Site icon HashtagU Telugu

Undavalli, KVP : తెలుగు రాష్ట్రాల `పొత్తు`ల చిత్ర‌గుప్తులు!

Kvp, Undavalli

Kvp, Undavalli

భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఏపీలో ఎంట్రీ ఇస్తోన్న వేళ మాజీ ఎంపీలు ఉండ‌వ‌ల్లి (Undavalli), కేవీపీ (KVP) వాయిస్ ఎందుకు మారింది? ఏపీ రాజ‌కీయ ఈక్వేష‌న్లు మార్చ‌డానికి ఉండ‌వ‌ల్లి (Undavalli), కేవీపీ (KVP) సిద్ధం అయ్యారా? ఎందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఎగ‌సిప‌డుతున్నారు? పొత్తుల ఎత్తుగ‌డ‌ల‌కు వాళ్ల తాజా వ్యాఖ్య‌లు దారితీయ‌బోతున్నాయా? ప‌రోక్షంగా కేసీఆర్, జ‌గ‌న్మోహన్ రెడ్డిల‌కు స‌హ‌కారం అందిస్తున్నారా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు వాళ్ల తాజా వ్యాఖ్య‌లు దారితీస్తున్నాయి.

ఢిల్లీ పీఠం కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధానం. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ (ప్ర‌స్తుతం BRS)తో పొత్తు, ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన స‌ల‌హా. అంతేకాదు, గాంధీయేత‌ర కుటుంబానికి చెందిన లీడ‌ర్ కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని సూచించారు. ఆ మేర‌కు సోనియా ముందుకు క‌దిలారు. ఏఐసీసీ చీఫ్ గా మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను కూర్చొబెట్టారు. ఇక తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల్లో పొత్తుల విష‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని జాతీయ రాజ‌కీయాల దిశ‌గా అడుగులు వేస్తోన్న కేసీఆర్ కు కాంగ్రెస్ తో పొత్తు అవ‌స‌రం. అంతేకాదు, తెలంగాణ‌లో మూడోసారి సునాయాసంగా అధికారంలోకి రావ‌డానికి కాంగ్రెస్ చేయూత అనివార్యంగా క‌నిపిస్తోంది

ప్ర‌స్తుతం బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా దూకుడు మీద ఉంది. రాబోవు ఎన్నిక‌ల నాటికి టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. ఆ కూట‌మికి ధీటుగా ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూటమి క‌ట్టే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఉన్నాయ‌ని కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్లు చెప్పే మాట‌. ఇక ఏపీలో ఉనికి చాటుకోవాలంటే బీఆర్ఎస్ కు అనివార్యంగా పొత్తు అవ‌స‌రం. ప్ర‌త్యేక హోదా ఇస్తానంటోన్న కాంగ్రెస్ , రాజ‌కీయ త‌మ్ముడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీతో బీఆర్ఎస్ కూటమిని ఏర్పాటు చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది. ఏపీలోనూ బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మిగా వెళితే అనివార్యంగా వైసీపీ కూడా క‌మ్యూనిస్ట్ లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్టే ఛాన్స్ ఉంది. ఆ దిశ‌గా అడుగులు వేసే క్ర‌మంలో ఉండ‌వ‌ల్లి (Undavalli), కేవీపీ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చర్చ జ‌రుగుతోంది.

జగన్ మోహన్ రెడ్డి పాల‌న మీద

మాజీ ఎంపీలు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, కేవీపీ రామ‌చంద్ర‌రావు కరుడుక‌ట్టిన కాంగ్రెస్ వాదులు. రాష్ట్రాన్ని స‌మైఖ్యంగా ఉంచాల‌ని ఎంతోకొంత పోరాడిన కాంగ్రెస్ ఏపీ యోధులు. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి అత్యంత ఆప్తులు ఉండ‌వ‌ల్లి. ఇక కేవీపీ స్వ‌ర్గీయ వైఎస్సార్ కు ఆత్మ‌. వీళ్లిద్ద‌ర్నీ తొలి నుంచి జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ఇస్తూ వ‌చ్చారు. హ‌ఠాత్తుగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాల‌న మీద తిర‌గ‌బ‌డ్డారంటే, దాని వెనుక ఏదో తిర‌కాసు ఉంద‌ని అనుమానిస్తున్న వాళ్లు అనేకులు. ఎన్నిక‌ల‌కు ఒంట‌రిగా వెళ్లాల‌ని ఫిక్స్ అయిన జగన్ మోహన్ రెడ్డి మ‌న‌సును మార్చే ప్ర‌య‌త్నం ఉండ‌వ‌ల్లి, కేవీపీ చేస్తున్నార‌ని కొంద‌రు లాజిక్ తీస్తున్నారు.

