Site icon HashtagU Telugu

Janasena Avirbhava Sabha : పొలిటిక‌ల్ చౌర‌స్తాలో జ‌న‌సేనాని

Pawan Kalyan

Pawan Kalyan

రాజ‌కీయాల్లో ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు వాళ్ల‌వే. రాజ్యాధికారం దిశగా ఎలాంటి అవకాశాన్నైనా ఏ పార్టీ వ‌దులుకోదు. అందుకోసం ఎన్ని మెట్లు దిగ‌డానికైనా స‌మ‌కాలీన రాజ‌కీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ప‌రిస్థితి టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య క‌నిపిస్తోంది. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌ను ఈసారి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఆ వేదిక‌పై నుంచి ప‌వన్ క‌ల్యాణ్ దిశానిర్దేశం చేస్తాడ‌ని అభిమానుల చూపుతోన్న ఆస‌క్తి. ఆ స‌భ‌ను సూప‌ర్ హిట్ చేయ‌డానికి పొత్త‌ను కోరుకుంటోన్న టీడీపీ తెర‌వెనుక అండ‌గా నిలుస్తోంది.ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన కు ద‌గ్గ‌ర కావ‌డానికి ప‌లు ప్ర‌యత్నాలు చేస్తోంది. ఆ పార్టీ తొంద‌ర‌పాటును రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి జ‌న‌సేనాని ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తుతో ఉన్నాయి. కానీ, ఆ రెండు పార్టీ మ‌ధ్య భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఏ రోజైన క‌టీఫ్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత జ‌న‌సేన త‌న పంథాను మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. అవ‌మానాలు భరించైనా బీజేపీతో పొత్తును కొన‌సాగించ‌డానికి జ‌న‌సేనాని సిద్ధం అయిన‌ట్టు సమాచారం. ఆ విష‌యాన్ని సోమ‌వారం జ‌రిగే ఆవిర్భావ సభ‌లో వెల్ల‌డిస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ చేసే ప్ర‌సంగం ఎలా ఉండబోతుందో..తెలియ‌చేసేలా ఆదివారం ఒక వీడియోను ట్రైల‌ర్ రూపంలో జ‌న‌సేనాని విడుద‌ల చేశాడు. దాని ఆధారంగా గ‌త రెండేళ్లుగా జ‌గ‌న్ స‌ర్కార్ చేసిన ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను ఎత్తిచూప‌బోతున్నాడని అర్థమ‌వుతోంది. వ్యక్తిగ‌తంగా త‌న‌పై చేసిన కామెంట్ల‌కు కూడా ఈ వేదిక‌పై నుంచి ప‌వ‌న్ రిప్లై ఇవ్వ‌బోతున్నాడు. సిద్ధాంత ప‌రంగానూ, విధాన‌ప‌రంగానూ ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేద‌ని ఆయ‌న విడుద‌ల చేసిన ట్రైల‌ర్ వీడియో ఆధారంగా విశ్లేషించుకోవ‌చ్చు. తొమ్మిదో ఏట అడుగుపెట్టిన జ‌న‌సేన సిద్ధాంత ప‌రంగా ఏదైనా క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుంద‌ని ఆ పార్టీ అభిమానులు భావిస్తున్నారు. గత రెండున్నరేళ్లలో ఏమేం జరిగాయి? ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం? అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని పవన్ కల్యాణ్ ట్రైల‌ర్ వీడియోలో స్ప‌ష్టం చేశాడు. విచిత్రంగా ఈసారి దామోద‌ర సంజీవ‌య్య భావ‌జాలాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్ చెప్పేందుకు సిద్ధం అయ్యాడు.

