Site icon HashtagU Telugu

TDP : “గిరిజన ద్రోహి జగన్ రెడ్డి “పేరుతో కరపత్రం విడుదల చేసిన టీడీపీ

TDP

TDP

సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాలనలో గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవడమే కాకుండా వారికి రక్షణ కూడా కరువైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాలపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. అందులో తెదేపా హయంలో జరిగిన గిరిజన సంక్షేమం, జగన్ రెడ్డి పాలనలో జరిగిన గిరిజన ద్రోహంతో పాటు ఇటీవల కేంద్ర నేరగణాంక సంస్థ విడుదల చేసిన లెక్కలను కరపత్రంలో ముద్రించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి అన్న లక్ష్యంతో పనిచేశామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే ఎస్టీలకు 35%, మహిళా పారిశ్రామిక వేత్తలకు 45% రాయితీ కల్పించామ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇళ్ల నిర్మాణం కోసం గిరిజనులకు రూ.50వేల నుండి రూ.లక్ష వరకు అధనపు సహాయం అందించామ‌ని.. గిరిజన గ్రామ పంచాయతీల్లో సమాచార సదుపాయాలను మెరుగుపర్చడానికి రూ.90 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో గిరినెట్ పథకం ద్వారా 184 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. 3.45 లక్షల మంది గర్భిణులకు, 7.40 లక్షల మంది బాలింతలకు గిరి గోరుముద్ద, 14.90 లక్షల మంది పిల్లలకు బాలామృతం 104 ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేస్తే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటిని పూర్తిగా నిలిపివేశారని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2023 మధ్యకాలంలో గిరిజనులపై 1725 దాడులు, 63 మంది హత్యలకు,148 మంది గిరిజన మహిళలు అత్యాచారాలకు గురయ్యారని టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం.ధారు నాయక్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి పాలనలో గిరిజనులపై అమానుషంగా దాడులు పెరిగిపోయాయని.. జగన్ పాలనలో గిరిజనులపై జరిగినన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు ఎన్నడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులపై రోజుకో దాడి నిత్యకృత్యమైందని అన్నారు.

Also Read:  Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు