Jogi Ramesh : మంత్రి జోగి ర‌మేష్ ఓట‌మికి టీడీపీ స్కెచ్

కృష్ణా జిల్లాకు చెందిన మంత్రిగా జోగి ర‌మేష్ ఉన్నారు. జ‌గ‌న్ క్యాబినెట్ 2.0లో ఆయ‌న‌కు స్థానం ల‌భించింది.

  • Written By:
  • Updated On - July 16, 2022 / 02:19 PM IST

కృష్ణా జిల్లాకు చెందిన మంత్రిగా జోగి ర‌మేష్ ఉన్నారు. జ‌గ‌న్ క్యాబినెట్ 2.0లో ఆయ‌న‌కు స్థానం ల‌భించింది. సామాజిక ఈక్వేష‌న్ క్ర‌మంలో జోగికి మంత్రి ప‌ద‌విని జ‌గ‌న్ ఇచ్చారు. అంతేకాదు, మంత్రి ప‌దవిని ఆశించిన ఆయ‌న తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై అనుచ‌రుల‌తో క‌లిసి తాడుల‌కు తెగ‌బ‌డిన చ‌రిత్ర ఉంది. ఆ సంఘ‌ట‌న త‌రువాత ఆయ‌న పేరు వైసీపీ వ‌ర్గాల్లోనే కాదు, ఏపీ. వ్యాప్తంగా తెలసిపోయింది. బ‌హుశా స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించినందుకు సామాజిక ఈక్వేష‌న్ ముసుగువేసి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇచ్చార‌ని ఆ పార్టీలోని కృష్ణా జిల్లా నేత‌ల్లోని టాక్‌.

ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే. గ‌త ఎన్నిక‌ల్లో 7,832 ఓట్ల మెజార్టీతో స‌మీప టీడీపీ అభ్య‌ర్థిపై గెలుపొందారు. అంటే, క‌నీసం 5వేల ఓట్ల‌ను రాబ‌ట్ట‌గ‌లిగితే, ఈసారి జోగి ఓట‌మి ఖాయ‌మంటూ టీడీపీ స్కెచ్ వేస్తోంది. అందుకు, ఆయ‌న‌పై ఇప్ప‌టి నుంచే ధీటైన అభ్య‌ర్థిని టీడీపీ అన్వేషించింది. టీడీపీ సీనియర్ లీడర్ కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ ను బరిలోకి దింప‌డానికి రంగం సిద్ధం చేసింది. తెలుగుదేశం హ‌యాంలో కాగిత వెంక‌ట్రావు చేసిన ప‌నులు ఇప్ప‌టికీ ఆ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు గుర్తున్నాయి. పైగా ఆయ‌న కుమారుడిపై సానుభూతి ఉంద‌ని టీడీపీ గ్ర‌హించింది. అందుకే, ఆఫీస్ ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డిన జోగిని ఎలాగైనా ఓడించాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేశారు చంద్ర‌బాబు.

ఇప్ప‌టికి జగన్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్ర పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ఛందంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయింది. ఇచ్చిన హామీల్లో 95శాతం నెర‌వేర్చామ‌ని ఇటీవ‌ల జ‌రిగిన ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ ప్ర‌క‌టించింది. కానీ, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డానికి ఎన్నో ర‌కాలుగా జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌పై భారం వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేకత ఉంద‌ని తాజా స‌ర్వేల సారంశం. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వాతో గెలుపొందిన జోగి ఈసారి ఓడిపోవ‌డం ఖాయ‌౦గా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురి అభిప్రాయం.

ఎమ్మెల్యే నుంచి ఊహించ‌ని విధంగా జోగి ర‌మేష్ మంత్రి అయ్యారు. అయిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల్లో గుడ్ విల్ ప్ర‌శ్నార్థ‌కంగా ఉంద‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని గ్ర‌హించిన వైసీపీ ప్ర‌త్యామ్యాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నార‌ని స‌మాచారం. అయితే, మ‌రో రెండేళ్లు కాలంలో ఆయ‌న గ్రాఫ్ పెరిగితే మాత్రం య‌థాత‌దంగా సిట్టింగ్ స్థానం నుంచి పోటీ ఉంటారు. లేదంటే, ఆయ‌న అభ్య‌ర్థిత్వం డౌట్ అనే టాక్ వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదేమైన‌ప్ప‌టికీ జోగి ర‌మేష్ ను ఓడించ‌డానికి టీడీపీ వేసిన ఎత్తుగ‌డ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూద్దాం.