Site icon HashtagU Telugu

Chandrababu : చంద్ర‌బాబు `విజ‌న్‌ 2050` డాక్యుమెంట‌రీ!

Chandrababu Naidu Iday

Chandrababu Naidu Iday

స్వాతంత్య్ర‌ దినోత్స‌వ వేళ తెలుగుదేశం పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబునాయుడు తెలుగు రాష్ట్రాల‌కు చేసిన మేలును పుస్త‌క రూపంలోకి తీసుకురానుంది. అంతేకాదు, అదే మ్యాట‌ర్ ను గ్రాఫిక్స్, ఒరిజిన‌ల్ వీడియోల‌తో స్కిట్ లు మాదిరిగా రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు చేసిన సేవ‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రాచుర్యంలోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును కాక‌పోవ‌డం వ‌ల‌న ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపాల‌ని స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆ స‌న్నాహాల్లో కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది.

సుమారు 10ఏళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రానికి చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న విజ‌న్ 2020ని రూపొందించారు. ఎన్టీఆర్ ప్లేస్ లో సీఎంగా చంద్ర‌బాబునాయుడు 1995లో కూర్చున్నారు. ఆనాటి నుంచి 1999 వ‌ర‌కు పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ కుదురుకోవ‌డానికి టైం ప‌ట్టింది. తిరిగి 1999లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీకరించిన త‌రువాత విజ‌న్ 2020 దిశ‌గా రాష్ట్రాన్ని ప‌రుగులు పెట్టించారు. హైద‌రాబాద్ ను బంగారు పండించే న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ఆనాడే పునాదులు వేశారు. వాటి ఫ‌లాల‌ను విడిపోయిన తెలంగాణ రాష్ట్రం అనుభ‌విస్తోంది. అందుకే, మంత్రి కేటీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబునాయుడు విజన్ 2020ని కొనియాడారు. ఆయ‌న వేసిన పునాదుల‌పై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ స‌ర్కార్ ముందుకు తీసుకెళుతోంది.

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014లో చంద్ర‌బాబు మొద‌టి సీఎంగా ఎన్నిక‌య్యారు. తొలి రెండేళ్లు ఆయ‌న కొంత త‌డ‌బాటుగా ప‌రిపాల‌న సాగించిన‌ప్ప‌టికీ 2016 త‌రువాత ఏపీ పాల‌న మీద ప‌ట్టు బిగించారు. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం 2050 విజ‌న్ ను రూపొందించారు. ఆయ‌న విజ‌న్ తూచా త‌ప్ప‌కుండా అమ‌లు జ‌రిగితే, 2029కు. దేశంలోనే నెంబ‌ర్ 1గానూ 2050 నాటికి ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1 రాష్ట్రంగా ఏపీ అవ‌త‌రించేది. కానీ, ఆయ‌న విజ‌న్ కు 2019 ఎన్నిక‌ల‌తో బ్రేక్ ప‌డింది. పైగా ఆ ఎన్నిక‌ల్లో గెలిచి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న స్టైల్ లో ప‌రిపాల‌న సాగిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు త‌యారు చేసిన 2050 విజ‌న్ శాశ్వ‌తంగా మూల‌న‌ప‌డింది. ఫ‌లితంగా ఏపీ భారీగా న‌ష్ట‌పోయింది. స‌రిగ్గా ఇదే అంశాన్ని గ్రాఫిక్స్, వీడియోలు, ఫోటోల‌తో టీడీపీ ఆవిష్క‌రించ‌బోతుంది. జ‌రిగిన న‌ష్టాన్ని డాక్యుమెంట‌రీ, స్కిట్ ల రూపంలో ఏపీలోని ప్ర‌తి గ్రామంలోనూ ప్ర‌ద‌ర్శించ‌డానికి టీడీపీ సిద్ధం అయింది.

త్వ‌ర‌లో చంద్ర‌బాబు చేయ‌బోయే బ‌స్సు యాత్ర సంద‌ర్భంగానూ, లోకేష్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర రూట్ లోనూ చంద్ర‌బాబు విజ‌న్ 2050 ని ప్ర‌ద‌ర్శించాల‌ని యోచిస్త‌న్నారు. అంతేకాదు, విజ‌న్ లేకుండా 2019 నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న పాల‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని డిజిట‌ల్ తెర‌ల‌పై టీడీపీ ప్ర‌ద‌ర్శించ‌డానికి సిద్ధం అయింది. ఈసారి ఎన్నిక‌ల్లో కొత్త త‌ర‌హా ప్ర‌చారానికి టెక్నాల‌జీని పెద్ద ఎత్తున వాడుకోవ‌డానికి ప్లాన్ చేస్తోంది. ఏ మేర‌కు ఇలాంటి కొత్త త‌ర‌హా ప్ర‌చారం 2024 ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తుందో చూడాలి.