Nara Lokesh : లోకేష్ మాస్ట‌ర్ స్కెచ్- 2024

మ‌హానాడు సూప‌ర్ హిట్ టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ను పార్టీలో మ‌రో మెట్టు ఎక్కించింది. ఆయ‌న వ్యూహం ప్ర‌కారం మ‌హానాడు న‌డిచింది.

  • Written By:
  • Updated On - May 31, 2022 / 02:17 PM IST

మ‌హానాడు సూప‌ర్ హిట్, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ను పార్టీలో మ‌రో మెట్టు ఎక్కించింది. ఆయ‌న వ్యూహం ప్ర‌కారం మ‌హానాడు న‌డిచింది. క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న టీం చేసిన ప్ర‌య‌త్నం ఆశించిన దానికి మిన్న‌గా మ‌హానాడు విజ‌య‌వంతం అయింద‌ని ఆ పార్టీలోని సీనియ‌ర్లు సైతం అంగీకరిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా పార్టీలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ప్ర‌స్తుతం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. రెండుసార్లు వ‌రుస‌గా ఆ ప‌ద‌విని నిర్వ‌హించారు. మ‌హానాడు సంద‌ర్భంగా 2+1 ఫార్ములా ను బ‌య‌ట‌కు తీసిన లోకేష్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాబోవు రోజుల్లో ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌దోన్న‌తి ల‌భించ‌నుంద‌ని ఆ పార్టీ యూత్ ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తోంది. ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ 2009 నుంచి పార్టీలో ప‌నిచేస్తోన్న లోకేష్ ప్ర‌తి ప‌ద‌విలోనూ అనూహ్యంగా ఫ‌లితాల‌ను రాబ‌ట్టార‌ని పార్టీ అధ్య‌య‌న క‌మిటీ భావిస్తోంది. ఆయ‌న పంచాయ‌తీరాజ్‌, ఐటీశాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆ శాఖ‌ల‌ను విజ‌య‌వంతంగా న‌డిపించార‌ని గుర్తు చేసుకుంటోంది. అందుకే, ఆయ‌న‌కు ప‌దోన్న‌తి క‌ల్పించ‌డంతో పాటు 2024 ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని అధిష్టానం యోచిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే స‌ర్వేల‌తో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని బ‌ల‌మైన నాయ‌కుల జాబితా లోకేష్ వ‌ద్ద ఉంది. ఆయ‌న టీమ్ త‌ర‌చూ చేసే స‌ర్వేల ఆధారంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపు కూడా ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది.

మ‌హానాడు హిట్ కావ‌డంతో తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ పూర్తిస్థాయి ప‌ట్టు సాధించార‌ని చంద్ర‌బాబు టీమ్ కూడా విశ్వ‌సిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కొంద‌రు సీనియ‌ర్లు తొలి రోజుల్లో ఆయ‌న నాయ‌క‌త్వంపై అయిష్టంగా ఉన్న‌ప్ప‌టికీ మ‌హానాడు వేదిక‌ను చూసిన త‌రువాత వాళ్లు కూడా జై కొడుతున్నార‌ట‌. అందుకే, ఇదే స‌మ‌యంగా భావిస్తున్న పార్టీ అధిష్టానం 2024 ఎన్నిక‌ల గెలుపున ఆయ‌న భుజ‌స్కంధాల‌పై ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వినికిడి. ఆ క్ర‌మంలో అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి నాడు పాదయాత్రను ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ అయింద‌ని స‌మాచారం. అదే తేదీన `వ‌స్తున్నా..మీకోసం` యాత్రను చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల‌కు ముందు చేశారు. ఆనాడు చేసిన పాద‌యాత్ర కార‌ణంగా తెలంగాణ‌లోనూ 15 మంది ఎమ్మెల్యేల‌ను ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుచుకుంది. ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అందుకే, ఇప్పుడు లోకేష్ చేత పాద‌యాత్ర చేయించ‌డం ద్వారా 2024 ఎన్నిక‌ల‌ను ఫేస్ చేయాల‌ని పార్టీ ప్రణాళిక‌ను సిద్ధం చేసింది.

`ఏడాదికో..రెండేళ్ల‌కో వ‌చ్చే ఎన్నిక‌లు` అంటూ స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల క్ర‌మంలో ముంద‌స్తుకు అవ‌కాశం ఉంద‌ని టీడీపీ న‌మ్ముతుంది. ఒక వేళ ముంద‌స్తు ఎన్నిక‌ల వ‌చ్చే ప‌రిస్థితి ఉంటే, అక్టోబ‌ర్ కంటే ముందుగానే లోకేష్ పాద‌యాత్రకు దిగుతార‌ని తెలుస్తోంది. ఆయ‌న పాద‌యాత్ర‌కు సమాంత‌రంగా చంద్ర‌బాబునాయుడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని బ్లూప్రింట్ సిద్ధం అవుతుంద‌ని క్యాడ‌ర్ చ‌ర్చించుకుంటోంది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌వ‌ర్ చేసేలా లోకేష్ పాద‌యాత్ర‌కు రూట్ మ్యాప్ త‌యారు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అలాగే, ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేసేలా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని స‌మాచారం. కొత్త జిల్లాలు లేదా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా బ‌స్సు యాత్ర ను విడ‌త‌ల‌వారీగా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వినికిడి.

చంద్రబాబు పర్యాటనల్లో తొలి రోజు మినీ మహానాడు పేరుతో విస్తృత స్థాయి పార్టీ సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ మినీ మ‌హానాడును నిర్వ‌హించ‌డం ద్వారా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలను నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. రెండో రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో ముఖాముఖి సమావేశమై చర్చలు జరుపుతారు. మూడో రోజు జిల్లాలోని ప్రధాన సమస్యలను ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద అటు లోకేష్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతుంటే, సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్ట‌బోతున్నార‌న్న‌మాట‌.