TDP : టీడీపీ `సోలో` ఫైట్ సో బెట‌ర్‌!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనురించ‌బోయే వ్యూహాల్లో బెస్ట్ ఆప్ష‌న్ కోసం తెలుగుదేశం పార్టీ ప‌లు కోణాల నుంచి అధ్య‌య‌నం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 12:16 PM IST

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనురించ‌బోయే వ్యూహాల్లో బెస్ట్ ఆప్ష‌న్ కోసం తెలుగుదేశం పార్టీ ప‌లు కోణాల నుంచి అధ్య‌య‌నం చేస్తోంది. ఎవ‌రితోనూ పొత్తు లేకుండా ఒంటిరిగా వెళితే మిగిలిన ఆప్ష‌న్ల కంటే బెట‌ర్ గా ఆ పార్టీ ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మూడు ఆప్ష‌న్ల మీద లోతుగా ప‌రిశీలించిన చంద్ర‌బాబు అండ్ టీమ్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా వెళ్ల‌డం అత్యుత్త‌మంగా భావిస్తోంది.

బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్ల‌డాన్ని ఆ పార్టీ అధిష్టానం ప‌రిశీలించింద‌ట‌. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న నెగిటివ్ కంటే ఏపీలో మ‌రింత ఎక్కువ‌గా ఉన్న‌ట్టు గ్ర‌హించారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విభ‌జ‌న హామీల‌పై ఉదాసీనంగా మోడీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ప్ర‌జ‌లు సీరియ‌స్ గా ఆలోచిస్తున్నార‌ని స‌ర్వేల ద్వారా తేలింద‌ట‌. అందుకే ఆ పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని టీడీపీలోని కోర్ టీమ్ భావిస్తోంద‌ని వినికిడి.

ఇక రెండో ఆప్ష‌న్ కింద జ‌న‌సేన‌, టీడీపీ పొత్తుతో వెళ్ల‌డం. దాని వ‌ల‌న జ‌న‌సేన‌కు లాభం మిన‌హా టీడీపీకి వ‌చ్చే ప్ర‌త్యేక బెనిఫిట్ ఏమీ ఉండ‌ద‌ని గ్ర‌హించార‌ట‌. ఎందుకంటే, హార్ట్ కోర్ కాపు సామాజిక‌వ‌ర్గంలోని అత్య‌ధిక భాగం తొలి నుంచి టీడీపీకి వ్య‌తిరేక ఓటు బ్యాంకుగా ఉంది. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లోని బ‌లిజ‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోని శెట్టి బ‌ల‌జ సామాజిక వ‌ర్గాలు బీసీలుగా ఉన్నారు. వాళ్లు తొలి నుంచి టీడీపీకి ఎక్కువ‌గా ఓటు బ్యాంకుగా ఉన్నారు.పైగా కాపు, బ‌లిజ‌ల మ‌ధ్య ప‌లుచోట్ల సామాజిక‌వ‌ర్గం అంత‌రం నిశ్శ‌బ్దంగా ఉంది. ఒకవేళ ప‌వ‌న్ తో క‌లిసి టీడీపీ వెళితే కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ కు క‌ట్టుబ‌డి ఉండాలి. అదే జరిగితే బీసీలుగా ఉన్న బ‌లిజ సామాజిక‌వ‌ర్గంతో పాటు వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున టీడీపీ కోల్పోవాల్సి వ‌స్తుంది. అందుకే, రెండో ఆప్ష‌న్ మీద కూడా టీడీపీ ఆచితూచి అడుగువేస్తోంది.

