2024 సెమీ ఫైన‌ల్ కు రెడీ, ప‌ట్ట‌భ‌ద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

ఏపీ వ్యాప్తంగా ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించ‌బోతున్నారు. యూత్ ఎటు ఎటువైపు ఉందో తెలుసుకునే ఎన్నిక‌లు ఇవి.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 05:00 PM IST

ఏపీ వ్యాప్తంగా ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించ‌బోతున్నారు. యూత్ ఎటు ఎటువైపు ఉందో తెలుసుకునే ఎన్నిక‌లు ఇవి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, ఉప ఎన్నిక‌ల ఒక ఎత్తు అయితే, జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మ‌రో ఎత్తు. ఆ ఎన్నిక‌లు దాదాపుగా ప్ర‌జ‌ల మూడ్ ను తెలియ‌చేయ‌నున్నాయ‌ని అంచ‌నా వేయ‌డానికి అవ‌కాశం ఉంది. అందుకే వైసీపీ కంటే ముందుగా మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ రాయ‌ల‌సీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయ‌ల‌సీమ స్థానానికి కంచ‌ర్ల శ్రీకాంత్ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టించారు. విశాఖ‌ప‌ట్నం స్థానానికి త్వ‌ర‌లోనే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఇక ప్ర‌కాశం, నెల్లూరు ఎమ్మెల్సీ స్థానికి కంచ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇక‌పై ఏ ఎన్నిక జ‌రిగినా టీడీపీ పోటీ అనివార్య‌మ‌ని చెప్పిన చంద్ర‌బాబు గెలుపే ధ్యేయంగా పోరాటం చేయాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఓట‌ర్ల జాబితాల‌ను ప‌రిశీలించుకుంటూ ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా వైసీపీ దొంగ ఓట్ల‌ను చేరుస్తార‌ని టీడీపీ క్యాడ‌ర్ ను అప్ర‌మ‌త్తం చేశారు.