Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్

  • Written By:
  • Updated On - January 6, 2024 / 08:39 PM IST

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై తాజాగా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ చర్యలను నియంత పోకడలకు పరాకాష్ఠగా అభివర్ణించారు. జీవో నెం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి తెదేపా పూర్తి మద్దతిస్తుందని చెప్పారు.

ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా స్పందించారు. అంగన్వాడీలపై ‘ఎస్మా’ చట్టాన్ని ప్రయోగించడాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. రాజకీయాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినా.. గెలవటం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది. వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. పలు డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ వర్కర్లు దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు.

సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. దీంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ నే ఎస్మాగా పిలుస్తారు. అయితే ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుంగా ఉండేందుకు గాను 1981లో ఎస్మా చట్టాన్ని రూపొందించారు అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా సమ్మెలోకి దిగితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.