TDP Vs YSRCP : వైఎస్సార్సీపీ అసంతృప్తులపై టీడీపీ ఆకర్ష్ ప్లాన్

రాజకీయాల్లో ఎవరూ శాశ్వాత మిత్రులు కాదు... ఎవ్వరూ శాశ్వత శతృవులు కాదు.

  • Written By:
  • Publish Date - March 28, 2022 / 05:28 PM IST

రాజకీయాల్లో ఎవరూ శాశ్వాత మిత్రులు కాదు… ఎవ్వరూ శాశ్వత శతృవులు కాదు. అవకాశాలను బట్టి అప్పటికప్పుడు పార్టీలు మారుతూ తమ రాజకీయ భవిష్యత్తును చూసుకునే వారే ఎక్కువ. ఇలాంటి విషయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అందేవేసిన చేయి. తన పార్టీలో అసమ్మతి నేతలను బుజ్జగించడం కంటే పక్క పార్టీలో అసంతృప్తులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెడుతుంటారు. ఇప్పుడు కూడా బాబు అదే ఫాలో అవబోతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇంకా రెండేళ్ళు సమయముంది. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకార వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకే విజయం దక్కుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. టీడీపీ మరోసారి కనీస పోటీ ఇవ్వడం కూడా డౌటేనన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అసంతృప్తులపై చంద్రబాబు కన్నేశారు.

ఇటీవల వైఎస్సార్సీపీ శాశనసభాపక్ష సమావేశంలో సీఎం జగన్ తన ఎమ్మెల్యేలకు కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రజల్లో ఉండే వారికే టిక్కెట్లు ఇస్తానని, తన నివేదికలు తనకు ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ సీటు ఉంటుందో లేదోనన్న టెన్షన్ చాలా మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో ఉంది. పైగా సీఎం జగన్ దాదాపు 70 మంది వరకూ కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం వారికి ఉన్న ప్రత్యామ్నాయం పార్టీ మారడమే. దీంతో అసంతృప్తలు టీడీపీ వైపు చూసే అవకాశముంది. దీనిని ముందుగానే గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ముందే అసంతృప్తుల జాబితాను సిద్ధం చేసుకుని, వారిని పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వీటి బాధ్యతలను కూడా ఆయా జిల్లాల సీనియర్ నేతలపై ఉంచినట్టు తెలుగు తమ్ముళ్ళ ద్వారా ఉన్న సమాచారం.

ఇప్పటికే చంద్రబాబు కొందరి అసంతృప్తుల జాబితాను కూడా తన దగ్గర ఉంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్నటి వరకూ తమపై విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు స్థానిక క్యాడర్, ఇతర నేతలు కూడా అంగీకరించాలి. లేకుంటే బాబుగారికి ఇది మరో సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా పరిస్థితిని ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాల మధ్య అసంతృప్తి ఉన్నప్పటకీ… ఎంతమంది టీడీపీ వైపు వస్తారనేది డౌటే. ఎందుకంటే టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకూ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చపార్టీలోకి వెళ్లి ఉన్న సీటు కూడా పోగొట్టుకునే రిస్క్ చేసేవారు ఉంటారా అనేది అనుమానమే.