Site icon HashtagU Telugu

AP Politics : అలా.. కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఔట్‌!

Sunitha Radha Babu

Sunitha Radha Babu

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద కంటే టీడీపీ రెబ‌ల్ వ‌ల్ల‌భ‌నేని వంశీ, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని మీద చంద్ర‌న్న సైన్యం ర‌గిలిపోతోంది. వాళ్లిద్ద‌ర్నీ ఈసారి ఎన్నిక‌ల్లో ఓడించాల‌ని క‌సిగా ఉంది. అందుకోసం వేసిన స్కెచ్ ను సోషల్ మీడియాలోని వైర‌ల్ చేస్తోంది. మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌ను గ‌న్న‌వ‌రం టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దింప‌డం, గుడివాడ నుంచి వంగ‌వీటి రాధాను పోటీ నిల‌ప‌డం ఆ పోస్ట్ లోని సారాంశంగా ఉంది.

టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని ఇద్ద‌రూ జూనియ‌ర్ ఎన్టీఆర్ వీరాభిమానులు. అయితే, ప‌రిటాల ర‌వి, హ‌రికృష్ణ బ‌తికున్న రోజుల్లో వాళ్ల పేరు చెప్పుకుంటూ చాలా కాలం వ‌ల్ల‌భ‌నేని వంశీ బ‌తికారు. వాళ్ల అనుచ‌రునిగా ముద్ర‌వేసుకున్నారు. అప్ప‌ట్లో కృష్ణా జిల్లాకు ర‌వి, హ‌రికృష్ణ‌ల‌కు అతిథ్యం ఇవ్వ‌డం ద్వారా వ్యూహాత్మ‌కంగా వంశీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గ‌లిగారు. పరిటాల ర‌వి ప్ర‌ధాన అనుచ‌రునిగా వంశీ ప‌లు సంద‌ర్భాల్లో కృష్ణా జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద మ‌నిషిగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఆయ‌న‌కు అండ‌గా నిలిచింది. ఇప్పుడు ఆయ‌న టీడీపీ రెబ‌ల్ గా మార‌డంతో పాటు రాజ‌కీయ బిక్ష‌వేసిన చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను బ‌జారుకీడ్చారు. ప్ర‌తిగా ఆయ‌న్ను రాజ‌కీయ తెర‌మీద లేకుండా చేయ‌డానికి ప‌రిటాల సునీత‌ను గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేయించాల‌ని చంద్ర‌న్న సైన్యం డిమాండ్‌. ముల్లును ముల్లుతో తీసిన‌ట్టు ప‌రిటాల పేరుతో బతుకుతోన్న వంశీని అదే ప‌రిటాల పేరుతో రాజ‌కీయ స‌మాధి చేయాల‌ని క‌సిగా ఉంది.

స్వ‌ర్గీయ హ‌రికృష్ణ‌కు న‌మ్మిన‌బంటుగా ఉంటూ జూనియ‌ర్ కు ప్రాణ‌స్నేహితునిగా కొడాలి నాని ఎదిగారు. ఆ త‌రువాత హ‌రికృష్ణ‌ కోటా నుంచి గుడివాడ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టికే వంగ‌వీటి రాధా, నాని ఇద్ద‌రూ ఫ్రెండ్స్. రాజ‌కీయాల‌కు అతీతంగా వాళ్ల మ‌ధ్య స్నేహం ఉండేది. దీంతో క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గం ఏక‌మై గుడివాడ నుంచి నానికి మ‌ద్ధ‌తుగా నిల‌వ‌డం గ‌మ‌నించొచ్చు. అటు జూనియ‌ర్ మార్క్ ఇటు వంగ‌వీటి రాధా మ‌ద్ధ‌తు ఆయ‌న గెలుపుకు బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని స్థానికంగా ఎవ‌ర్నీ అడిగిన‌ప్ప‌టికీ చెబుతారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి గుడివాడ మీద టీడీపీ ప‌ట్టు ఉంది. ఎందుకంటే, ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌తికున్నంత వ‌ర‌కు గెలుస్తూ వ‌చ్చారు. ఆ త‌రువాత నంద‌మూరి వార‌స‌త్వంగా గుడివాడ ఉండిపోయింది. ఆ వార‌స‌త్వం మ‌ద్ధ‌తు కార‌ణంగా నాని ఎమ్మెల్యేగా అక్క‌డ వ‌ర‌స‌గా గెలిచారు.

వాస్త‌వంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. సుమారు 30వేల ఓట్ల వ‌రకు కాపు సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు ఉంది. స్నేహం కార‌ణంగా వంగ‌వీటి మ‌ద్ధ‌తుదారులు చాలా వ‌ర‌కు నాని వెంట ఉంటున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబీకుల‌పై వ్య‌క్తిగ‌తంగా రాజ‌కీయ దాడి నాని చేస్తున్నారు. దీంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం చాలా వ‌ర‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు వంగ‌వీటి రాధా గుడివాడ నుంచి పోటీ చేస్తే కాపుతో పాటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు కూడా ఉండే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా బ‌ద్ధ‌శ‌త్రువుగా మారిన కొడాలి నాని ఓట‌మిని చూడొచ్చ‌ని చంద్ర‌న్న సైన్యం లాజిక్. ఎలాగైనా వ‌ల్ల‌భ‌నేని, కొడాలిని ఓడించాల‌ని క‌సిగా ఉన్న చంద్ర‌బాబు సైన్యం వైర‌ల్ చేస్తోన్న పోస్టుల వెనుక ఇంత క‌థ ఉంద‌న్న‌మాట‌.

కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ పదవిని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి అప్ప‌గించారు. కానీ, అక్క‌డి గ్రూపు విభేదాలు కార‌ణంగా గ‌ద్దె అనూరాధ‌ను ఆక్క‌డి నుంచి ఫైన‌ల్ చేయాల‌ని టీడీపీ భావిస్తుంద‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు సైన్యం మాత్రం పరిటాల సునీతను గ‌న్న‌వ‌రం నుంచి రంగంలోకి దింపాల‌ని సూచిస్తోంది. ఇక గుడివాడ‌లో ముడు పువ్వులా ఆరు కాయ‌లు మాదిరిగా టీడీపీ గ్రూపులు ఉన్నాయి. అక్క‌డ మినీ మ‌హానాడు పెట్ట‌డానికి కూడా త‌ల‌కాయ‌లు కూడ‌డంలేదు. దీంతో వంగ‌వీటి రాధాను అక్క‌డ నుంచి బ‌రిలోకి దింప‌డ‌మే మార్గ‌మ‌ని కొడాలిపై క‌సిగా ఉన్న చంద్ర‌న్న సైన్యం కోరుకుంటోంది. కానీ, బాబు ఆ ధైర్యం చేస్తారా? అనేది చూడాలి.