Gannavaram: ఇంట్ర‌స్టింగ్‌గా మారిన గన్నవరం పాలిటిక్స్.. వంశీని ఓడించేదుకు టీడీపీ వ్యూహం..?

  • Written By:
  • Updated On - March 2, 2022 / 10:42 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌న్న‌వ‌రం పాలిటిక్స్ ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇంట్ర‌స్టింగ్ టాపిక్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2014,2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుగా ఓడించిన వైసీపీ అధికారం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, తెలుగుదేశంపార్టీకి, అధినేత చంద్ర‌బాబుకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఏకంగా అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెల్పుతూ టీడీపీకి ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చారు వంశీ.

ఇక అప్పటి నుంచి అవ‌వాశం దొరికినప్పుడల్లా చంద్ర‌బాబు అండ్ టీడీపీ బ్యాచ్ పై చాకిరేవు పెడుతూ, తెలుగుదేశం పార్టీలో ఉన్న లోపాల పై మాట‌ల తూటాలు పేల్చుతూ, రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ‌లేపుతూ వ‌స్తున్నారు వంశీ. దీంతో ఎప్ప‌టి నుంచో టీడీపీ అడ్డాగా ఉన్న గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అక్క‌డ టీడీపీ డిఫెన్స్‌లో ప‌డింది. చంద్ర‌బాబుకు వంశీ హ్యాండ్ ఇచ్చిన త‌ర్వాత, గ‌న్న‌వ‌రంలో టీడీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన నాయ‌కుడు దొర‌క‌లేదు. అక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్నా, ఆ క్యాడ‌ర్‌ను న‌డిపించేందుకు స‌రైన నాయ‌కుడు లేక‌పోవ‌డంతో, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో నిర్లిప్త‌త నెల‌కొంది.

వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌కటించిన త‌ర్వాత అయితే గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా టీడీపీ అధిష్టానం నియ‌మించింది. బిసి సామాజిక వర్గానికి చెందిన నేత అయిన అర్జునుడుకి వల్లభనేని వంశీని తట్టుకునే శక్తి గానీ, చరిష్మా గానీ లేదని, గ‌న్న‌వ‌రం నియోజక వర్గంలో టాక్ వినిపిస్తుంది. దీంతో పూర్తిగా డైల‌మాలో ప‌డిన చంద్ర‌బాబు, అక్క‌డ‌ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ వంశీని ఎదుర్కొనేందుకు, సామాజికంగా, ఆర్ధికంగా అన్ని విధాలుగా స‌మ‌ర్ధుడైన‌, దీటైన అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం వెదుకుతుంద‌ని స‌మాచారం.

ఈ నేప‌ధ్యంలో ఇప్ప‌టికే గ‌న్న‌వ‌రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి బ‌రిలోకి దిగేది ఎవరనే కోణంలో పలువురి నేతలు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొద్దిరోజులుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంశీపై గ‌ద్దె రామ్మోహ‌న్ పోటీ చేస్తారని టీడీపీ శ్రేణుల్లో చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పకపోయినా, గద్దె రామ్మోహన్ పోటీ చేస్తే, అక్క‌డ టీడీపీ గెలుచే అవకాశాలు ఎక్కువని, టీడీపీ త‌మ్ముళ్ళు భావిస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని అధినేత చంద్ర‌బాబుకు కూడా వివ‌రించ‌ర‌ట‌. అయితే విజ‌య‌వాడ తూర్పునియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న గ‌ద్దె రామ్మోహ‌న్ ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి వెళ్తారా అనేది సందేహంగా ఉంది. ఈ క్ర‌మంలో గ‌ద్దె రామ్మోహ‌న్ గ‌న్న‌వ‌రం నుండి పోటీ చేసేందుకు విముఖ‌త చూపితే.. అక్క‌డ అన్ని విధాలా బ‌లంగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ఓడించేందుకు టీడీపీ ఎలాంటి వ్యూహం ర‌చిస్తుంద‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆశ‌క్తిగా మారింది.