Site icon HashtagU Telugu

AP Legislative Council: ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు..!

Tdp Mlcs Ap Legislative Council

Tdp Mlcs Ap Legislative Council

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఈరోజు జంగారెడ్డిగూడెం మృతులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీల‌ను శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు సస్పెండ్ చేశారు. నేటి శాసన మండలి కాగానే జ‌గంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై చ‌ర్చించాలంటూ మ‌రోసారి టీడీపీ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిలుచుని నినాదాలతో సభను అడ్డుకున్నారు. అంతే కాకుండా ఏపీలో సారా మరణాలు, జే మద్యాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ స‌భ్యులు మండలి చైర్మన్‌ పోడియంను చుట్టు ముట్టారు.

ఈ నేప‌ధ్యంలో సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోండ‌ని పదేపదే టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఒక రోజు పాటు సస్పెన్షన్‌ విధించారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీలు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డిలను ఒకరోజు సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ప్రకటించిన మండలి చైర్మన్, ఆ త‌ర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇక ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. టీడీపీ సభ్యులు ఈరోజు కూడా స‌భ‌లో విజిల్స్‌ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళన చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. జంగారెడ్డిగూడెం క‌ల్తీసారా మరణాలు, జె బ్రాండ్ మ‌ధ్యం పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి, చివరకు సస్పెన్షన్‌కు గుర‌య్యారు. ఇక మ‌రోవైపు సభకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఇక మ‌రోవైపు నాటు సారా మృతుల పాపం సీఎం జగన్‌ రెడ్డిదే అని టీడీపీ నాయ‌కులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్ర‌మంలో జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు. సభలోకి వచ్చిన అనంతరం నిరసనలో భాగంగా చిడతలు వాయిస్తూ, విజిల్స్‌ వేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయగానే ఆ పార్టీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం వైపు వెళ్లడానికి యత్నించారు. దీంతో దీపక్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు.