రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గిలిగింతలు పెడుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి పదవీదాహానికి అనవసరంగా సహకారం అందించానని `పీకే` ఇటీవల వ్యాఖ్యానించారు. వీళ్లిద్దరూ ఎందుకు ఏపీ సీఎం మీద అక్కసు వెళ్లగక్కుతున్నారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో నిలిచింది.
వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ఢిల్లీ చక్రం తిప్పాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మేరకు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కేంద్రంగా పలు రకాల స్కెచ్ లను వాళ్లిద్దరూ రచించారు. ఆ సమయంలోనే ఏఐసీసీ చీఫ్ గా ఉన్న సోనియాను అప్పట్లో `పీకే` కలిశారు. యూపీఏ అధికారంలోకి రావడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీతో జత కడితే ఆశించిన ఫలితం ఉంటుందని సూచించారు. ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తూ గాంధీ కుటుంబీకుల్ని ఇటీవల వెనకేసుకు వస్తున్నారు. కానీ, జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం `పీకే` వ్యూహాలకు అనుగుణంగా సంకేతాలు ఇవ్వడంలేదు. ఇక్కడే కేసీఆర్, పీకే లకు మండుతుందని వాళ్ల ఎత్తుగడలు గురించి బాగా తెలిసిన వాళ్లు ఊహిస్తున్న అంశం.
Also Read: Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్ దే విజయం!
ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ బీజేపీకి అన్ని విధాల సహకారం అందించారు. ఇటీవల ముచ్చింతల్ రామానుచార్యుల విగ్రహం ఆవిష్కరణ జరిగినప్పటి నుంచి మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ వేదికగా 370రద్దు, పౌరసత్వం, వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ తదితరాలన్నింటికీ టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రమే ఇటీవల విభేదించింది. అదే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఎన్డీయే అడుగులకుమడుగులు ఒత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీకి అవసరం ఉండదు. కానీ, బీజేపీ మీద జగన్ కు అనుమానం కలిగిలా కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రస్తుతం బీహార్ కేంద్రంగా జన్ సురాజ్ పాదయాత్ర చేస్తోన్న రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్ర సీఎం నితీష్, జగన్మోహన్ రెడ్డిని ఒకేసారి టార్గెట్ చేశారు. వాళ్లిద్దరూ బీజేపీ కోసం పనిచేస్తున్నారన్న యాంగిల్ లో మాట్లాడారు. బీజేపీ కోవర్టు గా నితీష్ ను ఫోకస్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి సహకారం అందించకుండా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం చేస్తే బాగుండేదని `పీకే` అనడం వెనుక ఆంతర్యం మరోలా కనిపిస్తోంది. బహుశా బీజేపీకి దూరం కావాలని `పీకే` ఇచ్చిన సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించి ఉండొచ్చు. అందుకే ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్లు జగన్ మీద చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్, పీకే ఇద్దరూ జగన్మోహన్ రెడ్డిని బీజేపీకి దూరం చేసే ప్రయత్నం ఇప్పట్లో ఫలించకపోవచ్చు.
Also Read: Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!