TDP Mahanadu : వ‌లంటీర్ల‌పై మ‌హానాడులో ఎల్లో సోల్జ‌ర్స్!

వైసీపీ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు కౌంట‌ర్ గా మ‌హానాడు వేదిక‌గా టీడీపీ గ్రామ సైన్యాన్ని ప్ర‌క‌టించ‌నుంది.

  • Written By:
  • Updated On - May 24, 2022 / 04:22 PM IST

వైసీపీ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు కౌంట‌ర్ గా మ‌హానాడు వేదిక‌గా టీడీపీ గ్రామ సైన్యాన్ని ప్ర‌క‌టించ‌నుంది. ఆ మేర‌కు ఇప్పటికే క‌స‌ర‌త్తు పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఒక వ‌లంటీర్ ను జ‌గ‌న్ స‌ర్కార్ నియ‌మించింది. రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ కార‌ణంగా క్షేత్ర స్థాయి స‌మాచారం వైసీపీకి చేరుతుంది. రాబోవు ఎన్నిక‌ల్లో వ‌లంటీర్లపై ఆ పార్టీ ఆధార‌ప‌డింది. పైగా అధికారికంగా ఏర్ప‌డిన వ్య‌వ‌స్థ‌గా వ‌లంటీర్లు ఉన్నారు. నెల‌కు జీతం ప్ర‌భుత్వం నుంచి వెళుతోంది. వాళ్ల‌కు ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్ల‌కు అనుసంధానంగా ఉంటాయి. ఎలాంటి స‌మాచారం కావాల‌న్నా, అధికారికంగా వాళ్ల ద‌గ్గ‌ర ఉంటుంది. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల పూర్తి స‌మాచారం వ‌లంటీర్ల ఫోన్ల‌లో ల‌భిస్తోంది. అందుకే, బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌గా వైసీపీకి వ‌లంటీర్లు ఉన్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల్లో వ‌లంటీర్ల ప‌నితీరును టీడీపీ గ‌మ‌నించింది. ప్ర‌త్యేకించి తిరుప‌తి లోక్ స‌భ‌, కుప్పం మున్సిపాలిటీ, బ‌ద్వేల్ ఉప ఎన్నిక..ఇలా ప‌లు చోట్ల వ‌లంటీర్లు వైసీపీకి అండ‌గా నిలిచారు. రాబోవు ఎన్నిక‌ల్లోనూ వాళ్ల ద్వారానే క‌థ‌ను న‌డిపేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వైసీపీ వేసింది. వ్య‌వ‌స్థీకృతం అయిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను అడ్డుకోక‌పోతే,టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్టం. అందుకే, ఆ వ్య‌వ‌స్థ‌కు చెక్ పెట్టేలా చాకుల్లాంటి సైనికుల‌ను స‌న్న‌ద్ధం చేస్తోంది. మహానాడు వేదిక‌గా 28వ తేదీన టీడీపీ గ్రామం సైన్యాన్ని తెర‌మీద‌కు తీసుకురానుంది.

ప్ర‌తి వంద కుటుంబాల‌కు ఒక సైనికుడు ఉండేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి అత‌నికి ప్ర‌తి నెలా జీతం వెళుతుంది. స్మార్ట్ ఫోన్ ను కూడా టీడీపీ అధిష్టానం స‌మ‌కూర్చుతుంది. జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు భిన్నంగా ఈ వ్య‌వ‌స్థ‌ను రూపొందిస్తున్నారు. ఎంపిక విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. క‌నీసం గ్రాడ్యుయేష‌న్ చేసిన ఉండేలా జాగ్ర‌త్త తీసుకుంటున్నారు. అంతేకాదు, స్కూల్‌, కాలేజి స్థాయిల్లో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న నేప‌థ్యం ఉండాలి. వ‌య‌స్సు 30 ఏళ్ల‌కు లోపు ఉండేలా ప్రాథ‌మిక నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ ఆప‌రేష‌న్ చేయ‌గ‌ల నైపుణ్యం ఉండాలి. సామాజిక అంశాల‌పై అవ‌గాహ‌న‌తో పాటు టీడీపీ కుటుంబ నేప‌థ్యం ఖ‌చ్చితంగా ఉండాల‌నే నిబంధ‌న పెట్టార‌ని తెలుస్తోంది. పార్టీలు మారిన చరిత్ర ఉంటే అన‌ర్హులుగా గుర్తిస్తారు. ఇలా, ప‌లు విధాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పెట్టుకుని టీడీపీ గ్రామ సేవ‌కుల‌ను టీడీపీ ఎంపిక చేస్తుంది. ఆ వ్య‌వ‌స్థ‌కు ఎలాంటి పేరు పెట్టాలి? అనే దానిపై ఆలోచ‌న‌ చేస్తోంది.

మొత్తం మీద గ్రామ‌, వార్డు స‌చివాల‌యం వ‌లంటీర్ల‌కు స‌మాంత‌రంగా టీడీపీ సైన్యం రంగంలోకి దిగ‌నుంది. మెరుగైన సేవ‌లు అందించ‌డంతో పాటు అన్యాయంపై వ్య‌వ‌స్థీకృత పోరాటం చేయ‌డం వాళ్ల ల‌క్ష్యంగా నిర్థారించారు. ప్ర‌తి వంద‌ల కుటుంబాల‌కు ఒక ఎల్లో సోల్జ‌ర్ ఇక గ్రామ‌, వార్డు కు రాబోతున్నాడ‌న్న‌మాట‌. ఆ వ్య‌వ‌స్థ పూర్తి స్థాయి నిర్మాణం ఎలా ఉంటుందో ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో జ‌రిగే మ‌హానాడు వేదిక‌గా టీడీపీ ప్ర‌క‌టించ‌నుంది.