AP Assembly : టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

  • Written By:
  • Updated On - February 6, 2024 / 11:23 AM IST

ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ప్రారంభం అవ్వగానే ధరల పెరుగుదలపై టిడిపి నేతలు (TDP Leaders) తీర్మానం చేపట్టాలని ఆందోళనకు దిగారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చను ప్రారంభించారు. ఈ తరుణంలో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన ఉదృతం చేస్తూ..పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ తరుణంలో అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు.

వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో వెంటనే వెళ్ళాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లారు. ఈలలు వేసుకుంటూనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకుముందు అసెంబ్లీ వెలుపల.. అసెంబ్లీ క్రాస్ రోడ్ నుంచి ప్రధాన గేటు వరకూ.. టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ధరలు, పన్నులు, ఛార్జీల భారంతో సామాన్యుడు విలవిలలాడుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పెరిగిన నిత్యావసర ధరలపై ప్రభుత్వం ఎలాంటి ఊరట చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు నేడు సర్పంచుల సంఘం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా.. సర్పంచులంతా ఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ వద్దకు వచ్చిన సర్పంచులను పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్థికసంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందని, సర్పంచుల నిధులు సర్పంచులకే ఇవ్వాలని ఆందోళన చేస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సర్పంచులపై పోలీసులు లాఠీచార్జి చేసి.. అదుపులోకి తీసుకుంటున్నారు.

Read Also : Venu: బలగం వేణు అందులో రెండుసార్లు స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?