Jagan vs Chandrababu: జగన్‌కు ఓటమి భయం.. ఇంటికి సాగనంపడానికి సిద్దమైన ప్రజలు

ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోంది అందుకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ వదులుకున్నా..ప్రజలు ఆయనను ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Jagan vs Chandrababu: ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోంది అందుకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ వదులుకున్నా..ప్రజలు ఆయనను ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఇదే తన చివరి ఎన్నికలని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు, రాబోయే ఎన్నికలు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు నియంతకి మధ్య జరిగే పోరు అని పేర్కొన్నారు. గత నెలలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారిగా జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టీడీపీకి అధికారం కొత్త కాదనీ, ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేనతో కలిసిందని చంద్రబాబు స్పష్టం చేశారు. డిసెంబరు 15న ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్న బాబు .. వైఎస్సార్‌సీపీ మునిగిపోయే పడవగా వర్ణిస్తూ నేతలంతా అందులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలవడం లేదని, తన సోదరికి, తల్లికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆత్మగౌరవం ఉన్నవారు జగన్‌ను కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించరని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన అధికార వ్యతిరేకతతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. బీఆర్‌ఎస్కి చెందిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మట్టి కరిపించాల్సి రావడంతో, వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న ఎన్నికలకు మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వదులుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ యోచిస్తోంది. .ఐపాక్ చేసిన సర్వేలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తేలింది. కొందరి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పొరుగు నియోజకవర్గాలకు తరలించి, ఏకకాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కొందరిని బరిలోకి దింపాలని కూడా ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడంలో విఫలమైన వెంటనే వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ వ్యక్తుల్ని ప్రోత్సహించే ప్రక్రియ ప్రారంభించింది వైసీపీ. అయితే ఈ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తికి తిరుగుబాటుకు కూడా దారితీసింది.

Also Read: Telangana Politics: భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదు