TDP MP Kesineni : రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది – టీడీపీ ఎంపీ కేశినేని నాని

తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 09:19 PM IST

తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. తుఫాను ప్ర‌భావంతో నష్టపోయిన రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని ఆదుకోవడంలో విఫలమైన జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదని మండిప‌డ్డారు. మిచౌంగ్ తుఫాను మన రాష్ట్ర రైతాంగ జీవితాలను అతలాకుతలం చేసిందని.. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, మామిడి సహా అన్ని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. లక్షలాది ఎకరాల్లో పంట నాశనమయిందని.. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో వేల ఎకరాలలో పంట దెబ్బతింద‌ని తెలిపారు. వరి రైతు ఎకరానికి రూ.40,000/- వరకు నష్టపోయార‌ని.. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫల‌మైంద‌న్నారు. హుద్ హుద్, తిత్లి తుఫానుల సమయంలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చేవరకు చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఉండి రాత్రి బస్సులో బస చేసి వారికి ధైర్యం కల్పించారని ఎంపీ కేశినేని నాని గుర్తు చేశారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని జరిగిన నష్టాన్ని వివరించాన‌ని.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని కాబట్టి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ప్రజలను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైనందున తక్షణ సాయం కింద ఐదు వేల కోట్లు ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో డిమాండ్ చేశారని తెలిపారు. అసలే కరువుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ తుఫాను వల్ల భారీగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం కోరారని తెలిపారు. రైతులు, పేద ప్రజల పట్ల ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సానుకూలంగా ఉండి వారి తరుపున పోరాటం చేస్తుంద‌ని.. బాధితులను రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఢిల్లీ నుంచి గల్లి వరకు పోరాటం చేసి వారిని ఆదుకుంటామ‌న్నారు.

ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది చేయడమే ప్రజా ప్రతినిధులుగా త‌మ బాధ్యత అని ఎంపీ కేశినేని నాని తెలిపారు. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నేర్పించిన బాటలో ప్రజాప్రతినిధులుగా ముందుకు వెళ్తున్నాన‌ని తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచినీటి ఎద్దడి ఉండడంతో ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ను ఇచ్చే బాధ్యతను తీసుకున్నాన‌ని తెలిపారు. చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయడం వల్ల కొన్నాళ్లపాటు ట్యాంకర్ల పంపిణీన‌ని వాయిదా వేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్పటికే 120 గ్రామాల వరకు వాటర్ ట్యాంకర్లు అందించామ‌ని.. ఫిబ్రవరి కి నీటి ఎద్దడి మొదలవుతుంది కాబట్టి మిగిలిన 160 గ్రామాలకు కూడా జనవరిలోగా టాంకర్లు అందిస్తామ‌న్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం విజయవాడ ప్రజలు, నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ త‌న‌కు ఇచ్చార‌ని తెలిపారు.