AP Politics: దొర‌క‌ని దొర‌లు! `సంక‌ల్ప` స్కామ్ 1100 కోట్లు!!

మ‌రో సారి గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ద్వ‌యం చీక‌టి వ్యాపారం బ‌య‌ట‌ప‌డింది. ఆ మ‌ధ్య గుడివాడ కేంద్రంగా నిర్వ‌హించిన క్యాసినో వ్య‌వ‌హారానికి ఇద్ద‌రి స్నేహాన్ని ముడిపెడుతూ వ్యూహాత్మ‌కంగా తెర‌దింపారు.

  • Written By:
  • Updated On - November 26, 2022 / 12:57 PM IST

మ‌రో సారి గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ద్వ‌యం చీక‌టి వ్యాపారం బ‌య‌ట‌ప‌డింది. ఆ మ‌ధ్య గుడివాడ కేంద్రంగా నిర్వ‌హించిన క్యాసినో వ్య‌వ‌హారానికి ఇద్ద‌రి స్నేహాన్ని ముడిపెడుతూ వ్యూహాత్మ‌కంగా తెర‌దింపారు. అయితే, చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం క్యాసినో గుట్టు ఈడీ ద‌గ్గ‌ర ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తాజాగా సంక‌ల్ప‌సిద్ధి అనే బోగ‌స్ కంపెనీ ద్వారా వాళ్లు చేసిన రూ. 1100 కోట్ల స్కామ్ ను టీడీపీ బ‌య‌ట‌కు తీసింది. వాళ్లిద్ద‌రికీ ఆ కంపెనీకి ఉన్న ఆధారాల‌ను మీడియా ముఖంగా వెల్ల‌డించింది. విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏపీ సీఐడీకి సవాల్ విసిరింది.

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం కేంద్రంగా ఎనిమిది నెల‌ల క్రితం వెలిసింది. దాని సూత్ర‌ధారుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ బినామీ ఓలుప‌ల్లి రంగా అంటూ టీడీపీ చెబుతోంది. ఆ కంపెనీ తెర మీద గుత్తా వేణుగోపాల్ కృష్ణ‌, గుత్తా కిర‌ణ్ ల‌ను పెట్టి ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి ఇద్ద‌రూ క‌లిసి `సంక‌ల్ప‌సిద్ధి`ని సృష్టించార‌ని ప్ర‌ధానంగా వినిపిస్తోన్న ఆరోప‌ణ‌. గుడివాడ‌, గ‌న్న‌వ‌రం కేంద్రంగా సంక‌ల్ప‌సిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభ‌మై రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలను విస్త‌రించింది. కేవలం రూ.లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్ తో 17 మే 2022న రిజిస్టర్ కాబడిన ఆ కంపెనీ రూ. 1100 కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డింద‌ని టీడీపీ చెబుతోంది.

రూ.20వేలుచెల్లిస్తే, 10నెలల్లో రూ.60వేలు ఇస్తామ‌ని ఆశ‌పెట్టి ఆ కంపెనీ జ‌నాన్ని ముంచేసింది. తొలుత రూ.20వేలు సంస్థలో పెట్టుబడిపెడితే, రోజుకి రూ.200చొప్పున 10నెలల్లో రూ.60వేలు తిరిగిస్తారని, సంకల్పసిద్ధి ఈకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏజెంట్లు ప్ర‌చారం చేశారు. ఇలా ప‌లు స్కీమ్ ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా జ‌నం నుంచి రూ.1100కోట్లు కొట్టేశారు.ఆ త‌రువాత సంకల్పసిద్ధి మార్ట్ లపేరుతో దుకాణాలుతెరిచారు. అగ్రోఫామ్స్ , గంధపుచెట్ల పెంపకం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయ‌డం ద్వారా వచ్చే సొమ్ముని పెట్టుబడిపెట్టిన వారికి పంచుతామని మోసగించారు. 25 సెంట్ల భూమి అమ్మితే, స్పాట్ లో వెంటనే రూ.50వేల కమీషన్ తో పాటు, రోజుకి రూ.500చొప్పున 300రోజులు డబ్బులిస్తామని సంస్థనిర్వాహకులు, ఏజెంట్లకు ఆశచూపారు. ఇలా పేదల బలహీనతను పెట్టుబడిగా మార్చుకున్న ఆ కంపెనీ వెనుక ఓలుపల్లిరంగా ఉన్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆత్మ‌గా ఉంటార‌ని టీడీపీ నేత ప‌ట్టాభి చెప్పే ఆధారం.

టీడీపీ చెబుతోన్న దాని ప్ర‌కారం గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లు గన్నవరం ప్రాంత నివాసులు. వాళ్ల‌ను కొడాలినాని, వల్లభనేని వంశీ త‌మ ఆత్మ‌గా ఉండే ఓలుపల్లిరంగా అనేవ్యక్తికి అప్పగించారు. ఇక అక్క‌డ నుంచి బోగ‌స్ కంపెనీ సృష్టించారు. ప్రజలసొమ్ముకాజేసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. ఓలుపల్లి రంగా అనే వ్యక్తి గుత్తావేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లకు అత్యంత సన్నిహితుడు. ఆ రంగా గన్నవరం, గుడివాడ శాసనసభ్యులకు ముఖ్య అనుచరుడు. అతన్ని ముందుపెట్టి వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇదంతా అంద‌రికీ తెలిసిన లింకులే. అయితే, గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ లు ఎవరు? నాలుగేళ్లక్రితం వారికున్న ఆస్తులు, ఓలుపల్లికి రంగాకు వాళ్ల‌కు ఉన్న సంబంధం ఏమిటి? రంగాకు కొడాలినాని, వల్లభనేని వంశీలతో ఉన్న అనుబంధం వెనుక ఏముంది? అనే కోణాల నుంచి సీఐడీ విచార‌ణ చేస్తే రూ. 1100 స్కామ్ వెనుక నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని పట్టాభిరామ్ చేస్తోన్న డిమాండ్‌.

మేనెలలో సంకల్పసిద్ధి సంస్థను తెరిపించిన వంశీ, తరువాత 2, 3నెలలు ఎక్కడా ఎందుకు కనిపించలేదట‌. కొత్తకంపెనీని ప్రమోట్ చేయడం ద్వారా వ‌చ్చిన సొమ్మును హైదరాబాద్, బెంగుళూరులో భూకొనుగోళ్లకు త‌ర‌లించే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. హైదరాబాద్ , బెంగుళూరు చుట్టుపక్కల నానీ వంశీలు, వారి బినామీ రంగా తో పాటు ఇత‌ర బినామీల పేర్లతో భూములు కొన్నారట‌. సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణంపై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజయవాడ పోలీస్ కమిషనర్ తక్షణమే సమాధానం చెప్పాల‌ని టీడీపీ లీడ‌ర్లు నిల‌దీస్తున్నారు. పేదల సొమ్మును కొట్టేసిన నాని, వంశీలపై కేసులు నమోదు చేయడం ద్వారా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీడీపీ కోరుతోంది. మొత్తం మీద మ‌రోసారి వంశీ, కొడాలిని టీడీపీ ఇరికించేసింది. కాసినోతో మంత్రి ప‌ద‌వి పోగొట్టుకున్న కొడాలి సంస్థాగ‌తంగా వైసీపీలోని ప‌ద‌వుల‌ను కోల్పోయారు. ఈసారి తాడేప‌ల్లి ప్యాలెస్ ఇచ్చే జ‌ర్క్ వ‌ల్ల‌భ‌నేని, కొడాలికి ఎలా ఉంటుందో చూడాలి.