CM KCR & YS Jagan : ఢిల్లీ వేదిక‌గా సీఎంలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వారం పాటు అక్క‌డే ఉంటార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంతో పాటు వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తారు. ఆ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చెబుతోంది.

  • Written By:
  • Publish Date - April 4, 2022 / 05:52 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వారం పాటు అక్క‌డే ఉంటార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంతో పాటు వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తారు. ఆ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చెబుతోంది. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళుతున్నారు. ఆ రోజు సాయంత్రం ప్ర‌ధాన మంత్రి మోడీని క‌లుస్తారు. సీఎంవో కార్యాల‌యం ఆ మేర‌కు అధికారికంగా చెబుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్ద‌రూ ఒక‌రోజు అటూఇటూగా ఢిల్లీ వేదిక‌పై ఉంటారు.కేంద్రానికి ఇద్ద‌రు సీఎంలు ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్నిహితంగా మెలిగారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, పౌర‌స‌త్వం, 370 ర‌ద్దు వంటి అంశాల విష‌యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం జ‌రిగింది. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌త్యక్షంగా మ‌రికొన్ని సంద‌ర్భాల్లో ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం ద్వారా మోడీ నిర్ణ‌యాల‌కు జైకొట్టారు. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో బీజేపీ, వైసీపీ వెళుతోంది. కేంద్రానికి తెలియ‌కుండా ఏదీ చేయ‌బోమ‌ని తొలి రోజుల్లోనే విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన విష‌యం విదిత‌మే.ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా మోడీ, అమిత్ షా పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ, దేశంలో ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్లంటూ ప్ర‌శంసించిన విష‌యం అందిరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నుంచి కేంద్రంతో క‌లివిడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న సాగిస్తున్నాడు. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో సహ‌క‌రించారు. బీజేపీ పెద్ద‌ల ఆదేశం మేర‌కు ప‌రిమ‌ళ‌న‌త్వానికి రాజ్య‌స‌భ‌ను కూడా జ‌గ‌న్ ఇచ్చారు. రాబోయే రాజ్య‌స‌భ‌, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కూడా మునుప‌టి మాదిరిగా స‌హ‌కారం అందించ‌డానికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని పిలిపించుకుని ఉంటార‌ని టాక్‌.

తెలంగాణ సీఎం కేసీఆర్ పాల‌న‌పై ప‌లు సంద‌ర్భాల్లో కేంద్ర మంత్రులు, మోడీ కూడా ప్ర‌శంస‌లు కురించారు. అవార్డులు, రివార్డులు కూడా ఇచ్చారు. ఆనాడు 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేంద్రం స‌హ‌కారం అందించింద‌ని స‌ర్వ‌త్రా వినిపించిన మాట‌. రెండోసారి సీఎం అయిన త‌రువాత కేసీఆర్ కేంద్రానికి స‌హ‌కారం అందిస్తూ వ‌చ్చారు. ఆయుష్మాన్ భ‌వ లాంటి ప‌థ‌కాల‌ను తొలుత విమ‌ర్శించిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత రాష్ట్రంలో అమ‌లు చేస్తున్నారు. కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక‌ల త‌రువాత మాత్ర‌మే బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య దూరం పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. అదంతా డ్రామా అంటూ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ‌లో బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి మాత్ర‌మే ఆ రెండు పార్టీల ఎత్తుగ‌డ అంటూ విమ‌ర్శిస్తున్న వాళ్లు లేక‌పోలేదు.గ‌త ఏడాది మూడుసార్లు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ తొలిసారి నెల రోజుల పాటు అక్క‌డే ఉన్నారు. ఆ త‌రువాత రెండు వారాల పాటు హ‌స్తిన వేదిక‌గా దిష్టి వేశారు. తిరిగి వ‌చ్చిన త‌రువాత మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, ఆయుష్మాన్ భ‌వ ప‌థ‌కానికి జై కొట్టాడు. మూడోసారి వారం రోజులు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ పై ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఊహాగానాలు వ‌చ్చాయి. ఆ త‌రువాత జ‌రిగిన హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత బీజేపీపై కేసీఆర్ భ‌గ్గ‌మంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను అరెస్ట్ చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి రాజ‌కీయాన్ని బీజేపీ, టీఆర్ఎస్ వేడిక్కించాయి. వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లాడు. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో గ‌తంలో కేసీఆర్ స‌హ‌కారం అందించాడు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుస‌రిస్తాడ‌ని తెలుస్తోంది. అందుకోసం ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌తో మంత‌నాలు సాగించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న ముంద‌స్తు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రుగుతోంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ ఎన్నిక‌ల‌తో వెళ్లాల‌ని యోచిస్తున్న‌ట్టు వినికిడి. అందుకోసం కేంద్రం స‌హ‌కారం తీసుకోవ‌డానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లార‌ని కొంద‌రు భావిస్తున్నారు. రాజ్య‌స‌భ‌, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో స‌హ‌కారం కోసం కేసీఆర్ తో ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు సంప్ర‌దింపులు జ‌రిపే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద. తెలుగు రాష్ట్రాల సీఎంల అవ‌స‌రం ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు అవ‌స‌ర ప‌డింది. ఆ క్ర‌మంలో ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు కొన్ని వ్య‌క్తిగత‌ ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్రం ముందు ఉంచే ఛాన్స్ ఉంది. వాటిల్లో కేసీఆర్ వైపు నుంచి ముందుస్తు, ముంచుకొస్తోన్న కేసుల వ్య‌వ‌హారం, మూడు రాజ‌ధానుల అంశం జ‌గ‌న్ వైపు నుంచి ప్ర‌స్తావ‌న కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.