తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బైరెడ్డి శబరి జాతీయ పార్టీ నివేదికను సమర్పించారు. గత ఐదేళ్లలో ఎదురైన రాజకీయ సవాళ్లను ప్రస్తావిస్తూ.. టీడీపీ పోరాట పటిమను కొనియాడారు. “ఐదేళ్లు గొడ్డలి పార్టీని టీడీపీ ధైర్యంగా ఎదుర్కొందని.. కూటమిగా ఎన్నికలకు వెళ్లి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని బైరెడ్డి శబరి అన్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయాలని ప్రయత్నించిన ప్రతిసారి పార్టీలో కొత్త యోధులు పుట్టుకొస్తారని ప్రత్యర్థులకు అర్థమైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని, అండమాన్ వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు.
జాతీయ భావాలతో టీడీపీ ఎప్పుడూ ముందుకు సాగిందని.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. “సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని.. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం-2.0 వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ టీడీపీ ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొంటూ.. యువతకు ఉపాధి కల్పనలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. “20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని శబరి తెలిపారు.
లోకేష్ యువగళ పాదయాత్రను ప్రస్తావిస్తూ.. “గొడ్డలి పార్టీకి లోకేష్ పాదయాత్రలో ట్రైలర్ చూపించారు.. తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారు” అంటూ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తుందని.. కార్యకర్తలు డేగ కన్నుతో నిఘా పెట్టి అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు.