ప్ర‌ధాన మంత్రిగా రాహుల్ గాంధీని చేయ‌డం స్వ‌ర్గీయ వైఎస్ ల‌క్ష్య‌మంటూ కేవీపీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రాణం ఉన్నంత వ‌ర‌కు వీడ‌కుండా ఉండాల‌ని ఇద్ద‌రం ఒట్టుపెట్టుకున్న విష‌యాన్ని కేవీపీ గుర్తు చేస్తున్నారు. ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకు ఆయ‌న చెబుతున్నారు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. అంటే, రాజ‌శేఖ‌రెడ్డి ల‌క్ష్యాన్ని ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు జగన్ మోహన్ రెడ్డి నెర‌వేర్చాల‌ని కేవీపీ ప‌రోక్ష సంకేతం ఇస్తున్న‌ట్టు ఉంది. ప్ర‌స్తుతం బీజేపీతో అంట‌కాగుతోన్న జగన్ మోహన్ రెడ్డి మ‌న‌సును మ‌ళ్లించే ప్ర‌య‌త్నం కేవీపీ చేస్తున్నార‌ని వినికిడి. పైగా రాష్ట్రం విడిపోయిన త‌రువాత సామాజిక‌వ‌ర్గం ప‌రంగా కేసీఆర్, కేవీపీ ప‌లు సంద‌ర్భాల్లో తెర‌వెనుక చేతులు క‌లిపారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ పెట్ట‌డానికి ముందుగా ప్ర‌గ‌తిభ‌వ‌న్లో కేసీఆర్ తో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ భేటీ అయిన విషయం విదిత‌మే. ఇవ‌న్నీ చూస్తుంటే చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా కూట‌మిని ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని అర్థం అవుతోంది.

కామ్రేడ్లు కేసీఆర్ పంచ‌న

సాధార‌ణంగా బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు ఉంటారు. ప్ర‌స్తుతం బీజేపీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ పోరాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కామ్రేడ్లు కేసీఆర్ పంచ‌న చేరారు. ఇక, కాంగ్రెస్ ముక్త్ భార‌త్ దిశ‌గా బీజేపీ వెళుతుంద‌న్నందున‌, ఆ పార్టీ కి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ఎవ‌రితోనైనా పొత్తు పెట్టుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. ఫ‌లితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ కూట‌మి ఏర్ప‌డుతుంద‌ని తెలుస్తోంది. స‌హ‌జ మిత్రునిగా ఉన్న ఎంఐఎం స‌హ‌కారం ప‌రోక్షంగా ఆ కూట‌మి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఏపీ పొత్తుల ముఖ‌చిత్రాన్ని త‌యారు చేయ‌డానికి కాంగ్రెస్ యోధులుగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, కేవీపీ రామ‌చంద్రరావు పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలుగా ఉన్న పోల‌వ‌రం, విశాఖ రైల్వే జోన్, ఆర్థిక‌లోటు, రాజ‌ధాని, ప్ర‌త్యేక హోదా త‌దిత‌ర అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. అవ‌న్నీ నెర‌వేర్చ‌డానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని రాహుల్ ఇటీవ‌ల భార‌త్ జోడో యాత్ర‌లోనూ ప్ర‌క‌టించారు. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ, క‌మ్యూనిస్ట్ లను ఒక‌టి చేయ‌డానికి ఉండ‌వ‌ల్లి, కేవీపీ మాస్ట‌ర్ స్కెచ్ వేశారని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఎంత వ‌ర‌కు వాళ్ల ప్ర‌య‌త్నాలు నెర‌వేర‌తాయో చూద్దాం!

Also Read: Andhra Pradesh : అకాల వ‌ర్షానికి అన్న‌దాత విల‌విల‌.. చేతికి వ‌చ్చిన పంట నీటిపాలు