Telugu Desam Party 2.0:చంద్ర‌బాబు ఉద్య‌మం 2.0

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై మ‌రింత నిర్మాణాత్మ‌క ఉద్య‌మం చేయాల‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేల‌పై జ‌నం ఆగ్ర‌హంగా ఉన్నార‌ని గ్ర‌హించిన ఆయ‌న ప్ర‌జా ఉద్య‌మాన్ని నిర్మించాల‌ని భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 30, 2022 / 11:37 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై మ‌రింత నిర్మాణాత్మ‌క ఉద్య‌మం చేయాల‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేల‌పై జ‌నం ఆగ్ర‌హంగా ఉన్నార‌ని గ్ర‌హించిన ఆయ‌న ప్ర‌జా ఉద్య‌మాన్ని నిర్మించాల‌ని భావిస్తున్నారు. సుమారు 6ల‌క్ష‌ల కోట్ల అవినీతికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల్ప‌డ్డాడ‌ని టీడీపీ లెక్కిస్తోంది. ఆ మేర‌కు మీడియా ముఖంగా ప‌లుమార్లు ఆ పార్టీ నేతలు ప్ర‌క‌టించారు. అందుకు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ప్ర‌స్తుతం సిద్ధం అయింది. అంతేకాదు, ఎమ్మెల్యేల వారీగా చేసిన అక్ర‌మాలు, అవినీతిపై క‌ర‌ప‌త్రాల‌ను పంచాల‌ని భావిస్తోంది.

ఇటీవ‌ల కొంద‌రు మంత్రుల‌కు సంబంధించిన అక్ర‌మాలు, అవినీతి గురించి జిల్లాల వారీగా చార్జిషీట్ ను విడుద‌ల చేశారు. ఆ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌ జ‌రిగింది. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనివార్యంగా కొంద‌రు మంత్రుల్ని దూరంగా పెట్టాల్సి వ‌చ్చింది. మంత్రుల ఆస్తులు, అక్ర‌మాలు గురించి చేసిన ప్ర‌చారం జ‌నంలోకి బ‌లంగా వెళ్లింది. దాని ప‌ర్య‌వ‌సాన‌మే ఇప్పుడు జ‌నం వైసీపీ మంత్రుల్ని , ఎమ్మెల్యేల్ని నిల‌దీసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు రాబోవు రోజుల్లో ప్ర‌తి ఎమ్మెల్యేకు సంబంధించిన చార్జిషీట్ ల ద్వారా అక్ర‌మాలు, అవినీతి గురించిన డేటాను బ‌య‌ట పెట్టాల‌ని క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఏపీ ప్ర‌భుత్వంపై విధాన‌ప‌ర‌మైన పోరాటం చేయ‌డానికి అంశాల వారీగా చార్జిషీట్ ల‌ను టీడీపీ విడుద‌ల చేసింది. పధానంగా ఇసుక‌, మ‌ద్యంపై విడుద‌ల చేసిన చార్జిషీట్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. సంక్షేమ‌ప‌థ‌కాలు కాకుండా మిగిలిన అంశాల‌పై ప్ర‌స్తుతం టీడీపీ ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ఆయా రంగాల వారీగా జ‌రిగిన న‌ష్టాన్ని ఎత్తిచూప‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని నిర్మాణాత్మ‌కంగా నిల‌దీయాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ త‌యారు అవుతోంది. ఏ ఎమ్మెల్యే ఎంత దోచుకున్నారో..తెలియ‌చేసే చార్జిషీట్లు త్వ‌ర‌లోనే టీడీపీ విడుద‌ల చేయ‌డానికి సిద్ధం గా ఉంది.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌తి ఇంటికి ఎమ్మెల్యేల బాగోతాన్ని తెలియ‌చేయ‌డానికి టీడీపీ సిద్ధం అయింది. ఇంటింటికీ తెలుగుదేశం కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే, ఒంగోలు మ‌హానాడు త‌రువాత మినీ మ‌హానాడుల‌ను చంద్ర‌బాబు కొన‌సాగిస్తున్నారు. వాటికి వ‌స్తోన్న ప్రజాద‌ర‌ణ‌ను గ‌మ‌నించిన టీడీపీ ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా ప్ర‌జ‌ల్ని ఆలోచింప‌చేయాల‌ని భావిస్తోంది. అందుకోసం అవ‌స‌ర‌మైన డేటాను స‌మీక‌రించ‌డం ద్వారా ఎమ్మెల్యేల వారీగా చార్జిషీట్ల‌ను సిద్ధం చేస్తున్నారు. మంత్రివ‌ర్గం 2.0 కు ముందుగా వేసిన చార్జిషీట్ ల కార‌ణంగా స‌మీప బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డిని మంత్రివ‌ర్గం నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూరంగా పెట్టార‌ని టీడీపీ విశ్వసిస్తోంది. అంతేకాదు, క్యాబినెట్ 2.0కు దూరంగా ఉంచిన మంత్రులంద‌రిపైన టీడీపీ ఛార్జిషీట్ లు బాగా ప‌నిచేశార‌ని తెలుస్తోంది. అందుకే, ఈసారి ఎమ్మెల్యేల వారీగా అక్ర‌మాలు, అవినీతి, ద‌మ‌న‌కాండ‌ల‌పై చార్జిషీట్ ను విడుద‌ల చేయ‌డానికి టీడీపీ సిద్ధం అవుతోంది.

ఎమ్మెల్యేపై త‌యారు చేసే క‌ర‌పత్రం ప్ర‌తి ఇంటికి వెళ్ల‌డానికి చంద్ర‌బాబు భారీ స్కెచ్ వేస్తున్నారు. ఎమ్మెల్యేలు రోడ్ల‌పైకి వ‌స్తే జ‌నం కొట్టేలా ఉద్య‌మాన్ని నిర్మించ‌డానికి నిర్మాణాత్మ‌క చార్జిషీట్ల‌ను తయారీచేసే ప‌నిలో నిమ‌గ్నం అయింది. మొత్తం మీద గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీకి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను మరింత‌ పెంచేలా ఎమ్మెల్యేల‌పై చార్జిషీట్ లను టీడీపీ రూపొందిస్తోంది. ఆ క‌ర‌ప‌త్రాలు బ‌య‌ట‌కు వ‌స్తే, వైసీపీ ఎమ్మెల్యేల బాగోతం జ‌నం మ‌ధ్య చ‌ర్చ‌కు రానుంది. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల ఆలోచ‌న మారుతుంద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది.