AP Politics: జగన్ పై చెల్లెలు పోటీ? టీడీపీ టార్గెట్ ఫిక్స్..!!

పులివెందుల కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం వేగంగా పావులు కదుపుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 09:56 AM IST

పులివెందుల కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే సరే..లేదంటే, ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అటు జనసేనతో దాదాపు పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కు ప్రతీ విషయంలోనూ చంద్రబాబు మద్దతు ప్రకటిస్తున్నారు.

బీజేపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ పైన ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి చంద్రబాబు సిద్దంగా లేరు.వైఎస్ వివేకా కుమార్తె టీడీపీ నుంచి పోటీ అందులో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తాజాగా కర్నూలులో స్వయంగా వెల్లడించారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలుద్దామంటూ చంద్రబాబు స్వయంగా పిలుపు నిచ్చారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ వివేకా కుమార్తె సునీతను టీడీపీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అందులో భాగంగా.. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కొద్ది రోజుల క్రితం స్వయంగా చంద్రబాబు – సునీతతో భేటీ అయ్యారని తెలుస్తోంది. టీడీపీ నుంచి పులవెందుల ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని..అంగీకరించాలని సూచించారు. సునీత ఆ సమయంలో ఈ ప్రతిపాదన పైన సుముఖంగా లేకపోయినా..ఆ తరువాత జరిగిన చర్చల్లో భాగంగా ఆలోచనలో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు.

పులివెందుల నుంచి సీఎం జగన్ పోటీ చేయటం ఖాయం. దీంతో, సీఎం జగన్ పైన ఆయన సోదరి సునీత పోటీకి దిగుతారా అనేది ఇప్పటికీ సందేహమే. కానీ, టీడీపీ నేతలు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.వైఎస్సార్ – జగన్ కు పులివెందుల లో ఎంత క్రేజ్ ఉందో.. వైఎస్ వివేకా పైనా అంత సానుభూతి ఉందనేది టీడీపీ నేతల విశ్లేషణ. సునీత టీడీపీ నుంచి పోటీ చేస్తే..టీడీపీకి కొత్త అస్త్రం దొరికినట్లేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అసెంబ్లీకి అంగీకరించకుంటే..కడప ఎంపీగా పోటీ చేసేందుకు సునీత ను ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాశ్ పైన పోటీ చేయాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. సునీతను ఎంపీగా బరిలోకి దించితే పులివెందుల నుంచి బీ టెక్ రవి పోటీ చేస్తారని.. చివరి నిమిషంలో సునీత అసెంబ్లీకి అంగీకరిస్తే బీటెక్ రవికి ప్రత్యామ్నాయ సీటు వైపు ఆలోచన ఉంటుందని సమాచారం.

పులివెందుల లేదా కడప ఎంపీగా ఛాన్స్

సునీత స్వయంగా బరిలోకి దిగుతారా..లేక, తన కుటుంబం నుంచి మరొకరికి టీడీపీ నుంచి పోటీ చేసేలా ప్రతిపాదన చేస్తారా అనేది మాత్రమే తేలాల్సి ఉందని చెబుతున్నారు.గతంలోనే సునీతకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు సైతం నిర్దారించారు. కానీ, సునీత అటువంటి నిర్ణయం తీసుకుంటారని తాము భావించటం లేదని చెప్పుకొచ్చారు. అయితే, వివేకా హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీతతో.. టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేత సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు సునీత ఫైనల్ నిర్ణయం ఏంటనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది.