TDP Liquor War:`కిల్ల‌ర్` జేమ్స్ బ్రాండ్స్.కామ్

ఏపీలోని నాసిర‌కం మ‌ద్యం బ్రాండ్ల‌పై టీడీపీ త‌న‌దైన శైలి పోరుకు శ్రీకారం చుట్టింది. ఇటీవ‌లే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న నాటు సారా మర‌ణాల‌పై ఓ రేంజిలో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టింది.

Published By: HashtagU Telugu Desk
Lokesh Rally

Lokesh Rally

ఏపీలోని నాసిర‌కం మ‌ద్యం బ్రాండ్ల‌పై టీడీపీ త‌న‌దైన శైలి పోరుకు శ్రీకారం చుట్టింది. ఇటీవ‌లే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న నాటు సారా మర‌ణాల‌పై ఓ రేంజిలో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టింది. అసెంబ్లీ ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే నాసిరకం మ‌ద్యంపై ఏకంగా డిజిట‌ల్ క్యాంపెయిన్‌కు తెర‌లేపింది. అందుకోసం కిల్ల‌ర్‌జేబ్రాండ్స్‌.కామ్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ సైట్‌లో ప్ర‌భుత్వ మ‌ద్యం పాల‌సీ, మ‌ద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ, మ‌ద్యం కార‌ణంగా సంభ‌విస్తున్న మ‌ర‌ణాల వివ‌రాలు పొందు పరిచారు. డిజిట‌ల్ క్యాంపెయిన్‌లో ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావాలని, ఫిర్యాదుదారుల వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని టీడీపీ వెల్ల‌డించింది.

ఇటీవ‌ల త‌మిళ‌నాడులోని ఒక ప్ర‌ముఖ ల్యాబ్ లో మ‌ద్యం బ్రాండ్ల‌పై ప‌రీక్ష‌లు చేసిన త‌రువాత వ‌చ్చిన రిపోర్ట్ ల‌ను కూడా ఆ వెబ్ సైట్ లో ఉంచారు. వాటి వివ‌రాలు..

ఓల్డ్ టైమ‌ర్ విస్కీ
OLD TIMER DELUX WHISKYని కెమిక‌ల్ అనాల‌సిస్ చేయిస్తే బ‌య‌ట‌ప‌డిన Benzoquinone, Volkenin, Scoparone, Dimethoxycinnamicacid ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు. వీటి కార‌ణంగా ఒక్కసారిగా శ్వాసక్రియ పెరిగిపోవడం, బీపీ పడిపోవడం, నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతం కావడం, తల తిరగడం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగడం, మూర్చపోవడం, కళ్లు మండటం, చర్మం దురద, లివర్‌ సంబంధిత వ్యాధులు వస్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

చాంపియ‌న్ విస్కీ
మ‌రో బ్రాండ్ CHAMPION SPECIAL WHISKYలో ప‌రీక్ష‌ల అనంత‌రం Pyrogallol అనే ర‌సాయ‌నం బ‌య‌ట‌ప‌డింద‌ట‌. ఈ విస్కీ తాగిన‌వారిలో దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, వాంతులు, అతిసారం, శ్వాస ఒక్క‌సారిగాపెరిగిపోవడం, బీపీ పడిపోవడం, ఒక్కసారిగా నాడీ వ్యవస్థ పనితీరు వేగంవంతం కావడం, తల తిరగటం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛపోవడం వంటిస‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డ‌తారు.

రాయ‌ల్ సింహ విస్కీ
ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో అమ్ముతున్న ROYAL SIMHA SUPERIOR WHISKY ల్యాబ్‌లో ప‌రీక్షించంగా ప్ర‌మాద‌క‌ర‌మైన Volkenin, Caprolactam, Benzoquinone వంటి స్లోపాయిజన్‌తో సమాన‌మైన కెమిక‌ల్స్ ఉన్నాయ‌ని తేలింద‌ట‌. ఇవి తాగేవారిలో శ్వాసక్రియ పెరిగిపోవడం, బీపీ పడిపోవడం, ఒక్కసారి నాడీవ్యవస్థ పనితీరు పెరగడం, తల తిరగడం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, మానసిక గందరగోళం, మెలికలు తిరగడం, మూర్ఛపోవడం, చర్మంపై దురద, నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం, జీర్ణ వ్యవస్థపై ప్రభావం వంటి దుష్ఫ‌లితాలు క‌నిపిస్తాయి.

గ్రీన్ చాయిస్ విస్కీ
GREEN CHOICEని ప‌రీక్ష‌ల‌కి పంపించ‌గా Scoparone, Pyrogallol, Dimethoxycinnamicacid, Benzoquinone అవ‌శేషాలు ఈ మ‌ద్యంలోఉన్నాయ‌ని తేలింద‌ట‌. ఇవ్వ‌న్నీ విషంతో సమానమైన కెమిక‌ల్స్‌. ఈ బ్రాండ్ తాగే వాళ్ల‌కి కళ్లు మండటం, చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లివర్‌ సంబంధిత వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి, చర్మం ఎర్రబడటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం స‌మ‌స్య‌ల‌ని ఎదుర్కొంటారు.

