Mahanadu: నేడు మ‌హానాడు ప్రారంభం.. ప‌సుపుమ‌య‌మైన ఒంగోలు

తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ మ‌హానాడు.. ప్ర‌తిఏటా మూడు రోజుల పాటు ఈ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 09:21 AM IST

తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ మ‌హానాడు.. ప్ర‌తిఏటా మూడు రోజుల పాటు ఈ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. అయితే గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా మ‌హానాడుని వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా మ‌హానాడుని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఈసారి మ‌హానాడుకి ఒంగోలు వేదిక‌యింది. ఒంగోలు స‌మీపంలోని మండ‌వ‌వారి పాలెం వ‌ద్ద 80 ఎక‌రాల్లో మ‌హానాడు కార్య‌క్ర‌మానికి ప్రాంగ‌ణాన్ని సిద్ధం చేశారు. దీనికి ఎన్టీఆర్ ప్రాంగ‌ణంగా పేరు పెట్టారు. ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒంగోలుకు చేరుకున్నారు. గురువారం మంగ‌ళ‌గిరి నుంచి చంద్ర‌బాబు కార్లు, బైక్ ర్యాలీల‌తో ఒంగోలు చేరుకోగా.. అడుగ‌డుగునా టీడీపీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఇటు మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఒంగోలులో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానాలు, మహానాడు నిర్వహణ పై చర్చించారు. మహానాడులో ఎపికి సంబంధించి 12 తీర్మానాలు, తెలంగాణ కు సంబంధించి 3 తీర్మానాలు, అండమాన్ కు సంబంధించి ఒక తీర్మానం ఉంటుంది. వీటితో పాటు రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. మహానాడు ప్రతినిధుల సభ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. తీర్మానాలపై దాదాపు 50 మంది మాట్లాడే అవకాశం ఉంది. ఆయా తీర్మానాలు ప్రజల్లోకి వెళ్లేలా మహానాడు చర్చలు సాగాలని నేతలు అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే వైసిపి తలపెట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ఒక నాటకం అని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది. ఏ వర్గానికి ఏం చేశారని సామాజిక న్యాయం అని యాత్ర చేస్తారని నేతలు ప్రశ్నించారు. వైసిపి కి మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 4 గురు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారని నేతలు అన్నారు. 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు బయట రాష్ట్రాలకు చెందిన వారు కాగా….ముగ్గురు జగన్ తో పాటు కేసుల్లో ఉన్న వారేనని విమర్శించారు. లాబీయింగ్ చేసేవారికి, కేసుల్లో సహ మద్దాయిలకు జగన్ రాజ్యసభ ఇచ్చారని అన్నారు. తెలంగాణలో 12 బిసి కులాలను బిసిల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం ఏరకంగా సమంజసం అన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుపడిన ఆర్ కృష్ణయ్య తప్ప….ఎపిలో రాజ్యసభ ఇవ్వడానికి బిసి నేతలే లేరా అని ప్రశ్నించారు. 9 మంది రాజ్యసభలో ఒక ఎస్సి కానీ,ఒక ఎస్టి కానీ, ఒక మైనారిటీ కానీ లేరని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. ఏవర్గానికి న్యాయం చెయ్యని వైసిపికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత…యాత్ర చేసే హక్కు లేదని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది.

నేడు ఉద‌యం 10గంట‌ల‌కు ప్ర‌తినిధుల న‌మోదుతో మ‌హానాడు ప్రారంభ‌మ‌వుతుంది. ఫొటో ఎగ్జిబిష‌న్‌, త‌ర్వాత ర‌క్త‌దాన శిబిరం ఉంటుంది. అనంత‌రం పార్టీ ప‌తాకావిష్క‌ర‌ణ‌, మా తెలుగు త‌ల్లి గేయాలాప‌న, జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌తో స‌మావేశాలు మొద‌ల‌వుతాయి. అనంత‌రం ఎన్టీఆర్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి, త‌ర్వాత ఇటీవ‌లి కాలంలో మ‌ర‌ణించిన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నివేదిక‌, జ‌మా ఖ‌ర్చుల నివేదిక‌, నియ‌మావ‌ళి స‌వ‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెడతారు. చంద్ర‌బాబు ప్రారంభోప‌న్యాసం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉంటాయి.