TDP-YCP : గోదావరిపై టీడీపీ, వైసీపీ ఆపరేషన్ షురూ..!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి.

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 12:47 PM IST

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్, మండపేట, నియోజకవర్గాల్లో ఫ్యానుగాలికి తట్టుకొని టీడీపీ నిలబడింది. మిగతా చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఓడిన సీట్లపై దృష్టి సారించిన సీఎం జగన్

రాష్ట్రంలో ఓడిపోయిన 24 అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్ పెంచారు. దీనిలో ముందు వరుసలలో రాజమండ్రి అర్భన్, రూరల్ సీట్లు ఉన్నాయి. గతంలో ఎమెల్యేగా పోటీ చేసిన నేతలతో మరికొన్ని రోజుల్లో భేటీ కానున్నారు. గత కొంత కాలంగా రాజమండ్రి అర్భన్ ప్రాంతానికి సరైన నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ముగ్గురు సమన్వయకర్తలను మార్చింది వైసీపీ. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్భన్‌లో వైసీపీ జెండాను ఎగురవేయడం కష్టమని కార్యకర్తలు బాహాటంగా చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పరిధిలోని రెండు స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. బలమైన నాయకుడి కోసం వేట మొదలు పెట్టింది.

మండపేటలో మంటలు పెడుతున్న వేగుళ్ల

ఇక మండపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వానిక కొరకురాని కొయ్యగా మారారు. ఏ చిన్న సమస్యనైనా భూతద్దంలో చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ స్థానాన్ని తోట త్రిమూర్తులు సంపాదించారు. ఆయన మండపేట వైసీపీ నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన నియోజకవర్గంలోని పర్యటిస్తున్నారు. టిడ్కో ఇళ్లు, రహదారుల విషయంలో ఎమ్మెల్సీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పేదలకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. దీంతో ప్రభుత్వం ఫలానా తేదీలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ప్రకటించింది. అలాగే రహదారుల అధ్వాన్న పరిస్థితులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సవాళ్లు విసిరారు.దీంతో వైసీపీ నేతలు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

నేతలకు చంద్రబాబు క్లాస్

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ బలోపేతం గురించి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నేతలు ఎప్పటికిప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా నేతలు ప్రచారాలు చేసుకొవాలని సూచించారు. అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను త్యాగాలు చేసేందుకు సిద్ధమవ్వాలనే సంకేతాలను అధినేత పంపినట్లు సమాచారం.