సెల‌బ్రిటీ బ్రాందీ

CELEBRITY BRANDYని జ‌రిపిన ప‌రీక్ష‌లో Pyrogallol, Volkenin వంటి తీవ్రమైన విషపూరిత ర‌సాయ‌నాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కెమిక‌ల్స్‌ చర్మానికి త‌గిలినా చాలు చర్మ సంబంధ వ్యాధుల బారిన ప‌డ‌తారు. దాని ఆవిరి పీల్చినా విష ప్ర‌భావానికి లోన‌వుతారు. ఇవి తాగేవారిలో దగ్గు, గొంతు నొప్పి, కళ్లు ఎర్రబడటం, చర్మం ఎర్రబడటం, వాంతులు, అతిసారం ల‌క్ష‌ణాలుంటాయి.
ఇథైల్ కి బ‌దులు విషం వాడ‌కం
మ‌ద్యం త‌యారీలో కీల‌కమైన లిక్విడ్ ఇథైల్ ఆల్క‌హాల్ వాడ‌తారు. ఏపీలో ఉత్ప‌త్తి అవుతోన్న ల‌క్ష‌ల లీట‌ర్ల మ‌ద్యానికి స‌రిప‌డా ఇథైల్ ఆల్క‌హాల్ రాష్ట్రంలో ఉత్ప‌త్తి కాలేదు. దేశంలోనూ లేదు. ఇథైల్ ఆల్క‌హాల్ 2019-2021 వ‌ర‌కూ ఎంత దిగుమ‌తి చేసుకున్నారు అని ఒక స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త అడిగితే అస‌లు దిగుమ‌తి చేసుకోలేద‌ని సంబంధిత శాఖ నుంచి స‌మాచారం అందింది. మ‌ద్యం తయారీకి అత్య‌వ‌స‌ర‌మైన ఇథైల్ ఆల్క‌హాల్ దేశీయంగా ఉత్ప‌త్తి లేకుండా, దిగుమ‌తి చేసుకోకుండా ఏపీలో ప్ర‌మాద‌క‌ర బ్రాండ్ల త‌యారీకి వాడుతున్న ర‌సాయ‌నాలు ఏంట‌నేది ఎస్ జీ ఎస్ ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో తేట‌తెల్ల‌మైంది. ఇథైల్ ఆల్క‌హాల్‌కి బ‌దులుగా ఎక్స్‌టెర్న‌ల్ మెడిసిన్ త‌యారు చేసేందుకు వాడే కెమిక‌ల్స్‌ని మ‌ద్యం త‌యారీకి వాడుతున్నార‌ని అనుమానిస్తోంది. ఆయిట్మెంట్లు, టాబ్లెట్లు, క్రీములు త‌యారు చేసుకునేందుకు ఫార్మా కంపెనీలు దిగుమ‌తి చేసుకున్న కెమిక‌ల్స్‌నే మ‌ద్యం తయారీకి వాడేస్తున్నార‌ని నిపుణుల సందేహంగా ఉండ‌డం గ‌మనార్హం.
సొంత బ్రాండ్లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలలో ఊరూ పేరు లేని మ‌ద్యం బ్రాండ్లు వంద‌ల ర‌కాలు ఉన్నాయి. వీటిలో 70 శాతం బ్రాండ్లు పేరు గ‌తంలో ఎప్పుడు విని ఉండ‌రు. వీటిని ఎవ‌రు త‌యారు చేస్తున్నారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.
మ‌ద్యం పాల‌సీ అమ‌లులోకి రాక‌ముందే రాష్ట్రంలో ప్ర‌ముఖ బ్రాండ్ల మ‌ద్యం కంపెనీల య‌జ‌మానుల డిస్టిలరీలు,బ్రూవ‌రీస్ ను ఒక సిండికేట్ స్వాధీనం చేసుకుంది. గ‌తంలో మండ‌లానికి ఓ మ‌ద్యం సిండికేట్‌వుండ‌గా, రాష్ట్ర‌మంతా ఇప్పుడు ఒకే సిండికేట్‌గా మారింది. అమ్మేది ప్ర‌భుత్వం పేరుతోనైనా త‌యారు చేసేది సిండికేట్ల డిస్టిల‌రీల్లోనే అనేది స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఒక ఎంపీకి చెందిన డిస్ట‌ల‌రీ నుంచి ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై చాంపియన్ విస్కీ, ఎస్పీవై, సెలబ్రిటీ బ్రాందీ, వైట్ టస్కర్, దారు హౌస్ బ్రాండ్లు త‌యారు చేస్తున్నార‌ని వినికిడి. ఓ కీల‌క మంత్రికి చెందిన అదాన్, లీల డిస్టలరీలు సుప్రీం విస్కీ, బ్రిలియంట్ విస్కీ త‌యారు చేసి ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల ద్వారా అమ్ముతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సుమారు 2 వేల‌కి పైగా బ్రాండ్ల‌న్నీ ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక స‌ల‌హాదారు డిస్ట‌ల‌రీల నుంచి త‌యారు చేస్తూ అమ్ముతున్నార‌ని టాక్.

దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుపుతుంటే ఏపీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల‌లో ఓన్లీ క్యాష్ విక్ర‌యాలే. ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌ద్యం ఒక బాటిల్ త‌యారీకి రూ.10 అయితే 150కి అమ్ముతున్నార‌ని ఆరోప‌ణ‌. ఈ 140 సిండికేట్‌కు చేర‌వేయ‌డానికి ఇలా న‌గ‌దుకు మాత్ర‌మే తీసుకుని మ‌ద్యం అమ్ముతున్నారని స‌మాచారం. తెలుగుదేశం పార్టీ పాల‌న‌లో ఏడాదికి గ‌రిష్టంగా 6 వేల కోట్ల విలువైన మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. మ‌ద్య‌నిషేధం హామీ ఇచ్చిన వైసీపీ పాల‌న ఆరంభ‌మ‌య్యాక గ‌రిష్టంగా 20 వేల కోట్ల‌కి పైగానే విలువున్న మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌ప‌డం రికార్డ్.

  Last Updated: 27 Mar 2022, 12:21 PM IST