Site icon HashtagU Telugu

TDP Polit Bureau : అసెంబ్లీ’ శాశ్వ‌త బ‌హిష్క‌ర‌ణ ?

CBN

Tdp Politbureau

`మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడ‌తా..` అంటూ గ‌త అసెంబ్లీ స‌మావేశాలను బ‌హిష్క‌రించి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వెళ్లాడు. కానీ, ఎమ్మెల్యేలు హాజ‌రు కావ‌డం చూశాం. ఈనెల 7 నుంచి ప్రారంభమ‌య్యే బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కావాలా? వ‌ద్దా? అనే అంశంపై గురువారం జ‌రిగిన పొలిట్ బ్యూరో స‌మావేశంలో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ‌పై పూర్తి అధికారాన్ని టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షానికి ఇస్తూ పొలిట్ బ్యూరో నిర్ణ‌యం తీసుకుంది.గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో భువనేశ్వ‌రి శీలాన్ని శంకిస్తూ వైసీపీ స‌భ్యులు కామెంట్లు చేశారు. ఆ సంద‌ర్భంగా చంద్ర‌బాబు చ‌లించిపోయాడు . అసెంబ్లీ నుంచి టీడీఎల్పీ కార్యాల‌యానికి వెళ్లాడు. త‌న మ‌న‌సులోని వేదన స‌భ్యుల‌కు చెప్పాడు. తిరిగి అసెంబ్లీకి వ‌చ్చిన త‌రువాత `మ‌ళ్లీ సీఎంగానే ఈ అసెంబ్లీకి వ‌స్తా..` అంటూ వెళ్లిపోయాడు. ఆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ క‌న్నీటి ప‌ర్యంతం అయిన విష‌యం విదిత‌మే. దానిపై వైసీపీ స‌భ్యులు క్ష‌మాప‌ణ చెప్ప‌డం కూడా అసెంబ్లీ బ‌య‌ట చూశాం. ప్ర‌ధానంగా టీడీపీ రెబ‌ల్ వ‌ల్ల‌భ‌నేని వంశీ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ కోరాడు. ఆ అవ‌మానాన్ని చంద్ర‌బాబు ప్ర‌తి వేదిక‌పైన ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.
అసెంబ్లీలో చంద్ర‌బాబు లేకుండా స‌భ్యులు హాజ‌రు కావడంపై చాలా కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఉండ‌గా అసెంబ్లీని బ‌హిష్క‌ర‌ణ‌చేసి పాద‌యాత్ర‌కు వెళ్లాడు. ఆ పార్టీ స‌భ్యులు కూడా అసెంబ్లీలో లేకుండా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. అదే త‌ర‌హాలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ముక్త‌కంఠంతో అసెంబ్లీని బ‌హిష్క‌రించాల‌ని ప్రాథ‌మికంగా పొలిట్ బ్యూరో భావించిన‌ట్టు స‌మాచారం. అయితే, బ‌డ్జెట్ స‌మావేశాలకు హాజ‌రైన త‌రువాత ఎమ్మెల్యేలు బ‌హిష్క‌రించి వెళ్లాలా? ముందుగానే నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాలా? అనే దానిపై టీడీఎల్పీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. మొత్తం మీద టీడీపీ శాశ్వ‌తంగా ఈ అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది. అయితే, బ‌హిష్క‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ఎలా ర‌క్తిక‌ట్టించాలి అనే దానిపై టీడీఎల్పీ తేల్చ‌నుంద‌న్న‌మాట‌.