Site icon HashtagU Telugu

TDP Party : `ఐ టీడీపీ`కి జ్ఞానోప‌దేశం

Atchennaidu Jr Ntr

Atchennaidu Jr Ntr

జూనియ‌ర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయ‌డం వ‌ల‌న క‌లిగే న‌ష్టాన్ని టీడీపీ గ్ర‌హించింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి స‌మాయ‌త్తం అయింది. సినిమా హీరోలు, అభిమానుల వివాదాల్లోకి వెళ్లొద్ద‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేసింది. ఐప్యాక్‌, బ్లూ మీడియా ట్రాప్ లో ప‌డొద్ద‌ని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు హిత‌బోధ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో టీడీపీలోని ఒక గ్రూప్ జూనియర్ ను టార్గెట్ చేసింది. ఆ క్ర‌మంలో టీడీపీ గ్రూపుల్లో జూనియ‌ర్ వ‌ర్సెస్ టీడీపీ అన్నట్టు వార్ న‌డిచిని సంద‌ర్భాలు అనేకం. తాజాగా యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరుకు బ‌దులుగా వైఎస్సార్ పేరు పెర‌ట్ట‌డాన్ని టీడీపీ వ్య‌తిరేకించింది. తొలి నాలుగు రోజులు హ‌డావుడి చేసింది. ఆ స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై పార్టీలోని ఒక గ్రూప్ లేవ‌నెత్తింది. ఆయ‌న మీద వ్య‌తిరేకంగా వార్ చేసింది. ప్ర‌తిగా జూనియ‌ర్ అభిమానులు రివ‌ర్స్ అయ్యారు. దీంతో యూన‌వ‌ర్సిటీ పేరు మార్పు ఎపిసోడ్ టీడీపీ వ‌ర్సెస్ జూనియ‌ర్ మ‌ధ్య గ్యాప్ ను హైలెట్ చేసింది.

అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై వ్య‌క్తిత్వ హ‌న‌నం జ‌రిగింది. ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేల తీరుకు నిర‌స‌న‌గా చంద్ర‌బాబు విల‌పిస్తూ శాశ్వ‌తంగా అసెంబ్లీని బ‌హిష్క‌రించారు. ఆ త‌రువాత నంద‌మూరి కుటుంబం మీడియా ముందుకు వ‌చ్చింది. అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రికి జ‌రిగిన అవ‌మానం మీద ఆ కుటుంబ స‌భ్యులు సంయుక్తంగా ఒకే ఫ్రేమ్ లో స్పందించారు. ఆ త‌రువాత మేన‌త్త‌కు జ‌రిగిన అవ‌మానంపై ఒక వీడియోను జూనియ‌ర్ విడుద‌ల చేశారు. ఆ వీడియో టీడీపీలోని లోకేష్ గ్రూప్ కు న‌చ్చ‌లేదు. అంతేకాదు, బుద్ధా వెంక‌న్న‌, వ‌ర్ల రామ‌య్య త‌దిత‌రులు మీడియా ముందుకొచ్చారు. జూనియ‌ర్ స్పందించిన తీరు న‌చ్చ‌లేద‌ని బాహాటంగా చెప్పారు. అప్పుడు కూడా జూనియ‌ర్ వ‌ర్సెస్ టీడీపీ వార్ సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌డిచింది.

వాస్త‌వంగా టీడీపీలోని లోకేష్ గ్రూప్, జూనియ‌ర్ అభిమానుల మ‌ధ్య గ్యాప్ ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని ప్ర‌త్య‌ర్థి పార్టీలు వీలున్న‌ప్పుడ‌ల్లా గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తోంది. టీడీపీ గ్రూపుల్లోకి ఐ ప్యాక్ వ్య‌క్తులు కొంద‌రు చొర‌బడుతున్నారు. వాళ్ల‌తో పాటు వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా గ్రూపుల్లోకి జూనియ‌ర్ అభిమానుల్లా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే జూనియ‌ర్ అభిమానుల గ్రూపుల్లోకి లోకేష్ టీమ్ రూపంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నెటిజ‌న్లు చొర‌బ‌డుతున్నారు. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ జూనియ‌ర్ వ‌ర్సెస్ టీడీపీలోని లోకేష్ గ్రూప్ అన్న‌ట్టు యుద్ధం క్రియేట్ అవుతోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతోన్న న‌ష్టాన్ని గ‌మ‌నించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు వైసీపీ, ఐ ప్యాక్ మీద చ‌ర్య‌ల మీద క‌న్నేశారు. ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ ప‌డొద్ద‌ని ఆయ‌న క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, హీరోలు, వారి అభిమానుల వివాదాల్లోకి త‌ల‌దూర్చొద్ద‌ని హిత‌బోధ చేయ‌డం గ‌మ‌నార్హం. ఐప్యాక్, బ్లూ మీడియా వలలో చిక్కుకోవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేయ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది.

అన్ని మతాల వారు, కులాల వారు, ప్రాంతాల వారు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు, నటుల అభిమానులు కూడా టీడీపీలో ఉంటారని వెల్లడించారు. ఒక పార్టీగా మన పోరాటం ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అరాచకాలపై మాత్ర‌మే ఉండాల‌ని అచ్చెన్నాయుడు సూచించారు. దృష్టంతా ఆ లక్ష్యంపైనే ఉండాలి తప్ప, హీరోల గురించి, వారి అభిమానుల గురించి వెటకారం, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడడం కానీ, పోస్టులు చేయడం కానీ చేయవద్దని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. ప్రత్యర్థి పార్టీల‌కు లాభం చేకూర్చకుండా సుశిక్షితులైన సైనికుల్లా పోరాడదామని పిలుపునిచ్చారు. పార్టీలోని అందరి అభిప్రాయాలను గౌరవిద్దామని పేర్కొంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రిగిన న‌ష్టం పునావృతం కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డార‌న్న‌మాట‌.