Site icon HashtagU Telugu

TDP Janasena : టీడీపీ, జ‌న‌సేన పొత్తు దిశ‌గా కీల‌క అడుగు

Pawan Babu New

Pawan Babu New

పొత్తుల దిశ‌గా టీడీపీ, జ‌న‌సేన మ‌రో అడుగు ముందుకు ప‌డింది. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక ను ర‌చించుకుని ముందుగా ప్ర‌జా స‌మస్య‌ల‌పై పోరాటం చేయ‌డానికి రెండు పార్టీలు ప్రాథ‌మికంగా ఒక‌ట‌య్యాయి. విప‌క్షాల‌న్నీ క‌లిసి రావాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంయుక్తంగా మీడియా ద్వారా పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో పొత్తు ఉంటుంద‌న్న సంకేతాల‌కు సంయుక్త మీడియా స‌మావేశం వేదిక అయింది. ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి ఉమ్మ‌డి ప్ర‌ణాళిక ఆ త‌రువాత పార్టీ సిద్ధాంతాలు, ఎన్నిక‌ల‌ప్పుడు ఏ పార్టీ ఎలా క‌లిసి వెళ‌తాయో తేలుతుంద‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. సుమారు గంట‌పాటు నోవాటెల్ హోట‌ల్ లో భేటీ అయిన త‌రువాత బాబు, ప‌వ‌న్ సంయుక్తంగా మీడియా స‌మావేశం పెట్టారు.

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం రాజ‌కీయ పార్టీలు ఐక్యంగా ప‌నిచేయాల‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. రాజ‌కీయ పార్టీల‌కు స్వేచ్చ లేకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ చేస్తుంద‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా రాజ‌కీయ పార్టీల‌ను కాపాడుకోవాల‌ని సూచించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటే రాజ‌కీయ పార్టీలు ఉండాల‌ని అన్నారు. అందుకే, ముందుగా రాజ‌కీయ పార్టీల‌ను కాపాడుకోగ‌లిగితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ర‌క్షించుకోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడున్న ఏపీ స‌ర్కార్ అరాచ‌క‌త్వాన్ని , ఉన్మాదాన్ని అడ్డుకోవాలంటే రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు రావాల‌ని సంయుక్తంగా మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ వెల్ల‌డించారు.

రాష్ట్రంలోని విప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు క‌లిసి ప్ర‌జా స్వామ్యాన్ని కాపాడుకోవాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశం కోణం నుంచి కాకుండా ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవ‌డానికి ఒకే వేదిక‌పైకి విప‌క్షాలు క‌లిసి పోరాటాలు చేయాల‌ని సంయుక్తంగా నిర్ణ‌యించారు. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ను ర‌చించ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను నిలువ‌రించాల‌ని ప్రాథ‌మికంగా ఒక అంగీకారానికి వ‌చ్చారు.

స్వేచ్చ‌ను హ‌రిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని అడ్డుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. విశాఖ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మీటింగ్ పెట్టుకోకుండా అడ్డుకున్న అంశాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. జ‌న‌సేనానికి జ‌రిగిన అవ‌మానాన్ని చెబుతూ విశాఖ వేదిక‌గా జ‌రిగిన సంఘ‌ట‌న క్ర‌మంలో జ‌రిగిన పరిణామాల‌పై జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు సంఘీభావం తెలిపారు.

విశాఖ వెళ్లిన సంద‌ర్భంగా ప‌వ‌న్ కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు. గ‌తంలో ఆయ‌న‌కు జ‌రిగిన ఇలాంటి ప‌రిణామాన్ని గుర్తు చేశారు. కేవ‌లం సంఘీభావం తెలియచేయ‌డానికి మాత్ర‌మే ప‌వ‌న్ ను క‌లిశాన‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌ప‌డింది: వైసీపీ మంత్రులు

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల‌యిక‌ను వైసీపీ మంత్రులు సీరియ‌స్ గా తీసుకున్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌ప‌డింద‌ని రాజ‌కీయ‌దాడికి దిగారు. ద‌త్త‌పుత్రుడు, ప్యాకేజీ స్టార్ నైజం బ‌య‌ట‌ప‌డింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ‌లో ప‌వ‌న్ కు ఏమైయింద‌ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లాల‌ర‌ని ప్ర‌శ్నించారు. విశాఖ గ‌ర్జ‌నకు హాజ‌రై వెళుతోన్న మంత్రుల‌పై ప‌వ‌న్ సైకో గ్యాంగ్ దాడి చేసింద‌ని మంత్రులు గుర్తు చేశారు. ఆయ‌న‌కు ఎలాంటి అగౌర‌వం క‌ల‌గ‌లేద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం 5 కోట్ల మందికి బాగుంద‌ని కేవ‌లం చంద్ర‌బాబు, పవ‌న్ కు మాత్ర‌మే ప్ర‌జాస్వామ్యంలేద‌ని మంత్రులు ధ్వ‌జ‌మెత్తారు. పెళ్లి, శోభ‌నం ఒకే రోజు చేసుకున్న విధంగా టీడీపీ, జ‌న‌సేన క‌ల‌యిక ఉంద‌ని మంత్రి అమ‌ర్నాథ్ సెటైర్లు వేశారు. 2014లో క‌లిసిన విధంగా పొత్తు దిశ‌గా అడుగులు వేస్తోన్న ప‌వ‌న్, చంద్ర‌బాబు ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం దుర్మార్గ‌మ‌ని మంత్రులు ధ్వ‌జ‌మెత్తారు. విలువలు, విశ్వ‌స‌నీయ‌త‌లేని ప‌వ‌న్‌, రాజ‌కీయాల్లో మోస‌గారి చంద్ర‌బాబు క‌లిసినందు వ‌ల‌న వైసీపీకి వ‌చ్చే న‌ష్టంలేద‌ని మంత్రులు జోగి, అమ‌ర్నాథ్ అన్నారు.