Site icon HashtagU Telugu

TDP : జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు : ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ashokbabu

ashokbabu

రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు..ఇలా ఏ వర్గం సంతోషంగా లేర‌ని టీడీపీ ఎమ్మెల్సీ ప‌రుచూరి అశోక్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో 13,42,000 మంది ఉద్యోగులున్నారని.. ఇందులో 6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండ‌గా.. వారి పరిస్థితే ఘోరం గా ఉందన్నారు. మిగిలిన వారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదని.. జగన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులు హెల్త్ కార్డు తీసుకుని ఆసుపత్రులకు వెళ్తే పురుగులను చూసినట్టు చూస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. డబ్బులు కట్టని ఆరోగ్యశ్రీ రోగులు, డబ్బులు కట్టే ఉద్యోగులను ఆసుపత్రులు ఒకేలా చూస్తున్నాయన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదని.. పీఆర్సీ అరియర్స్‌కు దిక్కులేదన్నారు. రెండు డీఏ అరియర్స్ పెండింగ్‌లో పెట్టారని నాడు ఉద్యోగులు చంద్రబాబు నాయుడిని కాదనుకున్నారని.. 01.07.2018 నుంచి నేటి వరకు 284 డీఏ అరియర్స్‌ కిస్తీలు పెండింగ్‌లో ఉన్నాయని అశోక్‌బాబు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర ప్రభుత్వం ప్రీజ్ చేసిందనే నెపంతో డీఏలను పెండింగ్‌లో పెట్టారని… పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి వీక్లీ ఆఫ్ లు అమలు చేయడం లేదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులు ఆరు నెలలుగా జమ చేయడం లేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఎంప్లాయిస్ మాదిరి జీతాలు ఇస్తానని మాట తప్పార‌ని.. అంగన్‌వాడీలు తమ సమస్యలపై రోడ్లపైకి వస్తే వాలంటీర్లతో బలవంతంగా తాళాలు పగులగొట్టి సెంటర్లను తెరిపిస్తున్నారని ఆయ‌న తెలిపారు. రేపోమాపో మునిసిఫల్ సానిటరీ వర్కర్స్ కూడా రోడ్లపైకి వస్తారని.. మద్యాహ్న బోజనం కార్మికులను కూడా జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశార‌ని ఆరోపించారు. ఆశావర్కర్లు, నిరుద్యోగులు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఉద్యోగులు, మునిసిఫల్ వర్కర్లు ఎవ్వరూ సంతోషంగా లేరని… ఉద్యోగులు, వ్యవసాయదారులు, కార్మికులు జగన్ రెడ్డిని గద్దెదించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. అంగన్ వాడీలకు 2016, 2018 లో తెలుగుదేశం ప్రభుత్వం రెండు సార్లు జీతాలు పెంచామ‌ని… జగన్ రెడ్డి ఎన్నికల మూడు నెలల్లోనైనా ఉద్యోగులకు 1 వ తారీఖున జీతాలు ఇవ్వగలరా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు

Also Read:  Amaravati : నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అమ‌రావ‌తి ఉద్య‌మం.. ఏకైక‌ రాజ‌ధాని అమ‌రావ‌తేనంటూ గ‌ళం విప్పిన రైతులు, ప్ర‌జ‌లు