Site icon HashtagU Telugu

Pegasus Issue : హై’టెక్’ ఆయుధం.!

Kcr Jagan Babu

Kcr Jagan Babu

దేశాల మ‌ధ్య జ‌రిగే వార్ అయినా రాజ‌కీయ పార్టీల నడుమ జ‌రిగే రాజ‌కీయ‌ యుద్ధమైనా టెక్నాల‌జీ కీల‌క భూమికి పోషిస్తోంది. డేటా చోరీ, హ్యాకింగ్ వంటి సాంకేతిక అంశాలు రాజ‌కీయ పార్టీల్లో త‌ర‌చూ వినిపిస్తుంటాయి. సైబ‌ర్ దాడుల‌తో ప్ర‌త్య‌ర్థి దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేయ‌డానికి వీలుంది. అదే డేటా చోరీ, సైట్ల హ్యాకింగ్ , ఫోన్ల ట్యాపింగ్‌ తో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి వీలుంది. ఇలాంటి ప‌రిణామం 2016 నుంచి తెలుగు రాష్ట్రాల‌ను వెంటాడుతోంది. ఓటుకు నోట్ కేసు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పెగాసిస్ సాఫ్ట్ వేర్ వ్య‌వ‌హారం ప్రైవేటుగా వినిపించ‌డం మొద‌లైయింది.తెలంగాణ ప్ర‌భుత్వం ఫోన్ల‌ను ట్యాప్ చేయ‌డం ద్వారా ఓటుకు నోట్ కేసు వెనుక ప్ర‌ధాన భూమిక ఫోషించింద‌ని టీడీపీ అనుమానం. అందుకే, ఆనాడు ఉన్న తెలంగాణ నిఘా అధిక‌పతిపై ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌ని తెలంగాణ స‌ర్కార్ పై ఏపీ ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ ఓటుకు నోట్ కేసు ద‌ర్యాప్తు వేగం చేసిన ప్ర‌తిసారీ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాన్ని ఏపీ సీఐడీ హ‌డావుడి చేసేది. ఆ రెండు కేసుల దర్యాప్తు స‌మాంత‌రంగా కేసీఆర్‌, చంద్ర‌బాబు స‌ర్కార్లు ఆనాడు న‌డిపించిన విష‌యం విదిత‌మే. ఢిల్లీ లోని ఒక పెద్ద ఇరువురి మ‌ధ్య స‌ర్దుబాటు చేయ‌డంతో ఆ రెండు కేసులు బుట్ట‌దాఖ‌లు అయ్యాయ‌ని చాలా మంది భావిస్తుంటారు.

2019 పోలింగ్ ముందు డేటా చోరీ వ్య‌వ‌హారం టీడీపీ, వైసీపీ మ‌ధ్య హాట్ టాపిక్ అయింది. ప్ర‌జ‌ల కీల‌క స‌మాచారాన్ని ఒక ప్రైవేటు ఐటీ సంస్థ కు ఆనాటి స‌ర్కార్ ఇచ్చింద‌ని వైసీపీ ఆరోప‌ణ‌. ఆ డేటా ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి టీడీపీ వ్య‌తిరేక ఓట‌ర్ల‌ను వేలాదిగా తొలగించారని లోకేశ్వర్ రెడ్డి ఆనాడు మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దానిపై తెలంగాణ పోలీసులు విచార‌ణ చేసి ఆ ఐటీ సంస్థ కంప్యూట‌ర్ల‌ను సీజ్ చేసిన విష‌యం విదిత‌మే.
”సేవామిత్ర అనే యాప్‌ను ఐటీగ్రిడ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం వివిధ పథకాలలోని లబ్ధిదారుల పేరు, వయసు, ఆధార్‌తో పాటు అనేక వివరాలను ఈ యాప్ ద్వారా సేకరిస్తూ టీడీపీ దుర్వినియోగం చేస్తుంద‌ని ఆనాడు ప్ర‌ధాన వైసీపీ చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దానిపై ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని కేసీఆర్ స‌ర్కార్ వైసీపీకి స‌హ‌కారం అందించింద‌ని అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఒక అన‌ధికార ప‌రిక‌రాన్ని ఉప‌యోగించి హైద‌రాబాద్ లోని చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద ఫోన్ కాల్స్ ను ట్రాప్ చేశార‌ని ఓటుకు నోట్ కేసు స‌మ‌యంలో టీడీపీ చేసిన ఆరోప‌ణ‌. ఆ ప‌రిక‌రం ద్వారా సుమారు 500 మంది ఫోన్ల‌ను రికార్డ్ చేయ‌డాన‌కి అవకాశం ఉంద‌ని ఆనాడు చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌స్తుతం తెర‌మీద‌కు వ‌చ్చిన పెగాసిస్ సాఫ్ట్ వేర్ లాంటి ప‌రిక‌రమే అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ త‌రువాత అక‌స్మాత్తుగా అమ‌రావ‌తికి చంద్ర‌బాబు మ‌కాం మార్చాడు. ఓటుకు నోట్ కేసు తాలూకూ అనుభ‌వం పెగాసిస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసేలా బాబును ఆలోచింప చేసిందని వైసీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. ఆనాడున్న చంద్ర‌బాబు స‌ర్కార్ వైసీపీ కీల‌క నేత‌ల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేసింద‌ని ప‌లుమార్లు అసెంబ్లీలోనూ, బ‌య‌ట ఆరోప‌ణ‌ల‌కు దిగిన విష‌యం విదిత‌మే. అందుకే, హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ నుంచే వైసీపీ కార్య‌క‌లాపాల‌ను అప్ప‌ట్లో న‌డిపారు. కానీ, వైసీపీ ఆరోప‌ణ‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ కొట్ట‌వేసింది. దానిపై ఇప్ప‌టి ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కూడా ఫోన్ ట్యాపింగ్ జ‌ర‌గ‌లేద‌ని క్లీన్ చిట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

