TDP Mahanadu 2022 : మ‌హానాడు ఒక్క‌ రోజే.!

తెలుగుదేశం పార్టీకి మ‌హానాడు ఒక పండుగ‌. ఎన్టీఆర్ పుట్టిన రోజును మ‌హానాడు రూపంలో వేడుక చేసుకుంటారు.

  • Written By:
  • Updated On - April 21, 2022 / 03:49 PM IST

తెలుగుదేశం పార్టీకి మ‌హానాడు ఒక పండుగ‌. ఎన్టీఆర్ పుట్టిన రోజును మ‌హానాడు రూపంలో వేడుక చేసుకుంటారు. ప్ర‌తి ఏడాది మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఉత్స‌వంలా జ‌రుపుతారు. రెండేళ్లుగా క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో మ‌హానాడును వ‌ర్చువ‌ల్ గా నిర్వ‌హించారు. ఈ ఏడాది హైద‌రాబాద్ గండిపేట కేంద్రంగా వేడుక‌ల‌ను చేప‌ట్టాల‌ని తొలుత అనుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పొలిట్ బ్యూరో స‌మావేశంలోనూ ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ, హ‌ఠాత్తుగా ఈ ఏడాది మ‌హానాడును ఒక రోజుకు కుదించేశారు. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా మే 28న మాత్ర‌మే మ‌హానాడు నిర్వ‌హించేలా టీడీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు మహానాడు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి ప్రత్యక్షంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ఒక్క రోజుకే మహానాడును పరిమితం చేయాలని చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఒంగోలు శివారులో మహానాడును నిర్వ‌హించ‌డానికి ముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం పెట్ట‌నున్నారు. మహానాడు రోజున (మే 28) ఎవరైనా హాజరుకావొచ్చని టీడీపీ నేతలు పిలుపు నిచ్చారు. ఆ రోజున బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్ట‌డంతో పాటు ఏడాదిపాటు వాటిని కొనసాగిస్తారు.

మ‌హానాడుకు ముందుగా చేప‌ట్టే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం చంద్ర‌బాబు ప్రారంభించారు. వాట్సాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్‌ల ద్వారా సభ్యత్వం తీసుకునే వెసుల‌బాటును క‌ల్పించారు. ఇప్పటికే తీసుకున్నవారు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ మ‌హానాడును ఒక పండుగ‌లా నిర్వ‌హించే ఆన‌వాయితీ ఉండేది. తెలుగు క‌ళ‌లు, సంస్కృతి, సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా ఎన్టీఆర్ హ‌యాంలో మ‌హ‌నాడు జ‌రిగేది. ఎన్టీఆర్ బ‌తికి ఉన్న‌ప్పుడే వివిధ కార‌ణాల‌తో మహానాడును నిర్వ‌హించ‌లేక‌పోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2018 లో జరిగిన మహానాడు చివరిసారి సెషన్లలో, పార్టీ అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ప్రాజెక్ట్, ఐటి, నీటి మెరుగుదల, రైతుల అభ్యున్నతి, రాజకీయాలలో మహిళల ప్రమేయం, సాధికారత మొదలైన వాటి గురించి చర్చించింది తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు కూడా ఈసారి మ‌హానాడు కేంద్రంగా జ‌రుపుకోవాల‌ని తొలుత భావించారు. కానీ, అనూహ్యంగా ఒక రోజుకు మాత్ర‌మే కుదించ‌డంతో పాటు ఏడాది పాటు ఎన్టీఆర్ జ‌యంతి ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు.
వ‌చ్చే రేండేళ్లు టీడీపీ రాజ‌య‌కీయ భ‌విష్య‌త్‌కు కీల‌కం. అందుకే, ఎన్టీఆర్ చ‌రిష్మాను వీలున్నంత వ‌ర‌కు ఉప‌యోగించుకోవాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేశారు. నంద‌మూరి ఫ్లేవ‌ర్ ను ఎన్నిక‌ల‌కు బాగా ట‌చ్ చేయాల‌ని వ్యూహం ర‌చించారు. అందుకే ఏడాది పాటు ఎన్టీఆర్ శత‌జ‌యంతి వేడుక‌ల‌కు ప్ర‌ణాళిక ర‌చించారు. అంటే, 2023 మే 28వ తేదీ వ‌ర‌కు ఎన్టీఆర్ నామ‌స్మ‌ర‌ణ ప్ర‌తి టీడీపీ కార్య‌క‌ర్త‌, సానుభూతిప‌రుల్లో ఉండేలా చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌ప‌డ్డారు. వ‌చ్చే ఏడాది మ‌హానాడు నాటికి ఎన్నిక‌ల హ‌డావుడిలోకి వ‌చ్చేస్తారు. ఆలోపుగా ఎన్టీఆర్ గ్లామ‌ర్ ను వీలున్నంత వ‌ర‌కు పార్టీకి మ‌రోసారి ఉప‌యోగించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా స్కెచ్ వేశారు. అంతేకాదు, శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు, లోకేష్ పాల్గొంటారు. బ‌స్సు యాత్ర ద్వారా బాబు పాద‌యాత్ర రూపంలో లోకేష్ ఏడాది పాటు జ‌రిగే ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఎన్నిక‌ల‌కు పార్టీ క్యాడ‌ర్ ను సిద్ధం చేసే క్ర‌మంలో మ‌హానాడును ఒక రోజుకు ప‌రిమితం చేయ‌డం మాత్రం పార్టీలో హాట్ టాపిక్ అయింది.