున్నారు. అనంతరం హైదరాబాదులో ఒక మహా బహిరంగ సభ కూడా జరుపుతారు. ఈ సమావేశంలోనే తెలంగాణలో పార్టీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు తుది రూపం ఇవ్వనున్నట్టు కూడా నాయకులు సూచాయిగా చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ఎంత ఉత్సాహంగా అడుగులు కదుపుతోందో అర్థమవుతుంది.

Also Read:  Udayanidhi Stalin : సనాతన ధర్మమా..? సామాజిక న్యాయమా..?

ఇంతే కాదు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా కాలంగా దూరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకునే ప్రయత్నాలునూ కాంగ్రెస్ మొదలుపెట్టినట్టు మీడియాలో కథనాలు వినపడుతున్నాయి. తెలంగాణలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకంగా ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవడానికి వ్యతిరేక పార్టీలలో ఉన్న పలువురు ముఖ్యమైన నాయకుల్ని పార్టీలోకి కలుపుకునే తంత్రాంగం కూడా సజావుగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, అది కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన దేశవ్యాప్త ప్రాభవాన్ని తిరిగి గెలుపొందడంలో ఒక కీలకమైన మలుపుగా భావించవచ్చు. అంతేకాదు ప్రతిపక్షాల కూటమిలో గొప్ప ఉత్తేజాన్ని కూడా అది నింపవచ్చు.

దీనితోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయానికి అవకాశాలు లేకున్నా, పార్టీ చాలా బలహీనంగా ఉన్నా, అక్కడ అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ఒకప్పుడు కాంగ్రెస్ లో భాగమే కాబట్టి, ఆ పార్టీ కాంగ్రెస్ కనుసన్నల్లోకి నడిచి వస్తే, కేంద్రంలో అధికారం ఏర్పాటుకు ఎలాంటి అవకాశం వచ్చినా అదొక గొప్ప ఊరడింపు కాగలదు. ఇదిలా ఉంటే తన మీద ఉన్న కేసులు నుండి తనను తాను రక్షించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పరోక్షమైన బంధాన్ని సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డైలమాలో పడ్డారు. ప్రతిపక్షాలు రోజురోజుకీ బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది.

వాతావరణం రానున్న కాలంలో ఎలా మారుతుందో చెప్పలేం. కేంద్రంలో అధికారాన్ని బిజెపి కోల్పోతే, కాంగ్రెస్ కీలకంగా ఉండే ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే, తన పరిస్థితి ఇరకాటంలో పడవచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి అటు బిజెపితోను, ఇటు కాంగ్రెస్ తోను సమాన దూరాన్ని, సమాన బంధాన్ని ఏకకాలంలో కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read:  INDIA Name Change : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే యోచనలో కేంద్రం

మరోవైపు బిజెపి కూడా రానున్న ఎన్నికల్లో తమదే విజయం అని పైకి ఎంత చెబుతున్నప్పటికీ, ఉత్తరాదిన తమ ఓటింగ్ బలం కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు అనేక సర్వేలు చెబుతున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలను (Telugu States) తమ గొడుగు నీడనే ఉంచుకోవడానికి ఏ ప్రయత్నాన్నీ వదులుకోవడం లేదు. అందుకే తెలంగాణలో తమ మీద కత్తి దూసిన కేసిఆర్ ని దగ్గరకు చేసుకోకపోతే అవసర కాలంలో అతని సహాయం పొందలేమని బిజెపి ఇప్పుడు అవసరమైన అడుగులే వేస్తోంది. బిజెపి, బీఆర్ఎస్ మధ్య ఒకప్పటి ఘర్షణ వాతావరణం ఇప్పుడు లేకపోవడానికి ఇదే కారణం.

ఇక తెలంగాణలో తాము పాలనలోకి వచ్చే అవకాశాలు లేవని బిజెపి గుర్తించింది. అందుకే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు గెలుపు లేకపోయినా కేసిఆర్ అండదండలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఉంటే చాలని బిజెపి సరిపెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏకమైన సందర్భంలో వీరిని పరోక్షంగా ప్రోత్సహిస్తూనే, జగన్ తో ఆంతరిక బంధుత్వాన్ని బిజెపి కొనసాగిస్తోంది. అక్కడ కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా వారి మద్దతు తమకు కేంద్రంలో అవసరపడుతుందన్న ఆలోచన ఏపీలో బిజెపి ఇరుపక్షాల మధ్య పాటిస్తున్న సమాన దూరానికి అంతరార్థంగా భావించవచ్చు.

ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో (Telugu States) 40 కి పైగా ఉండే ఎంపీ స్థానాలు అతి కీలకంగా మారనున్నాయి. జయాపజయాలు ఎలా ఉన్నా ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అతిపెద్ద పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే బిజెపి, కాంగ్రెస్ రెండూ ఎవరిదారుల్లో వారు ఈ రెండు రాష్ట్రాల మీద కన్నేసి కదులుతున్నారు. రాజకీయం కదా.. రాజకీయం ఎన్ని వింతలైనా చేస్తుంది.

Also Read:  Uttam Kumar Reddy : ఉత్తమ్ కు దక్కిన ‘ఉత్తమ’ గౌరవం

Exit mobile version