హ‌ఠాత్తుగా ఇప్పుడు పెగాసిస్ సాఫ్ట్ వేర్ ను చంద్ర‌బాబు కొనుగోలు చేశాడ‌ని బెంగాల్ సీఎం మ‌మ‌త ఆరోపించ‌డం రాజ‌కీయ దుమారాన్ని రేపింది. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌కు సెటైర్లు జోడిస్తూ ‘ది క‌శ్మీర్ ఫైల్స్’ సినిమాను గుర్తు చేస్తూ ‘బాబు ఫైల్స్’ ఓపెన్ అవుతాయని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేయ‌డం మ‌రింత హీట్ పెంచింది. దానికి ఆజ్యం పోస్తూ టీడీపీ ట్విట్ట‌ర్ హ్యాకింగ్ వ్య‌వ‌హారం తెర మీదకు వ‌చ్చింది. ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఆ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్ చేసి వెల్లడించాడు. అధికార వైసీపీ ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ, NSO గ్రూప్, స్పైవేర్ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను 25 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు నాలుగు ఐదేళ్ల క్రితం ఆఫర్ ఇచ్చిందని మమత చెబుతోంది. అయితే అప్పట్లో బెంగాల్ రాష్ట్ర పోలీసు విభాగం ఆ ఆఫర్ ను నిరాకరించినట్టు మమత వెల్లడించింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ వ్యాఖ్యానించ‌డ‌మే టీడీపీకి త‌ల‌నొప్పిగా మారింది. మమత వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్పందించాడు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ ఆఫర్ వచ్చిందని, కానీ తిర‌స్క‌రించామ‌ని ట్వీట్ చేశాడు. పెగాసిస్ వ్య‌వ‌హారాన్ని మ‌మ‌త తెర‌మీద‌కు తీసుకురావ‌డం వెనుక‌ ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహం ఉంద‌ని టీడీపీ విశ్వసిస్తోంది. క‌ల్తీ మ‌ద్యం మ‌ర‌ణాలు జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఉక్కిబిక్కిరి చేస్తోన్న క్ర‌మంలో ఉద్దేశ పూర్వ‌కంగా పెగాసిస్ ను మ‌మ‌త ద్వారా పీకే తెర‌మీద‌కు తీసుకొచ్చాడ‌ని టీడీపీ భావిస్తోంది. మొత్తం మీద 2019 ఎన్నిక‌ల ముందు డేటా చోరీ వ్య‌వ‌హారం ఇప్పుడు పెగాసిస్, హ్యాకింగ్ అంశాలు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య యుద్ధాన్ని త‌ల‌పించేలా చేస్తున్నాయి. సో..రాబోవు రోజుల్లో క్షేత్ర‌స్థాయి పోరాటం తో పాటు రాజ‌కీయ పార్టీలు సాంకేతిక యుద్ధం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. సామాన్యులూ..జ‌ర జాగ్ర‌త్త‌.!