TDP MLAs Fight: ప‌ది మందైనా పైచేయే..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టీడీపీ పోరాటం చేయ‌డం చాలా సంద‌ర్భాల్లో చూశాం. గ‌తంలో స్వ‌ర్గీయ వైఎస్ సీఎం గా ఉన్న‌ప్పుడుగానీ, కిర‌ణ్‌కుమార్ రెడ్డి, రోశ‌య్య లు సీఎంలు ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ‌గా ఉండేది.

  • Written By:
  • Updated On - March 25, 2022 / 04:17 PM IST

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టీడీపీ పోరాటం చేయ‌డం చాలా సంద‌ర్భాల్లో చూశాం. గ‌తంలో స్వ‌ర్గీయ వైఎస్ సీఎం గా ఉన్న‌ప్పుడుగానీ, కిర‌ణ్‌కుమార్ రెడ్డి, రోశ‌య్య లు సీఎంలు ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ‌గా ఉండేది. పైగా చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఎప్ప‌టికప్పుడు డైరెక్ష‌న్ ఇస్తూ ముందుకు న‌డిపేవాడు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కేవ‌లం 23 మంది వాళ్ల‌లో న‌లుగురు దూరంగా ఉంటారు. అసెంబ్లీని బ‌హిష్క‌రించ‌డంతో న‌డిపించడానికి చంద్ర‌బాబు కూడా అందుబాటులో లేడు. అయిన‌ప్ప‌టికీ గ‌త వారం రోజులుగా జ‌గ‌న్ స‌ర్కార్ ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు. ప‌ట్టుమ‌ని ప‌ది ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు జంగారెడ్డిగూడెం క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వానికి నిద్ర‌లేకుండా చేస్తున్నారు.

మండ‌లిలో లోకేష్ ఆధ్వ‌ర్యంలో రోజుకో ర‌కంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నారు. జుడిషియ‌ల్ విచార‌ణ జ‌ర‌ప‌డం ద్వారా క‌ల్తీసారా మ‌ర‌ణాల‌ను తేల్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రిస్తోన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మండ‌లి కేంద్రంగా లోకేష్ ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అసెంబ్లీలో స్పీక‌ర్, మండ‌లిలో చైర్మ‌న్ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో స‌స్పెన్ష‌న్ వేటు వేస్తున్నారు. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై మాత్రం చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డంలేదు. దీంతో వివిధ రూపాల్లో టీడీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. ఒక రోజు విజిల్స్ మ‌రో రోజు చిడ‌త‌లతో ఉభ‌య స‌భ‌ల‌ను గంద‌ర‌గోళం చేయ‌గ‌లిగారు. తాజాగా శుక్ర‌వారం తాళిబొట్ల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్ర‌వారం ఉభయ సభల్లోకి తాళి బొట్టులు తీసుకుని ఎంట్రీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తూ తాళిబొట్లు ప్రదర్శించారు. సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో తాళిబొట్టు ప్రదర్శిస్తున్న బచ్చుల అర్జునుడు చేతిలో నుంచి వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తాళిబొట్టు లాగేసుకుంది. స‌భ‌ను అదుపులో పెట్ట‌లేక 8 మంది ఎమ్మెల్సీలను మండలి నుంచి ఛైర్మన్ సస్పెండ్ చేయ‌డం గ‌మనార్హం.

మ‌రో వైపు ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. పోడియం వద్దకు చేరుకుని తాళిబొట్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసస్తూ టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి సభలో టీడీపీ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. రోజుకో విధంగా సభలో నిరసనలు వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు. ఇవాళ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, టీడీపీ ఎమ్మెల్సీలు రామ్మోహన్‌రావు, రాజనర్సింహులు, రామారావు, కేఈ ప్రభాకర్‌ , అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడును ఛైర్మన్ సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని సస్పెండ్ అస్త్రాన్ని ప్ర‌యోగించాడు. టీడీపీ సభ్యులు తొలు మండలిలో మార్చి 24 విజిల్స్‌ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవ‌డంతో సస్పెన్షన్‌కు దారి తీసింది. సభకు ముందు నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాటు సారా మృతుల పాపం సీఎం జగన్‌ రెడ్డిదే అని ప్లకార్డులు ప్రదర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు.

శాసన మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యాడు. టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని.. పెద్దల సభలో చిల్లరగా గలభా చేస్తున్నారని ఆరోపించాడు. శాసన మండలి ఛైర్మన్‌ పట్ల లోకేష్‌ అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించాడు. చంద్రబాబు బయటి నుంచి సభను కంట్రోల్ చేస్తున్నాడ‌ని చెప్పాడు . మద్యం విషయంలో టీడీపీ చెబుతున్న బ్రాండ్‌లన్నీ సీ బ్రాండ్‌లే అని.. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి కన్నబాబు చెప్ప‌డంతో టీడీపీ స‌భ్యులు నిర‌స‌న‌ల‌ను మ‌రింత పెంచారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించి, విజిల్స్ వేయడంపై సభ చైర్మన్ మోషెన్ రాజు అభ్యంత‌ర‌పెట్టాడు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. చిడతలు వాయించడం ద్వారా సభా గౌరవం దెబ్బ‌తింద‌ని భావిస్తున్నాడు. విజిల్స్ వేయడం, వెల్‌లోకి వ‌చ్చే హక్కు స‌భ్యుల‌కు లేద‌ని చైర్మ‌న్ సూచించాడు. ఇక చివ‌రి రోజు టీడీపీ సభ్యుల నిరసన కొనసాగింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పోడియంను చప్పరిస్తూ శబ్దాలు చేయ‌డం నిర‌స‌నలోని హైలెట్‌. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మంగళసూత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ మద్యపాన నిషేధం డిమాండ్ చేయ‌డం అసెంబ్లీలో గంద‌ర‌గోళానికి దారితీసింది. శాసనమండలిలోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీలు మహిళలను అవమానించారని వైఎస్సార్సీపీ మహిళా సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొనడంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సభను కాసేపు వాయిదా వేసి తిరిగి ప్రారంభించారు.

అయితే సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎనిమిది మందిని మండలి చైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. అంతకుముందు నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు అసెంబ్లీ దగ్గర నిరసనకు దిగారు. మహిళలు మంగళసూత్రం పట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 42 మంది మృతిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల ఫొటోలకు టీడీపీ నేతలు నల్ల కండువాలు కప్పి నివాళులర్పించారు. మొత్తం మీద రోజుకో రీతిగా ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని టీడీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చ‌మ‌ట‌లు ప‌ట్టించార‌న్న‌మాట‌.