మూడో ఆప్ష‌న్ గా ఉన్న ఒంట‌రి పోరాటం కార‌ణంగా జ‌గ‌న్ స‌ర్కార్ మీద ఉన్న వ్య‌తిరేక ఓటు సాలిడ్ గా చంద్ర‌బాబు కు వ‌స్తుందని స‌ర్వేల సారాంశం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు, త‌ట‌స్తులు రెండో ఆలోచ‌న లేకుండా చంద్ర‌బాబు సీనియార్టీ వైపు చూసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. రాష్ట్రం ప్ర‌యోజ‌నాల‌ను మ‌త్ర‌మే త‌ట‌స్థ ఓట‌ర్లు చూస్తున్నార‌ని స‌ర్వే ద్వారా స్ప‌ష్టం అయింద‌ట‌. అధికారాన్ని నిర్ణ‌యించే 10శాతం త‌ట‌స్థ ఓట‌ర్లు కులం, మ‌తం, ప్రాంతం ఇత‌ర‌త్రా సెంటిమెంట్ల‌కు త‌లొగ్గ‌రు. రాష్ట్ర భ‌విష్య‌త్‌, ప్ర‌యోజ‌నాల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వాళ్లు ఓటేస్తారు. ఆ ఓటు బ్యాంకు ప్ర‌స్తుతం సాలిడ్ గా చంద్ర‌బాబు వైపు ఉంద‌ని తాజా స‌ర్వేల్లోని సారాంశం. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు ప్ర‌మాదం అనే భావ‌న‌కు టీడీపీ కోర్ టీమ్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కూడా బ‌లంగా ఉంది. ఒకవేళ 2024 ఎన్నిక‌ల తరువాత అధికారంలోకి చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్ప‌టికీ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా వైసీపీ నిల‌బ‌డే అవ‌కాశం ఉంటుంది. అప్పుడు స‌హజ మిత్రునిగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో క‌లిసి ఏక్ నాథ్ షిండేలను త‌యారు చేయ‌డానికి బీజేపీ వెనుకాడ‌దు. ఆ విష‌యం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ చేస్తోన్న రాజ‌కీయం ద్వారా స్ప‌ష్టం అవుతోంది. అలా కాకుండా జ‌న‌సేన‌కు 10 మంది ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాళ్ల‌తో బీజేపీ గేమ్ ఆడే ఛాన్స్ ఉంది. వాస్త‌వంగా టీడీపీతో పొత్తు లేకుండా జ‌న‌సేన గెలుపు రాష్ట్రంలో ఎక్క‌డా క‌నిపించ‌డంలేద‌ని తాజాగా స‌ర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ ఎదిగిన‌ట్టే, ఏపీలో 2024 త‌రువాత జ‌న‌సేన ఒక ప‌ర్మినెంట్‌ ఫోర్స్ అవుతుంద‌నేది స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచిస్తోన్న టీడీపీ అధిష్టానం పొత్తు మీద మౌనంగా ఉండ‌డంతో పాటు ఒంట‌రిగా వెళ్లే అంశాన్ని లోతుగా అధ్య‌య‌నం చేస్తోంది. ఏ పార్టీతో కలిసి అడుగులు వేసిన‌ప్ప‌టికీ న‌ష్టం మిన‌హా వ‌చ్చే అద‌న‌పు బెనిఫిట్స్ టీడీపీకి క‌నిపించ‌డంలేదు. ఆ విష‌యాన్ని కోర్ టీమ్ లోని కొంద‌రు చంద్ర‌బాబు వ‌ద్ద ధైర్యంగా చెబుతున్న‌ప్ప‌టికీ జ‌న‌సేన‌తో పొత్తుకు ఆయ‌న సానుకూలంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఒక వేళ ఆ పార్టీతో పొత్తుకు వెళితే చంద్ర‌బాబు చారిత్ర‌క త‌ప్పు మ‌రొకటి చేసిన నాయ‌కునిగా మిగిలే అవ‌కాశం ఉంద‌ని హార్డ్ కోర్ టీడీపీ లీడ‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు. అంతిమంగా చంద్ర‌బాబు ఎలాంటి స్ట్రాటజీని 2024లో ప్లే చేస్తారో చూడాలి.