Nandamuri Family : ‘జూనియ‌ర్’ చుట్టూ ఫ్యామిలీ డ్రామా

స్వ‌ర్గీయ నంద‌మూరి ఎన్టీఆర్ కుమార్తె,కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురంధ‌రేశ్వ‌రి రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 01:56 PM IST

స్వ‌ర్గీయ నంద‌మూరి ఎన్టీఆర్ కుమార్తె,కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురంధ‌రేశ్వ‌రి రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ నాయ‌క‌త్వాన్ని స‌మర్థిస్తూ ఒక ప్రైవేటు న్యూస్ ఛాన‌ల్ లో ఆమె చేసిన‌ కామెంట్ స‌ర్వ‌త్రా చ‌ర్చనీయాంశం అయింది. పెద్ద‌మ్మ ఆశీస్సులు లోకేశ్ కు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ సారంశం. అంతేకాదు, ద‌గ్గుబాటి కుటుంబం టీడీపీలోకి వెళుతుంద‌ని ఆ మ‌ధ్య జ‌రిగిన ప్రచారానికి ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ బ‌లం చేకూర్చుతోంది.వాస్త‌వంగా ఆమె అంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ కు బాగా ఇష్ట‌మ‌ని చెబుతుంటారు. జూనియ‌ర్ ను చిన్న‌ప్ప‌టి నుంచి పురంధ‌రేశ్వ‌రి మాత్ర‌మే ద‌గ్గ‌ర‌కు తీసేవార‌ట‌. కానీ, రాజ‌కీయాల‌కు వ‌చ్చేట‌ప్ప‌టికీ భిన్నంగా ఆమె వాయిస్ వినిపిస్తున్న‌ట్టు సంకేతాలు వెళుతున్నాయి. లోకేష్ కు ఆశీస్సులు ఇచ్చిన ఆమె ఇంట‌ర్వ్యూ జూనియ‌ర్ అభిమానుల‌ను నొచ్చుకునేలా చేస్తుంద‌ట‌. కేవ‌లం ఆమె కుమారుడు హితేష్ చెంచురామ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం పురంధ‌రేశ్వ‌రి అలా మాట్లాడార‌ని జూనియ‌ర్ అభిమానుల్లోని టాక్‌. ఆ మేర‌కు సోష‌ల్ మీడియాలోనూ అభిమానులు కొంద‌రు పోస్టులు పెడుతున్నారు.

ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, హితేష్ చెంచురామ్ ఇద్ద‌రూ వైసీపీలో లేరు. 2018 ఎన్నిక‌ల్లో వైసీపీ అధిష్టానం వాస్త‌వంగా వెంక‌టేశ్వ‌ర‌రావును పోటీ చేయ‌మ‌ని చెప్పింది. కానీ, కుమారుడి రంగంలోకి దింపారు. ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ సైలెంట్ గా ఉన్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటానంటూ వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌లుమార్లు చెప్పారు. కానీ, కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మాత్రం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ త‌ర‌హాలోనే త‌ల్లిగా కుమారుడి భవిష్య‌త్ కోసం పురంధ‌రేశ్వ‌రి కూడా ఆలోచించ‌డం స‌హ‌జం. కానీ, ఆమె జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న బీజేపీకి ఏపీలో దాదాపుగా స్థానంలేదు. అయితే, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పొత్తు అంశం ఈసారి తెర‌మీద‌కు వ‌స్తోంది. అదే, జ‌రిగితే టీడీపీ నుంచి హితేష్ చెంచురామ్ ను ప‌ర్చూరు నుంచి పోటీ చేయించాల‌ని ద‌గ్గుబాటి ప్లాన్‌. అందుకే, టీడీపీలోకి ద‌గ్గుబాటి కుటుంబం అంటూ ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, తోడ‌లుళ్లు చంద్ర‌బాబు, వెంకటేశ్వ‌ర‌రావు ఒక ఫంక్ష‌న్లో అప్యాయంగా మాట్లాడుకుంటోన్న ఫోటో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

తాజాగా పురంధ‌రేశ్వ‌రి ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇచ్చిన స్టేట్ మెంట్ మ‌ళ్లీ ద‌గ్గుబాటి ఫ్యామిలీ టీడీపీ ఎంట్రీపై చ‌ర్చ‌కు దారితీస్తోంది. వైసీపీలో మాత్రం వాళ్లు లేర‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. అంటే, పరోక్షంగా టీడీపీ గూటికి చేరే అవ‌కాశం లేక‌పోలేదు.ఒక వేళ పొత్తు క‌దిరితే, బీజేపీ త‌ర‌పున ఏదో ఒక స్థానం నుంచి హితేష్ చెంచురామ్ ను పోటీ చేయించే ఆలోచ‌న కూడా లేక‌పోలేదు. మొత్తం మీద వైసీపీకి మాత్రం ద‌గ్గుబాటి ఫ్యామిలీ శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పింది. భ‌విష్య‌త్ లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉన్న విధంగా ఆమె స్టేట్ మెంట్ ఉంది. లోకేశ్ నాయ‌క‌త్వం, ఆయ‌న‌కున్న స్వేచ్ఛ‌ అంటూ ఆమె మాట్లాడారు. గ‌తంలో ఎప్పుడూ లోకేష్ కు పాజిటివ్ గా ద‌గ్గుబాటి కుటుంబం రియాక్ట్ అయిన సంద‌ర్భాలు లేవు. పైగా బీజీపీలో ఉంటూ పెద్ద‌మ్మ గా లోకేష్ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శంసిస్తున్నారంటే హితేష్ భ‌విష్య‌త్ అంతా లోకేష్ మీద ఆధార‌ప‌డింద‌నే సంకేతం వెళుతోంది. తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబం నుంచి వెళ్లిపోయింది. దాన్ని మ‌ళ్లీ తీసుకుని తాత ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను తీసుకెళ్లాల‌ని జూనియ‌ర్ అభిలాష‌. ఆ విష‌యాన్ని ఆయ‌న అభిమానులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ, నారా ఫ్యామిలీ నుంచి ఆ పార్టీని తీసుకోవ‌డం ఇప్ప‌ట్టో అయ్యే ప‌నికాద‌ని జూనియ‌ర్ అభిమానుల‌కు తెలుసు. అయిన‌ప్ప‌టికీ లోకేష్ కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా జూనియ‌ర్ ఫ్యాన్స్ వార్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పురంధ‌రేశ్వ‌రి ఇచ్చిన స్టేట్ మెంట్ తో జూనియ‌ర్ అభిమానులు ఆమెపై గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నారా ఫ్యామిలీపై మాత్రమే సోష‌ల్ మీడియా వార్ చేస్తోన్న జూనియ‌ర్ అభిమానులు రాబోవు రోజుల్లో ద‌గ్గుబాటి కుటుంబంపై కూడా అదే త‌ర‌హాలో వెళ్లాల్సి వ‌స్తుందేమో!