Site icon HashtagU Telugu

TDP : టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ తొలి భేటీ.. జ‌న‌సేన – టీడీపీ రాష్ట్ర‌స్థాయి క‌మిటీ ఏర్పాటుకు నిర్ణ‌యం

TDP

TDP

ప్రభుత్వం పెడుతున్న అక్రమకేసులు.. కక్షసాధింపు విధానాలతో పాటు పాలకుల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అలానే త్వరలో జ‌న‌సేన – టీడీపీ పార్టీల సభ్యు లతో ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామ‌న్నారు. ఎక్కడా చిన్న ఆధారం కూడా లేని కేసులో అన్యాయంగా టీడీపీ అథినేత చంద్రబాబునాయుడిని జైల్లో పెట్టిన వైనంపై, ప్రజలపక్షాన పోరాడుతూ ప్రశ్నించేవారిపై పెడుతున్న అక్రమ కేసులపై, టీడీపీ యువనేత లోకేశ్ పై పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని వాస్తవాలను కూడా ప్రజలకు తెలియచేయాలని ఈ సమావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతని అన్యాయంగా చంద్రబాబుని జైల్లో పెట్టారని.. ఆధారాలు చూపమంటే విచారించి చెబుతా మంటున్నారని అన్నారు. అలానే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారని.. దానికి కొనసాగింపుగా ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో తప్పు జరిగింది అంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. నిర్మాణమే జరగని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని చెప్పడం ఈ పనికిమాలిన ప్రభుత్వానికే చెల్లింద‌న్నారు. ఈ విధంగా ప్రభుత్వం కక్షసాధింపులే ధ్యేయంగా రోజుకొకటిగా తెరపైకి తెస్తు న్నఅంశాలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ తో నిలిచి పోయిన పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8.15నిమిషాల నుంచి రాజోలు నుంచే ప్రారంభించాలని లోకేశ్ తోపాటు తామంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నామ‌ని అచ్చెన్నాయుడు తెలిపారు. పాద యాత్ర కొనసాగింపునకు అన్నిఅనుమతులు తీసుకున్నాంమ‌ని తెలిపారు.