TDP : జ‌గ‌న్ ఆర్థిక ఉగ్ర‌వాదంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల ప్ర‌జెంటేష‌న్‌

సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసులు,అవినితీపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 05:30 PM IST

సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసులు,అవినితీపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో మాక్ అసెంబ్లీ నిర్వ‌హించి జ‌గ‌న్ అవినీతిపై ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. 3,30,500 కోట్ల ప్రజాసంపదను దిగమింగిన ధన పిశాచి జగన్ రెడ్డి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 16 నెలల జైలు జీవితం… 38 క్రిమినల్ కేసులు.. 54 డిశ్చార్జ్ పిటిషన్లు…158 స్టేలు…లెక్కకుమిక్కిలి ఐపీసీ సెక్షన్లు…మొన్ననే పూర్తైన పదేళ్ల బెయిల్ కాలం.. ఇదీ జగన్ రెడ్డి సచ్ఛీలత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి క్విడ్ ప్రోకో, షెల్ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి పదాలను… వాటి తీరుతెన్నుల్ని పరిచయం చేసిన వ్యక్తి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డని, వాటి ద్వారా నాడు తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేసింది చాలక, ఈ నాలుగేళ్ల లో ప్రజల్ని పీడిస్తూ, రాష్ట్రాన్ని లూఠీచేసి లక్షలకోట్లు సంపాదించాడని నిమ్మల రామానాయుడు తెలిపారు. అలాంటి వ్యక్తి ఈ రోజు అవినీతిపై సుభాషితాలు చెప్పడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ చరిత్ర మొత్తం తెరిచిన పుస్తకమ‌ని.. అలాంటి వ్యక్తిపై జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 హౌస్ కమిటీలు వేసి ఏమీ తేల్చలేకపోయారని గుర్తు చేశారు. వాటన్నింటి విచారణలో కడిగిన ముత్యంలా చంద్రబాబు ఆనాడు బయటపడ్డారని.. తరువాత జగన్ రెడ్డి తల్లిగారైన శ్రీమతి విజయ మ్మ చంద్రబాబునాయుడు అవినీతి చేశాడని న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి, ఆధారా లు, సాక్ష్యాలు లేకపోవడంతో చివరకు తన పిటిషన్లు తానే వెనక్కు తీసుకున్నార‌ని తెలిపారు. అదీ చంద్రబాబునాయుడి నీతి..నిజాయితీ…నిబద్ధతలకు నిదర్శనమ‌ని రామానాయుడు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి వ్యక్తిత్వం అలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతి, దోపిడీ ఎలా మొదలై.. ఎలా కొనసాగి.. నేడు ఎలా పతాకస్థాయికి చేరిందో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయ‌న వివ‌రించారు.