ఎనిమిదేళ్ల క్రితం జ‌న‌సేన ఆవిర్భావం రోజున చేగువీరా , చాక‌లి ఐల‌మ్మ భావ‌జాలాన్ని బ‌లంగా ప‌వ‌న్ వినిపించాడు. ప్ర‌శ్నించే త‌త్త్వాన్ని అల‌వాటు చేయ‌డ‌మే జ‌న‌సేన సిద్ధాంత‌మ‌ని దిశానిర్దేశం చేశాడు. అదే స్లోగ‌న్ తో 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు పార్టీ న‌డిపాడు. ఆ ఎన్నిక‌ల్లో కాన్షీరాం భావ‌జాలాన్ని జోడించాడు. చేగువీరా, ఐల‌మ్మ‌, కాన్షీరాం భావ‌జాలాన్ని మిక్స్ చేసి కులాల‌ను క‌లిపే మ‌తాల ప్ర‌స్తావ‌న లేని సిద్ధాంతం అంటూ 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లాడు. క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ ల‌తో క‌లిసి కూట‌మిగా పోటీ చేయ‌గా ఆయ‌న రెండు చోట్లా ఓడిపోయాడు. జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థులు చాలా మంది డిపాజిట్లు గ‌ల్లంతు అయ్యాయి. ఒకేఒక ఎమ్మెల్యే రాపాక వ‌ర ప్ర‌సాద్ గెలిచాడు. ఆయ‌న కూడా ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. 2019 ఎన్నిక‌ల త‌రువాత అక‌స్మాత్తుగా బీజేపీతో ప‌వ‌న్ జ‌త క‌ట్టాడు. దీంతో పార్టీ సిద్ధాంత‌క‌ర్త‌లుగా ఉన్న కొంద‌రు జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పారు. పార్టీని విలీనం చేయాల‌ని ఢిల్లీలోని ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని ప‌వ‌న్ ఇచ్చిన సంకేతం ఆనాడు క‌ల‌క‌లం రేపింది.ప్ర‌జారాజ్యం పార్టీకి యువ‌రాజ్యం అధ్యక్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ప‌వ‌న్ కు ఉంది. ఆ అనుభవంతోనే జ‌న‌సేన పార్టీని స్థాపించాడు. 25ఏళ్ల పోరాటాన్ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. రాజ్యాధికారం కోసం కాదంటూ తొలి రోజుల్లో చెప్పిన జ‌న‌సేనాని ఇప్పుడు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతున్నాడు. ప‌ల్ల‌కీలు మోసే బోయీలుగా ఎల్ల‌కాలం ఉండ‌లేమ‌ని ప‌లు వేదిక‌ల‌పై చెప్పాడు. రాజ్యాధికారం దిశ‌గా బ‌లంగా అడుగులు వేస్తోన్న ఆయ‌న‌కు టీడీపీ అండ దొరికింది. ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ ప‌వ‌న్ కల్యాణ్ మ‌ద్ధ‌తు కోసం అర్రులా చాస్తోంది. ఇలాంటి ప‌రిణామాన్ని రాజ్యాధికారం దిశ‌గా మ‌లుచుకోవాల‌ని జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

Janasena Sabha

2019 ఎన్నిక‌ల్లో బీఎస్పీ, వామ‌ప‌క్షాల‌తో కూట‌మి క‌ట్టిన జ‌న‌సేన ఈసారి పంథాను మార్చ‌నుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. నోటా కంటే త‌క్కువ ఓట్లు ఉన్న బీజేపీని ఏపీలో నైస్ గా వ‌ద‌లించుకోవాల‌ని చూస్తోంద‌ని వినికిడి. ఇప్ప‌టికే చెరోదారిలాగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరును చూస్తుంటే, రెండు పార్టీల మ‌ధ్య పొస‌గ‌డంలేద‌ని అర్థం అవుతోంది. ఆ క్ర‌మంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం ఊపందుకుంది. కానీ, టీడీపీతో పొత్తు రాజ్యాధికారం ఇవ్వ‌ద‌ని జ‌న‌సైనికుల అభిప్రాయం. టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో అధికారంలోకి వచ్చిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు సీఎం అవుతాడ‌ని జ‌న‌సేన‌కు తెలుసు. అందుకే, ఇప్పుడు మ‌రో ప్ర‌త్యామ్న‌యం దిశ‌గా ఆలోచిస్తుంద‌ని టాక్‌. ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజ్యాధికారం సాధ్య‌మ‌నే ధోర‌ణి ఇప్పుడు జ‌న‌సేన‌లో క‌నిపిస్తోంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ తొమ్మిదో ఆవిర్భావ స‌భ వేదిక పై నుంచి ప‌వ‌న్ ఇచ్చే స్పీచ్ ఎలాంటి దిశానిర్దేశం చేయ‌నుందో..చూడాలి.