100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జ్ ల‌ను మారుస్తున్న టీడీపీ…?

తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతుంది. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చిన గెలుపు బ‌రిలో నిల‌బ‌డేందుకు రెఢీ అయింది.

  • Written By:
  • Publish Date - December 7, 2021 / 10:36 AM IST

తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతుంది. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చిన గెలుపు బ‌రిలో నిల‌బ‌డేందుకు రెఢీ అయింది. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌కవ‌ర్గాల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెళ్లారు. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే కొత్త ఇంఛార్జ్ ల‌ను టీడీపీ అధిష్టానం నియ‌మించింది. అయితే ప్ర‌స్తుతం ఉన్న ఇంఛార్జ్ లు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థులు కాక‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ టీడీపీలో జోరుగా సాగుతుంది. కొత్త ఇంఛార్జ్ ల‌తో పాటు పాత ఇంఛార్జ్ ల ప‌ని తీరుపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌మీక్ష చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంఛార్జ్ ల ప‌నితీరు ఏ మాత్రం బాగాలేక‌పోయిన త‌ప్పించేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తుంది. గ‌తంలో చేసిన త‌ప్పునే మ‌ళ్లీ చేయ‌కూడ‌ద‌నే భావ‌న‌లో చంద్ర‌బాబు వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల్లో చాలా మంది ఎమ్మెల్యేల ప‌ని తీరు బాగాలేద‌ని స‌ర్వే రిపోర్టు వ‌చ్చినా చంద్ర‌బాబు వారికే మ‌ళ్లీ టికెట్స్ ఇచ్చారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చవిచూడాల్సి వ‌చ్చింది. ఇదే త‌ప్పు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌కూడ‌ద‌ని బాబు ఫిక్స్ అయ్యార‌ని టాక్ వినిపిస్తుంది.

175 నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జిలలో 100కు పైగా మార్పులు చేర్పులు చేసి రాబోయే రోజులలో వారే కాబోయే ఎమ్యెల్యే అభ్యర్ధులుగా పార్టీ అదినేత చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌కుండా తాత్కాలికంగా చంద్రబాబు నిలిపివేశారు. సంక్రాంతి త‌రువాత పనితీరు ఆధారంగా ఇంఛార్జ్ ల‌ను త‌ప్పించి కొత్త‌వారిని నియ‌మించనున్న‌ట్లు సమాచారం. ఒకేసారి 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్ ల‌ను ప్ర‌క‌టించి వారినే ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌గా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఎన్ని నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జిలను నిమమిస్తారనే విషయం బయట పడనప్పటికీ.. వంద నియోజకవర్గాల ఇంచార్జిలను తొలగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిని బట్టి ప్రస్తుత ఇంచార్జిలలో చాలా మందిని త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రో వైపు లోకేష్ కూడా త‌న టీమ్ కి ప్రాధాన్య‌త ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఇప్ప‌టికే పార్టీ బ‌హిరంగ వేదిక‌ల‌పై అధినేత ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది కొత్త‌వారిని ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా వ‌చ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.ఓడిపోయిన మున్సిపాలిటీల‌పై వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హించి లోపాల‌ను స‌రిచేసుకోవాల‌ని నేత‌ల‌కు సూచించారు. మ‌రోవైపు గ‌తంలో పార్టీలో ఉండి అధికారం పోయిన త‌రువాత పార్టీ వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ఆలోచ‌నే లేద‌ని బాబు స్ప‌ష్టం చేశారు.