Huzurnagar Election: సీఎం జ‌గ‌న్‌కు స్టే ఇచ్చిన.. తెలంగాణ హైకోర్టు..!

  • Written By:
  • Publish Date - March 30, 2022 / 10:41 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. 2014 ఎన్నికల సమయంలో న‌ల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్‌లో త‌న‌పై నమోదైన ఎన్నికల ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ పిటీష‌న్‌ను స్వీకిరించిన తెలంగాణ హైకోర్టు, ఈ కేసుకు సంబంధించి తుదుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 26కు వాయిదా వేసింది. అంతే కాకుండా అప్ప‌టి వ‌ర‌కు ఈకేసులో సీఎం జ‌గ‌న్ హాజ‌రు కాకుండా మిన‌హాయింపు ఇచ్చింది.

ఇక 2014 ఎన్నికల సమయంలో హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనుమతి లేకుండా జగన్ రోడ్ షో నిర్వహించారని ఆరోపణలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎలక్షన్ కోడ్‌ను ఉల్లఘించారన్న అభియోగాలతో జ‌గ‌న్‌పై కేసు నమోదైంది. ఈ క్ర‌మంలో ఈ కేసుకు సంబంధించి ఇటీవల నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేప‌ధ్యంలో ఇటీవ‌ల నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు జ‌గ‌న్‌కు నోటీసులు జారీ చేయ‌డ‌మే కాకుండా, మార్చి 28 తేదీన కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ కేసులో భాగంగా విచారణకు హాజరయ్యేందుకు కొద్దిగా సమయం కోరుతూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి, తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్ర‌మంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయ‌గా, విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు.. జగన్‌కు ఏప్రిల్ 26 వరకు ఈ కేసు విచారణకు హాజరు కాకుండా స్టే ఇచ్చింది. ఈ క్ర‌మంలో దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులకు న్యాయస్థానం జారీ చేసింది. ఇక‌పోతే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోపు తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకోసం ఏర్పాటు చేయ‌బ‌డిన ప్ర‌త్యేక కోర్టుల్లో ప్ర‌జాప్ర‌తినిధుల కేసుల‌కు సంబంధించి విచార‌ణ చురుగ్గా సాగుతుంది.